తూచడం చాలా కష్టమైన పని. పరిణత, శిల్పం, వస్తుస్పృహ, భాషా వివేచనలను తూకంరాళ్లు వేసి విమర్శనాత్మకంగా  విశ్లేషించి తూచడమంటే సముద్రాన్ని ఎదురీది ఒడ్డున పడడమే. పలు సాహిత్యాంశాలపై 1994 నుండి 2022 మధ్య తాను రాసిన 34 సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలను తరాజు పేరుతో ఇటీవల పుస్తకంగా వెలువరించిన డాక్టర్‌ ‌కాంచనపల్లి గోవర్థన్రాజు లోచూపుతో సాగిన సాహిత్య అవలోకనకు దర్పణమిది. నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రాంతంలోని కవులు, వారి సాహిత్య పరంపరను, భాష, వస్తు స్పృహలను ఆధారం చేసుకుని కవిత్వమైన తెలంగాణ అన్న వ్యాసంలో వివరించారు. తొలి, మలిదశల తెలంగాణ పోరాట కాలపు సాహిత్యకారుల స్ఫూర్తిదాయకమైన రచనలలోని తెలంగాణ స్పృహను  ప్రస్తావిస్తూ ప్రజల జీవన మూల్యాల రక్షణకు, స్వతంత్రేచ్ఛకు సంకేతంగా గుర్తించాలని చెప్పారు. కవిత్వానికి సామాజిక ప్రయోజనం అనివార్యంగా  ఉండాలని చెప్పిన వ్యాసం కవిత్వం –  వ్యక్తీకరణ నైపుణ్యాలు. కవిత్వాన్ని  గుర్తించడమూ, నిర్మాణాన్ని మూల్యాంకనం చేయడమూ క్లిష్టమే ఐనప్పుడు శక్తివంతమైన కవితా ప్రాధాన్యత తెలిసిపోతుందన్న అంశాన్ని స్పష్టపరుస్తూ ఈ వ్యాసం ధారాళంగా కొనసాగింది. కవిత్వ వ్యక్తీకరణ నైపుణ్యాలకు వస్తువుని ఎన్నుకోవడం, శీర్షిక, ఎత్తుగడ, నిర్వాహణ శిల్పం, ప్రతీకలు, ఇమేజ్లు ఎలా ఉపకరణాలుగా తోడ్పడతాయో చెప్పి అనేక మంది కవుల కవితలను ఉదాహరణలుగా చూపించారు. ఆధునికులు, అత్యాధనికుల నూతన కవిత్వ పోకడలను ఈ వ్యాసం వివరించింది. ప్రారంభం, నిర్వాహణ, ముగింపు అనే ముఖ్య విషయాలు ఉంటాయన్న అవగాహనతో కవిత్వాన్ని  నిర్మించాలన్న సూచన చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంగా కవులు రాసిన దీర్ఘ కావ్యాలలోని తాత్త్విక భూమికను విశ్లేషించింది దీర్ఘకవితల్లో తెలంగాణ అన్న వ్యాసం. సమకాలిక స్పృహతో వస్తువులో ఏకతను పాటించి ప్రతీకాత్మకంగా, అనుభూతి సమన్వితంగా వెలువడిన పలువురి దీర్ఘకవితల్లో మార్మికంగా చెప్పిన పోరాట ఆవశ్యకతను వ్యాసకర్త విశ్లేషించి చూపారు. కేవలం మృతుల్ని గురించి వ్యక్తీకరించే  శోక గీతంగా పిలుచుకునే ఎలిజీ విస్తృత ప్రాతిపదికన యుద్ధగీతాలు, రాజకీయ కవితల వరకు పరిణామం చెంది ఆధునిక కవిత్వానికి వచ్చే వరకు మేధో విషయక కృషి లేకుండానే వచన బలం తగ్గించే కవితా వ్యక్తీకరణగా  ప్రత్యేకంగా ఎలా మారిందో వివరించారు. ఆదర్శవంతమైన అహింసా ధోరణిలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భావజాల వ్యాప్తికి ఉద్యమ స్పృహతో నవ తెలంగాణ ఆవిర్భావ ఆకాంక్షలో స్వచ్ఛందంగా కవులందించిన కాంట్రిబ్యూషన్ను కవుల సంగమమైన తెలంగాణ ఉద్యమం అన్న వ్యాసం విశ్లేషించింది.

తెలంగాణ రాష్ట్రావతరణాంతర కవిత్వం – ఒక పరిశీలన అన్న వ్యాసం విభిన్న అస్తిత్వ వాదాలు తెలంగాణ ఉద్యమంతో కలిసిపోయిన తీరును, ఉద్యమ స్మృతిని అవలోకించి అనంతర కొనసాగింపునూ ప్రస్తావించింది. తెలంగాణ కవులలో అగ్రగామిగా నిలిచిన మహాకవి దాశరథి కవిత్వంలోని సౌందర్య దృక్పథాన్ని, రసనిష్పత్తిని, అనుభూతిని చెబుతూ కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావాలను గురించి రాసిన వ్యాసం మహాంధ్రోదయం, రుద్రవీణ, అగ్నిధార, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకంలలోని కవితాత్మను లోతుగా అవలోకించి చూపింది. అసాధారణ సౌందర్య సృష్టికర్తగా, కీర్తించవలసిన మహాకవిగా దాశరథిని పేర్కొన్న వ్యాసమిది. సమాజ గతిలో వికసించిన తాత్విక సృజన చైతన్య పరిమళమంటూ సినారె సాహిత్యాన్ని చూపిన వ్యాసం అజేయ సాహితీ జైత్రయాత్రికుడు సినారె. మంటలు మానవుడు, తేజస్సు నా తపస్సు, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర వంటి కావ్యాల ప్రస్తావనతో ఒక శతాబ్ది వరకు సాహితీ లోకాన్ని వెంటాడే స్మరణీయ సాహితీధారగా సినారెను ఆవిష్కరించి చూపారు. ఉద్యమం కవిత్వానికి పూచిన అగ్నిపుష్పం అన్నట్టుగా ఉద్యమ కవి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణను సమాంతర కవితాస్వాప్నికుడిగా చెబుతూ ఆయన కవితాస్పృహని వెల్లడించారు. కవిత్వంలోపల అనితర సాధ్యమైన తెలంగాణ గ్రామ పదాలను అలవోకగా అమర్చి కవితా రచనకు సరికొత్త  శిల్పాన్ని  చేకూర్చిన  అన్నవరం దేవేందర్ను ఆత్మగల కవిగా అభివర్ణించారు. బహుజన వాదాన్ని ఎత్తుకున్నా, పల్లె దుః ఖానికి  ప్రాతినిధ్యం వహించినా, చిధ్రమైపోయిన బాల్యపు యాది గురించి వాపోయినా  ప్రత్యేక ముద్రతో సాగుతున్న అన్నవరం వ్యక్తీకరణలన్నిటికీ తెలంగాణ చైతన్యమే అంతస్సూత్రమని చెప్పారు. నా జ్ఞాపకాల్లో సినారె అన్న వ్యాసం రచయితకు ఆ మహాకవితో 1984 నుంచి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించింది. అలుపు లేని అవిరామ కవిగా ఆచార్య ఎన్‌ ‌గోపిని వెనుదిరిగిచూడని ఆ అడుగులో అన్న వ్యాసం  తన భావోద్వేగాలను ప్రవాహ వేగంతో వెలువరించగలిగే ప్రాకృతిక కవిగా ఆయనను చూపింది.

అత్యంత పరిణతతో, శిల్ప విషయంగా సాధికారతతో  ఆయోమయం లేకుండా నింపాదిగా కవిత్వం రాస్తున్న ఆత్మవిశ్వాస ధోరణికి ప్రతీకగా కవి బాణాల శ్రీనివాస్ను కవిత్వమై వెలిగిన కుంపటి అన్న వ్యాసం పేర్కొంది. అభివ్యక్తిని వస్తు నిర్వాహణతో సమతుల్యం  చేస్తూ సామ్యవాదాన్ని మానవతతో అనుసంధానం చేసి సమాజానికి అవసరమైన రుబాయీలను ప్రఖ్యాత కవి ఏనుగు నరసింహారెడ్డి అందించిన తీరును తనదైన పరిశీలనాత్మక కోణంలో వ్యాస రచయిత వివరించారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఆధ్యాత్మిక ప్రతీకాత్మక పద్యకావ్యం మకర హృదయంలోని ఔచిత్యమానవీయ కోణాలను వివరించి చెప్పారు. ఉద్యమ పద్యకవి ఆచార్య ఫణీంద్ర ఉద్యమ పద్యకావ్యం తెలంగాణ మహోదయంలోని వస్తు విలక్షణతను వ్యాసకర్త ఎత్తి చూపారు. సాంస్కృతిక నివాసానికి కొత్త నిట్టాడిగా, బహుజన తెలుగు కవిత్వానికి దిక్సూచిగా, ఎగిలివారంగా ఎలుగులో కన్ను తెరిచిన కవిగా పొన్నాల బాలయ్యను అభివర్ణించారు. తపతీ సంవరణము ప్రబంధం నాటి కాలము, అభివ్యక్తి అన్న వ్యాసంలో అద్దంకి గంగాధర కవి, పాటిబండ్ల మాధవశర్మల ప్రస్తావన, నాటి కవితా నిర్మాణంలోని పటిష్టత. సామాజిక జీవనం, చరిత్రల వెలుగును విశ్లేషించారు.

నిద్రారహిత స్థితిలో నిరాకారతతో దాగిన సాకారతను కప్పుకుంటున్న కలలు మాగిన ఒక వాసన ఈ కవిత్వం అంటూ బి.ఎస్‌.ఎమ్‌ ‌కుమార్‌ ‌కవితా సంపుటి దేవుడు చనిపోయిన టీటేబుల్‌ ‌గురించి రాసిన మాటలను కవి – అతని దుఃఖంతో నేను అన్న వ్యాసంలో పేర్కొంటూ అతని దుఃఖపు రవ్వలజడిలోని కాంతితో సమాజాన్ని తడుపుతూనే ఉండాలని చెప్పారు. మౌలిక ధాతువులన్నీ వొంపుకుని మానవానుభూతులను, మానవ సంబంధాల అనులోమ మూల్యాంకానికి తోడ్పడే రేపటి భరోసాలుగా కవయిత్రి వాసరచెట్ల  జయంతి కవితలను చూపించారు. చీకటిని చేతిలో దాచుకున్న సింగిడి శీర్షికతో రాసిన వ్యాసంలో దేవనపల్లి వీణావాణి కవితా సంకలనం నిక్వణ లోని నిత్యహరితమయ కవితాత్మను విశ్లేషించి అందులోని కవితలలో ఉపయోగించిన పదజాల, పదబంధాలలో చోటు చేసుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని, పాఠకాశ్రితంగా సాగిన రచనా విశిష్టతను విశ్లేషించారు. మడత భాస్కర్‌ ‌రాసిన నలభై కవితల సంపుటి పైసల చెట్టులో వస్తు స్పృహతో కూడిన నిర్మలత్వాన్ని  తెలిపారు. నది పలికిన వాక్యం కవితా సంపుటిలో విలాసాగరం రవీందర్లోని మనిషితనం కోల్పోతున్న సమాజం పట్ల వెల్లడించిన ఆవేదనను విశ్లేషించారు. వనపట్ల సుబ్బయ్య తన కావ్యం మశాల్లో బిగించిన పిడికిలిలో దాచిన ఉద్యమావేశాన్ని కవిత్వీకరించేప్పుడు చూపిన ఒడుపుదనాన్ని, ప్రణాళికాయుత నైపుణ్యాన్ని వ్యాసరచయిత  చిత్రిక పట్టి వివరించారు.

కార్యశీలత, మేధోమధనం, వ్యక్తం చేసే భావుకతతో సాగిన అజ్ఞాన కవిత్వ వికాసాన్ని కూడా తెలిపారు. యెన్నెం ఉపేందర్‌ ‌నారుమడి కావ్యాన్ని తెలంగాణ సంస్కృతికి కళాత్మక రూపంగా అభివర్ణించారు. ప్రఖ్యాత కవి ఆశారాజు కవిత్వంలో వెన్నెల దర్పణంలో కలల యాత్రా స్థలమైన హైద్రాబాదు సాంస్కృతిక వారసత్వాన్ని దర్శింపజేసే వ్యాసం ఆలోచింపజేస్తుంది. సీనియర్‌ ‌కవి మానేపల్లి భావుకతకు తగిన భాషతో ఆధునిక కవితా శిల్పాన్ని  పాటిస్తూ  రాసిన కవిత్వాన్ని నడక ఆగదు అన్న వ్యాసంలో  విశ్లేషించి చూపించారు. సృజనాత్మక అనువాదం అన్న వ్యాసం జలజం సందిగ్ధ సామాజిక స్థితిని ఒడుపుగా చిత్రించిన కవిగా నిలిపింది. జలపాతంలా సాగిపోయే సృజన కవిత్వ ధార కలిగిన ప్రఖ్యాతకవి వేణుశ్రీ ఉద్యమ కవిత్వ ప్రాతినిధ్యాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం తెలంగాణ దుఃఖమే ఈనాటి కవిత్వమని చెప్పింది. చిరు చెలిమె లాంటి భావాలలో సాగే ఆత్మీయ నిర్మల కవిత్వం సంస్కృతీ  సమ్మేళనమని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమం ఉజ్జీవంగా ప్రఖ్యాత కవయిత్రి జ్వలిత కవిత్వంలోని అనుభూతి సాంద్రతను జలామయ కవిత్వం వ్యాసంలో ప్రస్తావించారు. తాకే హోరుగాలి, నింపాదిగా ప్రవహించే సరస్సు, అతిశీతలంగా స్పృశించే పిల్లగాలి లాంటి సుప్రసిద్ధ కవి అమ్మంగి వేణుగోపాల్‌ ‌కుందుర్తి కాలం నుండి ఈ అత్యాధునిక కాలం వరకు సాగుతున్న కవితా వ్యక్తిత్వానికి  ఒక మూల్యాంకనం అని ఆయనే ఒక భరోసా అన్న వ్యాసం ద్వారా  వెల్లడించారు. నన్నపురాజు రామేశ్వరరాజు సాహితీ ప్రయాణం  ప్రాచీనుల ధ్వని సంప్రదాయాన్ని, ఆధునికుల ప్రతీక సంప్రదాయాన్ని కలిగిన సాహితీవేత్తగా    చూపారు. దుఃఖానంతర దృశ్యాల తరువాత నిండైన ఆత్మవిశ్వాసంతో సాగిన నేపథ్య కోణాలెన్నో ఈ వ్యాసాల్లో కనిపించాయి.  భారమితిలా వాటిని కొలిచి  సాహిత్య పార్శ్వాలను విమర్శనాత్మకంగా విశ్లేషించి నిగ్గు తేల్చిన బృహత్తర ప్రయత్నమిది.
– తిరునగరి శ్రీనివాస్‌, 84660 53933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *