తెలంగాణ ఎంపి సీట్లపై బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణ ఎంపి సీట్లపై భారతీయ జనతాపార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే తెలంగాణపై 2018 శాసనసభ ఎన్నికలనుండే ప్రత్యేక శ్రద్ధ  కనబరుస్తూ వొచ్చింది. అయితే గత రెండు విడుతల ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలను పొందలేకపోయింది. దాంతో గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగురవేయాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం ఎంపీ స్థానాలనైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఇప్పుడు పార్టీ ఉంది. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు మే 13వ తేదీగా ఎన్నికల కమిషన్‌  ప్రకటిస్తున్న క్రమంలోనే  మోదీ తెలంగాణలో వరుసగా మూడు రోజులపాటు వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. అంతేకాదు  పార్లమెంటు ఎన్నికలలోపు కనీసం అయిదుసార్లు అయినా  తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజిగిరి మొదలు నాగర్‌ కర్నూలు, జగిత్యాల సభలన్నిటిలో ఆయన నినాదం ఒక్కటే. అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌.. ఈసారి నలుగు వందలకు మించిన స్థానాలను బిజెపికి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అందులో భాగంగానే తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలన్నిటిలో బిజెపి అభ్యర్థులను గెలిపించండంటూ ఆయన ప్రజలను కోరుతున్నారు. వాస్తవానికి తమ గెలుపు ఖాయమన్న విషయం ఇప్పటికే తేలిపోయింది. అవుర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారుంటున్నారు మోదీ. తాను  ప్రధాని కావడాన్ని ఎవరూ నిరోధించలేరంటూ  గతంలో ఏ ప్రధాని కూడా తానే కాబోయే ప్రధానినని చెెెప్పుకోనివిధంగా ఈ ప్రచార సభల్లో మోదీ స్పష్టం చేశారు.ముఖ్యంగా మల్కాజీగిరిలో మోదీ రోడ్‌ షోకు  ఆదరణ  లభించింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజవర్గంగా దీనికి పేరుంది. రోడ్లన్నీ కాషాయ జండాలు, పూలదండలతో నిండిపోయాయి. ప్రత్యేక వాహనంపైన ఉన్న మోదీ కుంకుమపువ్వు టోపీ ధరించి  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్‌ పొడవున కిక్కిరిసి బారులుతీసిన ప్రజలు స్వాగతం పలికిన తీరే తన గెలుపుకు నిదర్శనమంటారు మోదీ. ఇది ఒక విధంగా తెలంగాణ ప్రజలు తమను ఆమోదించడమేనంటారాయన.

ఆ తర్వాత నాగర్‌ కర్నూల్‌ విజయ సంకల్ప సభలో, జగిత్యాల సభలో మోదీ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ను, ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితిపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలేనని, ప్రజల సంక్షేమం కన్నా తమ స్వార్థ ప్రయోజనాలే ఈ పార్టీల లక్ష్యంగా ఉంటుందంటూ ఘాటైన విమర్షలు చేశారు. ఇప్పటివరకు బిఆర్‌ఎస్‌ అవినీతి చేస్తూ వొచ్చింది, ఇప్పుడిక కాంగ్రెస్‌ వంతు వొచ్చింది. రాష్ట్రాన్ని వినాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఈ అయిదేళ్ళు చాలు.. సామాజిక న్యాయం పేరుతో ఈ పార్టీ పబ్బం గడుపుతోంది.. ఇదే పార్టీ ఒక గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిరచేందుకు ప్రయత్నించింది.. అంతెందుకు యాదాద్రిలో చిన్నపీట వేసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అవమానించారంటూ ఆయన కాంగ్రెస్‌ చెబుతున్న సామాజిక న్యాయంపైన దాడిచేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా తనను ఎవరూ అవమానించలేదని, తానే ఆ స్థానంలో కావాలని కూర్చున్నానని అప్పటికే భట్టి మీడియా ముఖంగా చెప్పినా, మోదీ ఆ విషయాన్నే ఎత్తిచూపడం ద్వారా కాంగ్రెస్‌ను  టార్గెట్‌ చేసే ప్రయత్నం చేసారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పడిన ఈ పదేళ్ళలో ఇక్కడ జరుగాల్సినంత అభివృద్ధి జరుగలేదంటూ గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇంతవరకు దిల్లీ  లిక్కర్‌ స్కామ్‌పై నేరుగా స్పందించని మోదీ, రాష్ట్ర పాలకులు అవినీతి దిల్లీ  వరకు పాకిందంటూ అందుకు బిఆర్‌ఎస్‌ పైన తెలంగాణ ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారంటూ ఆ పార్టీ అవినీతిపై విరుచుకు పడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పుడు సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.. ప్రజలంతా ఇప్పుడు బిజెపివైపు చూస్తున్నారు.. ఈ ఎన్నికలవేళ బిజెపికి మద్దతు పలికేందుకు వరుస కడుతున్నారు.. ఇప్పటికే తెలంగాణ అభివృద్ధి  కోసం బిజెపి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వంనుండి అనేక కార్యక్రమాలు అమలులో కొనసాగుతున్న విషయం తెలియందికాదు.. ఒక్క తెలంగాణలోనే కాదు కేంద్రంలో బిజెపికి ప్రజలు మంచి మెజార్టీ ఇవ్వడంతోనే దేశంలో మార్పు ప్రారంభమైంది.. రానున్న ఎన్నికల్లోకూడా బిజెపిని గెలిపించే గ్యారంటీ ప్రజలిస్తే, అభివృద్ధి గ్యారంటీ నేనిస్తానంటూ మోదీ ప్రజలను ఆకట్టుకునే విధంగా  ప్రసంగాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలను ఆకట్టుకేందుకు ఆయన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించడం, నమో యాప్‌ ద్వారా తన ప్రసంగాలను తెలుగులోకి డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ తెలుగు ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు.
 -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *