తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుపై చర్యలు ఏవీ..?

తెలంగాణ వైతాళికుడి జయంతి నేడు

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెడతామని గతంలో సిఎం కెసిఆర్‌ ‌సహా మంత్రులు ప్రకటించినా నేటికీ ఆ మహానుభావుడి గురించి చర్చించుకోవడం లేదు. ఆయన పేరును యూనివర్సిటీకి పెడతామన్న వారు మళ్లీ మాట్లాడడం లేదు. జయంతి సందర్భంగా దండలేసి చేతులు దులుపుకోవడంతోనే కాలం గడిచిపోతోంది. సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపకుల్లో ఒకరైన ప్రతాపరెడ్డి తెలుగు లిపిలో ఆవశ్యక సంస్కరణల గురించి విశేష పరిశోధన చేశారు. సాహిత్యం, చరిత్ర, సంస్క•తి మూర్తీభవించిన మహోన్నతుడు ప్రతాపరెడ్డి. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి ’గోల్కొండ పత్రిక’ స్థాపించి ఎనలేని సేవ చేశారు. ఆనాడు హైదరాబాదులో తెలుగు మాట్లాడే వారే అరుదు. అలాంటి రోజుల్లో ధైర్యంగా తెలుగు పత్రిక స్థాపించి దాని సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించి పత్రికను క్రమం తప్పకుండా వెలువరిస్తూ ఇతోధిక సేవ చేశారు. తన శక్తినంతా ధారపోసి గోల్కొండ పత్రికను నడిపి, తెలంగాణ వాసుల్ని జాగృతం చేసిన మహానుభావుడాయన.

తెలంగాణలో కవులులేరు అనే అపప్రథ పోగొట్టడానికి 354 మంది తెలంగాణ కవుల కవితలు, పద్యాలతో ’గోల్కొండ కవుల సంచిక’ను ఆయన వెలువరించారు. ఇది తెలుగు కవితా సంకలనాలలో మణిదీపంగా వెలుగొందు తోంది. తెలంగాణ కవులకు అది ఒక శంఖారావం అయింది. గ్రంథాలయోద్యమ రథసారథుల్లో ప్రతాపరెడ్డి ముఖ్యులు. ఎన్నో సారస్వత విద్యా సంస్థలను నిర్వహించారు. వాల్మీకి రామాయణాన్ని విపులంగా పరిశీలించి ప్రాచ్య, పాశ్చాత్య దృక్పథంతో ఎన్నో చారిత్రక సాంస్క•తిక అంశాలను వివరిస్తూ ’రామాయణ విశేషాలు’ అన్న గ్రంథాన్ని రచించారు. అలాగే హిందువుల పండుగలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, చారిత్రక సాంఘిక ప్రాముఖ్యం, ఆచార వ్యవహారాలు, పండుగలలోని పరమార్ధం తెలుపుతూ రాసిన పుస్తకం ’హిందువుల పండుగలు’ విశేషాదరణ పొందింది. సురవరం ప్రతాపరెడ్డి పేరు చెప్పగానే ప్రతి తెలుగువాడికీ గుర్తుకొచ్చే పుస్తకం ’ఆంధ్రుల సాంఘిక చరిత్ర’. ఇది ఆయన అంతిమ రచన. అత్యంత ప్రశస్తమైన రచన. వేయి సంవత్సరాల సాహిత్య సంపద ఆధారంగా తెలుగు ప్రజల చరిత్రను స్ఫూర్తిదాయకంగా ఆయన వివరించారు. తెలవంగాణకు, తెలుగుకు ఎంతో సేవ చేసిన సురవరం ప్రతాపరెడ్డి 1953 ఆగస్టు 25న కీర్తిశేషుడు అయ్యారు. ఆయన సేవలను స్మరించుకుంటున్నా నేటికీ గుర్తుంచుకునే కార్యక్రమం చేపట్టలేదు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి స్మరించుకోవడం ఉత్తమం.
 – ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *