వీడియో సందేశం విడుదల చేసిన మాజీ సిఎం కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : తనను పరామర్శించేందుకు, చూసేందుకు అభిమానులు, పార్టీ నేతలు యశోద హాస్పిటల్‌కి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన వీడియో వీడియో సందేశంలో కేసీఆర్… ‘నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు. త్వరలోనే కోలుకుని విూమధ్యకు వొస్తాను. ఇన్ఫెక్షన్ వొస్తుందని డాక్టర్లు నన్ను బయటకు పంపడంలేదు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని విూ నడుమకే వొస్తానని.. అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దు’… అని సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా ఓ వీడియోను కేసీఆర్ విడుదల చేశారు. ఇదిలావుంటే సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోని ప్రజాసేవలోకి రావాలని అక్బరుద్దీన్ ఆకాంక్షించారు. ఇప్పటికే కేసీఆర్‌ను చంద్రబాబు, చిరంజీవి, ప్రకాశ్ రాజ్, భట్టి విక్రమార్క, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన సంగతి తెలిసిందే.



