మనం మనకు తెలిసేసరికి
మనలోంచి మనం లేచేసరికి
మననుంచి మనం దూరం
పోయి చూస్తూ వుంటాం
ఆ దారం ఒక కొసనుంచి
ఇంకో కొసకు పాకుటకు
మధ్యలో తెగిన ముళ్ళ కుచ్చులు
గొంతులో తట్టినట్టు
కడుపులో పిసికినట్టు
వదిలేసే వదులులను
బిగపట్టే బిగువులను
తెలిసి తెలిసి పోగొట్టుకున్న వాటి
కషాయాల మొఖం ముడుపులను
బిచ్చగత్తె చూపులు
రైతుకళ్ళ నిరీక్షణలు
కూలివాడి దేహం మాటలను
పెళ్ళికూతురు అడిఆశలను
మూగజీవి స్పృహను
ఇంకా అతుకుల బతుకులందరి
నిలువు ఆకారాలు…
ఇవన్నీ ఎదో జరుగుద్దనో
ఇంకా జరగబోతుందనో
పడిగాపుల ప్రక్రియలో
చచ్చేవరకూ చచ్చిపోతూ
అలసి అరిగి ఇంకా ఎదో ఎందుకో
పోరాటంలో విసిగి విరిగి
ఒక ఎండిన ఆశల
చిగురుల మూటను
భుజాన వేసుకుని
గతుకుల కాలి బాటన
ఎండకు వానకు చలికి
వైపరీత్యల ప్రవాహానికి ఎదురొడ్డి
చివరికి ఒక ముద్రలో
చావు ఒడిలో కూడా
ఆపై గుంతలో…
ఏ పనిలోనో నిమగ్నమైనట్టు
మహాప్రస్థానం గాంచుతున్నట్టు పాపం
నిరంతరం శ్రమజీవులు ఇన్నీ చేసి…
ఏదో ఇచ్చిపోతున్నట్టో
ఇంకేదో మోసుకుపోతున్నట్టో
ఇంకా కొన్నాళ్ళు బతికుంటే
మరింకేదో సాధిస్తాం అన్నట్టో
ఒక దిగులు కవితను మిగిల్చిపోతున్నారు!

– రఘు వగ్గు
9603245215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *