తెలంగాణ బిజెపిలో గందరగోళం

రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం
హుటాహుటిన దిల్లీకి కిషన్‌ ‌రెడ్డి
అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌ ‌రెడ్డి
నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ
కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా అన్న అనుమానాలు అధిష్టానాన్ని తొలచి వేస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు ఊపు కనిపించిన పార్టీలో నైరాశ్యం తాండవిస్తుంది. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు అదిష్టానం రంగంలోకి దిగింది. కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డినిఉన్నఫళంగా దిల్లీ రావాలని పిలుపునిచ్చింది. దీంతో షెడ్యుల్డ్ ‌కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఆయన దిల్లీ వెళ్లారు. అంతకుముందే ఈటల రాజేందర్‌, ‌రాజగోపాల్‌ ‌రెడ్డి దిల్లీకి వెళ్లారు. మరోవైపు నేడు నాగర్‌కర్నూలు పర్యటన కోసం పార్టీ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్‌ ‌వొస్తున్నారు. దీంతో బీజేపీలో ఏం జరుగుతుందో అన్న చర్చ మొదలైంది. ఈటల రాజేందర్‌, ‌రాజగోపాల్‌ ‌రెడ్డితో పార్టీ హైకమాండ్‌ ‌భేటీలో కిషన్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఈటల రాజేందర్‌, ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వొస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ ‌వర్గం, ఈటల వర్గానికి దూతగా కిషన్‌రెడ్డిని అధిష్టానం పిలిచినట్లు తెలుస్తుంది.

వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కిషన్‌రెడ్డిని ఉపయోగించుకోవాలని హైకమాండ్‌ ‌యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ లెక్క మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో పరిణామాలపై ఆసక్తి నెలకొంది. 2023లో అధికారం మాదే అంటూ ప్రచారం చేసిన బీజేపీ లీడర్లు కర్ణాటక ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయిపోయారు. అదే టైంలో కాంగ్రెస్‌ ‌స్పీడ్‌ అం‌దుకుంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులందర్నీ లాక్కునే పనిలో ఉంది. దీంతో బీజేపీలోకి వొస్తామని చెప్పిన వాళ్లాంతా కమలానికి హ్యాండిచ్చి కాంగ్రెస్‌ ‌చేతిలో చేయివేసి వెళ్లిపోతున్నారు. ఇది బీజేపీకి అతి పెద్ద సవాల్‌గా మారింది. వొస్తామని చెప్పిన వాళ్లు వెళ్లిపోతే బీజేపీకి పెద్దగా సమస్య లేకపోవచ్చు కానీ… ఉన్న వారిలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మరింత కంగారు పెట్టిస్తుంది. అందుకే అధినాయకత్వం రంగంలోకి దిగి అసంతృప్తులను పిలిచి మాట్లాడుతుంది. ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు జారుకుంటే పెద్ద దెబ్బ బడే ఛాన్స్ ఉం‌దని గ్రహించి దిద్దుబాటు చర్యలకు దిగుతుంది.

బీజేపీలో అసంతృప్త నేతల జాబితాలో మెయిన్‌గా ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్‌, ‌కోమటి రెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిలు చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. వీళ్లకు బండి సంజయ్‌ ‌వర్గానికి అసలు పడటం లేదని బీజేపీలో టాక్‌ ‌వినిపిస్తుంది. అందుకే వీళ్లు ఎప్పుడో ఒకప్పుడు పార్టీ మారిపోతారని విశ్లేషణలు ఉన్నాయి. అయితే పదే పదే ఆ ఆరోపణలు ఖండిస్తున్నప్పటికి కూడా ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీంతో వాళ్లిద్దర్నీ అధిష్ఠానం పిలించింది. వారితోపాటు కిషన్‌ ‌రెడ్డిని కూడా అధినాయకత్వం పిలిచింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, చేరికలపై ఆరా తీయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వీటిపైనే కాకుండా పొత్తుల అంశంపై కూడా బీజేపీ అధినాయకత్వం మాట్లాడబోతుందని టాక్‌ ఉం‌ది. మరోవైపు మంత్రి కేటీఆర్‌ ‌దిల్లీలోనే ఉన్నారు. మంత్రులతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య పెద్ద స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వినిపించడం లేదు. లిక్కర్‌ ‌స్కామ్‌పై కూడా బీజేపీ మాట్లాడటం లేదు. ఈ పరిణామాలతో కిషన్‌రెడ్డితోపాటు మిగతా నేతలను అధినాయకత్వం పిలవడం చర్చనీయాంశమైంది.

నేడు రాష్ట్రానికి జెపి నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ
ఆదివారం తెలంగాణకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలను కాషాయ పార్టీ హైకమాండ్‌ ‌సెట్‌ ‌చేసే పనిలో పడింది. ఆదివారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో నడ్డా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నడ్డా పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనాన్ని సవి•కరించేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందిస్తుంది. నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు నడ్డా చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:15 గంట నుంచి 2:30 గంటల వరకు సంపర్క్ ‌సే అభియాన్‌లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను నడ్డా కలవనున్నారు. సాయంత్రం 3:00 గంటలకు నోవాటెల్‌ ‌హోటల్‌కు నడ్డా చేరుకోనున్నారు. సాయంత్రం 4:00 గంటల వరకు నోవాటెల్‌ ‌హోటల్లోనే నడ్డా బస చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి నాగర్‌ ‌కర్నూల్‌ ‌సభకు హెలికాప్టర్‌లో నడ్డా బయలుదేర నున్నారు. సాయంత్రం 4:45 నిమిషాలకు నాగర్‌ ‌కర్నూల్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాగర్‌ ‌కర్నూల్‌ ‌జడ్పీహెచ్‌ఎస్‌ ‌స్కూల్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో నడ్డా ప్రసంగిస్తారు. సాయంత్రం 6:10 నిమిషాలకు నాగర్‌ ‌కర్నూల్‌ ‌నుంచి బయలుదేరి సాయంత్రం 6:40 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు నడ్డా చేరుకోనున్నారు. సాయంత్రం 7:40 నిమిషాలకు ఎయిర్‌ ‌పోర్ట్ ‌నుంచి తిరువనంతపురానికి నడ్డా బయలుదేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *