దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై…!

ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా కొనసాగుతున్నది. కొన్ని శక్తుల కారణంగా ఈ దేశం పునాదులకే ప్రమాదం ఏర్పడనుంది. అది తలచుకుంటేనే భయంవేస్తుంది. ఈ పరిస్థితినుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. ఈ దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది తమ జీవితాలనే త్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితంగా లభించిన ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్న మనం రానున్న తరాలవారికి కూడా అందించాల్సిఉంది. అందుకు ఈ ప్రజాస్వామ్య విలువలు అడుగంటి పోకుండా కాపాడుకోవాలంటే, జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాల్సిఉంది. అంతో ఇంతో ఆ ఫలితాలను అనుభవించిన మన తరం వృద్ధులమై• పోతున్నందున దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిది. ప్రజాస్వామ్యానికి మూలస్తంబాలైన లెజిస్లేచర్‌, ‌కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పాటు పత్రికలు(మీడియా) తమ బాధ్యతను గుర్తించాలి. ప్రధానంగా న్యాయవ్యవస్థ, మీడియా ఇలాంటి సమయాల్లో మౌనం వహించడం మంచిదికాదు. వికృత పద్దతుల్లో జరుగుతున్న దమనకాండను తమ పరుదుల్లో అడ్డుకోకపోతే దేశం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో దానికున్న పేరు ప్రతిష్టలు దిగజారిపోయే ప్రమాదముందంటూ టిఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంఎల్‌ఏలను ప్రతిపక్ష పార్టీ రహస్యంగా కొనుగోలు చేసే కార్యక్రమం బట్టబయలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని కెసిఆర్‌ ఈ ‌సుదీర్ఘ ప్రసంగం చేశారు. నా గడ్డ మీదకే వొచ్చి, నా ప్రభుత్వాన్ని కూలదోస్తానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానంటూ ఆయన బిజెపిపైన విరుచుకు పడ్డారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఏలకు బిజెపి ఎలా ఎర వేసిందన్న విషయాలను ఆయన కొన్ని ఫోటోలు, విడియో, ఫోన్‌ ‌సంభాషణలను బహిర్ఘతం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం పెద్ద సంచలనాన్ని లేపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎంతటి దిగజారుడుకు ఒడికట్టిందంటూ ఆయన తన వద్ద ఉన్న రుజువులను దేశవ్యాప్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర నాయకత్వమే అక్రమాలు, అన్యాయాలకు పాల్పడితే దేశమేగతి బాగుపడుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఎనిమిది ప్రభుత్వాలను కూలదోసిన విషయాన్ని బిజెపి పక్షాన తెలంగాణకు చెందిన నలుగురు శాసనసభ్యులను కొనుగోలుకు వొచ్చినవారిగా ఆరోపణలు ఎదురుకుంటున్న ముగ్గురు వ్యక్తుల మాటలద్వారా స్పష్టమైందంటూ అందుకు సంబంధించిన ఆడియాను కెసిఆర్‌ ‌ప్రజలముందుంచారు. అంతటితోనే ఆగకుండా మరో నాలుగు రాష్ట్రాలను కూలదోయడానికి పథక రచన చేస్తున్నట్లుగా వారి మాటలద్వారా వెల్లడైన అంశాలను ఆయన దేశ ప్రజలకు వెల్లడించారు. తెలంగాణతోపాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌దిల్లీ ప్రభుత్వాలను పడదోసే ప్రణాళికా రచన కుతంత్రాన్ని ఆయన మీడియా ముందు పెట్టడం ఆయా రాష్ట్రాలకు ఒక విధంగా ఒళ్ళు జలదరించే అంశంగా మారింది.

అయితే ఇంతటి దారుణ పరిస్థితిని చూస్తూ ఊరుకోవడం భావ్యంకాదన్న దృక్పథంతో దేశంలోని సర్వోన్నత న్యాయస్థానానికి తమకు లభించిన సమాచారమంతా అందజేసినట్లు కెసిఆర్‌ ‌వివరించిన తీరు నిజంగానే దీని వెనుక షడయంత్రం ఏదో జరిగి ఉంటుందన్న ఆలోచన ఇప్పుడు దేశ ప్రజల్లో కలుగుతున్నది. కేవలం చీఫ్‌ ‌జస్టీస్‌కే కాకుండా, సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులకు, ఆయా రాష్ట్రాల ఉన్నత న్యాయమూర్తులందరికీ, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వివిధ పార్టీల అధ్యక్షులకు పంపించడం ద్వారా దాన్ని ఎవరూ చెరిపివేసే ప్రయత్నం లేకుండా చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఏదో ఒక రోజు, ఒక నెలలో జరిగింది కాదని, 2015 నుండి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వేలాది పేజీల కాల్‌డేటా తమకు లభ్యమైందని చెప్పిన కెసిఆర్‌, ఆ ‌మొత్తం సమాచారాన్ని వివరించడానికి ఒకటి, రెండు రోజుల సరిపోవని, అందుకే అందుకు సంబంధించిన వీడియో, ఆడియోలన్నీ ఫోర్త్ ఎస్టేట్‌ అయిన మీడియా కార్యాలయాలన్నిటికీ అందజేసనట్లుగా ఆయన చెప్పడం చూస్తుంటే నిప్పులేనిదే పొగ వొస్తుందా అన్న అనుమానం కలుగకపోదు. ఏదో ఒక అంశంగా కాకుండా, అనేక అంశాలతో మిళితమైన దీన్ని ఒక్కో అంశంగా పరిశీలన జరుపాల్సిందిగా ఆయన న్యాయవ్యవస్థకు వినమ్రంగా నమస్కరిస్తూ వేడుకోవడంకూడా దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై అన్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే ఇదంతా ఓ కట్టుకథగా బిజెపికి చెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు కొట్టిపారేయడం ఇందులో కొస మెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *