తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉంది

ఈసారి బిజెపికి 14 ఎంపి  సీట్లు ఖాయం
మోదీ  పాలనలో రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం
కేసీఆర్‌ ‌పాలనలో రాష్ట్రం అవినీతిమయం
కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు
రోడ్ల కోసం రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ‌పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కు కేంద్ర మాజీమంత్రి ప్రకాష్‌ ‌జవదేవకర్‌ ‌పూర్తి మద్దతును పలికారు. తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ అన్నారు.  ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్‌ ‌తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేశారనీ,  తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజ••కు ఉందనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు. నితిన్‌ ‌గడ్కరీ ఎట్లనో బండి సంజయ్‌ ‌కూడా అట్లనే ఉన్నడు..పని మొదలు పెడితే పూర్తి చేసి తీరుతాడన్నారు.  మహజన్‌ ‌సంపర్క్ అభియాన్‌లో భాగంగా సోమవారం బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌, ‌కరీంనగర్‌, ‌సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి,  రావు పద్మ, పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బోయినిపల్లి ప్రవీణ్‌ ‌రావుతో కలిసి సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌నియోజకర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి విచ్చేశారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌మాట్లాడుతూ…..మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారని చెప్పారు.

గత 70 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కిలో మీటర్ల మేరకు రోడ్లు నిర్మిస్తే…మోదీ 9 ఏళ్ల పాలనలో అంతకుమించి రోడ్ల పనులు ఈ కొనసాగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ పాలనలో 50 వేల కిలో మీటర్ల మేరకు రోడ్ల పనుల నిర్మాణం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినందున మహజన్‌ ‌సంపర్క్ అభియాన్‌ ‌కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను అక్కడికి వచ్చానని జవదేకర తెలిపారు. అందులో భాగంగా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు సముద్రాలకు వొచ్చాననీ,  ఈ రహదారి పనులు పూర్తయితే  సిద్దిపేట, హుస్నాబాద్‌, ‌ముల్కనూర్‌, ఎల్కతుర్తి సహా 14 గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో రోడ్లు వేస్తే ఏడాది దాటితే దెబ్బతినేవని,  అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయి హయాంలో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి జాతీయ రహదారుల పనులు చేపట్టారన్నారు. 5 ఏళ్ల పాటు రోడ్లు దెబ్బతిన్నా కాంట్రాక్టర్‌ ‌భరించేలా నిబంధన విధించారనీ గుర్తు చేస్తూ… మోదీ పాలనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ ‌పాలనలో రోడ్‌ ‌తక్కువ అవినీతి ఎక్కువ అని జవదేకర్‌ ‌విమర్శించారు. 1948లో నిజాం పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించిందని అన్నారు. 2 వేల 500 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల పనులు జరిగితే మోదీ హయాంలో 9 ఏళ్లలోనే అంతకుమించి రోడ్ల పనులు జరిగాయన్నారు. మోదీ సర్కార్‌ ‌పనులు అద్భుతంగా ఉన్నాయనీ, అవినీతి లేదని, మోదీ కేబినెట్‌లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చ లేదని అన్నారు. లక్షా 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఖర్చు చేసిందని, దేశ వ్యాపతంగా 9 ఏళ్లలో 50 వేల కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల పనులు చేపట్టారన్నారు. తాను ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఇంఛార్జీగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం  పోరాడినమని, రాజ్యసభలో తాను కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అందరమూ పోరాడినందునే తెలంగాణ వొచ్చిందని, కానీ, 9 ఏళ్లలో తెలంగాణ అవినీతిమయమైందని, కుటుంబ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మళ్లీ ఎన్నికల తరువాత తాను ఇక్కడికి వొస్తానని అన్నారు. బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బిజెపిని అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఇక్కడ రోడ్ల పనులు ఎట్లా జరుగుతున్నాయనే అంశాన్ని ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించడానికి వొచ్చాననీ, మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు జిల్లా అధ్యక్షులు, స్థానిక నేతలు ఇక్కడికి వొచ్చారన్నారు. మస్కట్‌ ‌నుండి వొచ్చిన వ్యక్తి కొరోనా టీకా రెండు డోసుల కోసం రూ.14 వేలు ఖర్చు పెట్టారని చెప్పారు. మరి మీరెంత ఖర్చు చేశారని ఆయన  ప్రజలను ప్రశ్నించారు. ప్రజలందరికీ మోదీ ఫ్రీగా టీకా డోసులను అందించారని, మూడేళ్లపాటు ఉచితంగా రేషన్‌ ‌బియ్యం అందిస్తున్న ఘనత మోదీదేనని తెలిపారు జవదేకర్‌. ‌పిఎం ఆవాస్‌ ‌యోజన కింద కేంద్రం తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు ఇచ్చిందని, మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్‌ ‌కనెక్షన్లు ఇచ్చిందీ కేంద్రమేనని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను వొచ్చానని తెలిపారు. ప్రతి ఒక్కరూ 8919847687 నంబర్‌కు మిస్డ్ ‌కాల్‌ ఇచ్చి బిజెపికి మద్దతు తెలపాలని కోరుతున్నాననీ, 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి పార్టీకికి 14ఎంపి సీట్లు రావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ ‌జవదేకర్‌ ‌దీమాను వ్యక్తం చేశారు.

రోడ్ల కోసం రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
‌గత 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో గత 4 ఏళ్లలోనే 7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. అందులో రోడ్ల నిర్మాణం కోసమే రూ.4 వేల కోట్లకుపైగా నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ‘‘మహజన్‌ ‌సంపర్క్ అభియాన్‌’’‌లో భాగంగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తదితరులతో కలిసి హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి వొచ్చిననాయన ‘‘ఎల్కతుర్తి- సిద్దిపేట’’ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సాధించిన విజయాలు, అబివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలకు వివరించేందుకు మహజన్‌ ‌సంపర్క్ అభియాన్‌ ‌ముఖ్య ఉద్దేశ్యమని, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రముఖులను కలవడం, కేంద్ర నిధులతో జరుగుతున్న అభివ్రుద్ధి పనులను పరిశీలించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ‘మీరు ఎంపీగా గెలిపించారు కాబట్టే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. మీరు నన్ను ఎంపీగా గెలిపించాక ఎల్కతుర్తి-సిద్దిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 578 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ విషయంలో గతంలో కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీని కలిసి వారి సహకారంతో ఈ నిధులను మంజూరు చేయించాను. పనులు కొనసాగుతున్నాయి. 15  శాతం పనులు పూర్తయ్యాయి. 2024లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల 14 గ్రామాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది’ అని బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *