తండ్రి సంతానానికి మార్గదర్శకుడుగా ఉండాలి

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా

ప్రతి సంవత్సరం జూన్‌ ‌నెలలోని మూడవ ఆదివారం నాడు అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని జరుపు కుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘‘సోనోరా స్మార్ట్ ‌డాడ్‌’’ అనే మహిళ ఆలోచనకు సాకారంగా 1910లో మొదటిసారి ‘‘ఫాదర్స్ ‌డే’’ ను గుర్తించి జరుపు కున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల ‘‘వందన దినోత్సవము’’నకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్‌ ‌లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపు కుంటున్నాయి. పితృదినోత్సవ సందర్భంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాధ్యతాయుతులైన తండ్రులందరికి శుభాకాంక్షలు తెలుపు కోవడం ఒక సాంప్రదాయంగా మారింది.

ఎండకు నీడలా.. వానకు గొడుగులా.. ఆకలికి అన్నంలా.. దాహానికి చెలిమలా.. చేనుకు కంచెలా.. ఇలా ఎన్ని విధాలుగా పోల్చినా నాన్న విలువ పెరుగుతుందే తప్ప కొలతలకు అందేది కాదు. అయితే ఇక్కడ ఉదహరించిన బాధ్యతాయుతులైన మంచి తండ్రులు. అంటే ఎవరు? వారెలా ఉంటారు? లేదా ఏమి చేస్తే మంచి తండ్రులవుతారో తెలుసుకోడానికి ఇదొక మంచి సందర్భం. అలా తెలుసుకునే ముందు అసలు బిడ్డ యొక్క పరిణామ క్రమపు ఆంత్రోపాలజీ ని గమనించడం విధాయకం. భూమి మీద పుట్టే ప్రాణి కోటిలో ఒక్క మానవ జాతిలోనే పుట్టిన బిడ్డకు కొన్ని సంవత్సరాల దాకా సంరక్షణ అవసరమవుతుంది. బిడ్డ పుట్టిన క్షణం నుంచి తొమ్మిది నెలల వయసు వచ్చేవరకు తల్లి ఒడిలోనే ఉండడం లేదా తల్లిని మాత్రమే గుర్తు పట్టడం జరుగుతుంది. ఆ సమయంలోనే బిడ్డను ఆడించడానికి, లాలించడానికి తల్లి వాడే పదాలు మాతృభాషగా పరిణామం చెందాయని పాలజిస్టులు చెపుతారు. అలా (భాషను) పదాలను ఉపయోగిస్తూ ఆదిమానవులు గుహలలో నివసించే కాలంలో, బిడ్డను తండ్రికి లేదా తండ్రిని బిడ్డకు పరిచయం చేసేది తల్లి. బిడ్డకు పరిసరాలను గుర్తించే వయసు వచ్చిన నాటినుండి, స్వతంత్రంగా జీవించే వయసు (ఆహారాన్ని సంపాదించుకునే వయసు) వచ్చేదాకా, ఆ తండ్రి బిడ్డకు సంరక్షకుడిగా, ఆహార సంపాదనకు అవసరమైన వేట నేర్పే గురువుగా ఉండేవాడు. మనిషి ఆటవిక దశనుంచి బుద్ధి జీవుడిగా మారిన క్రమంలో, బిడ్డ జీవితంలో ఒక్క తండ్రే కాక మరికొంత మంది ఆవశ్యకత ఏర్పడింది. చాణుక్యుడు ఉటంకించిన దానిని బట్టి ఎవరెవరిని తండ్రిగా గౌరవించాలో ఈ క్రింది విధంగా చెప్పబడింది.

‘‘అన్న భయత, యస్య కన్యా వివాహిత జనిత చౌపనేత చ, పంచైతే పితరః స్మృతః’’
1. అన్నదాత : ఆకలేసినపుడు అన్నం పెట్టి ప్రాణం నిలబెట్టిన వారు తండ్రిగా గౌరవింపదగిన వారు.
2. భయత్రాత : జీవితపు ప్రయాణంలో ఎదురయ్యే ధన, మాన, ప్రాణ హాని సమయంలో కాపాడినవారు తండ్రిగా గౌరవింప దగినవారు.
3. కన్యాదాత : ఒక వ్యక్తి (మగవాడు) తండ్రిగా మారగలిగే భాగ్యాన్ని కలిగించగలిగే కన్యను భార్యగా ఇచ్చిన వ్యక్తీ (మామగారు) తండ్రిగా గౌరవింప దగినవారు.
4. జనిత : జన్మనిచ్చిన/ ఉద్యోగమిచ్చిన/బ్రతుకు తెరువు నేర్పిన వారు తండ్రిగా గౌరవింప దగినవారు.
 5. ఉపనేత : మంత్రోపదేశము చేసిన వారు/విద్యా బుద్దులు నేర్పినవారు తండ్రిగా గౌరవింప దగినవారు.

పై వాటిలో ఒక్క కన్యాదానము తప్ప మిగిలిన అన్ని భాద్యతలను ఒకే వ్యక్తి ఏకకాలంలో నిర్వర్తించ గలిగితే వారే ఉత్తమ తండ్రులు. పిల్లలు శైశవ దశ నుంచి కౌమారము దాకా వినడం చదవడం ద్వారా కాక, అనుకరణ ద్వారా ఎక్కువ విషయాలు గ్రహిస్తారు అని, కౌమారము నుంచి యుక్త వయసు దాకా తాము ఇష్టపడే వారిని అనుసరిస్తారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరూ మానసిక శాస్త్రవేత్తలు అంగీకరించే విషయం. ఒకతరం నుంచి మరోతరం తాను పుట్టి పెరుగుతున్న కుటుంబం నుంచి అనుకరించేదే ‘‘జీన్స్’’ అని అనుకోవచ్చు. కుటుంబ పెద్దగా ఒక తండ్రి భాద్యతాయుతమైన నడవడిక తరువాతి తరానికి అలవాటు అవుతుంది అన్నది విశదమవుతోంది. కాలక్రమేణా మనిషి బుద్ధి జీవుడు అవుతున్నకొద్దీ బిడ్డకు జీవన విధానాన్ని నేర్పడంలోను, జ్ఞాన సముపార్జనలోను, బాధ్యతాయుతులైన పౌరులుగా మెలగడం లోనూ ఆ తండ్రి బిడ్డకు మార్గదర్శిగా ఉండడం మొదలయింది. తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకునే దశలో ఉన్న బిడ్డకు ‘‘సంరక్షకుడి’’గా, విద్యార్జన అన్నది కష్టంగా కాక ఇష్టంగా మార్చే క్రమంలో ‘‘గురువు’’గా, తప్పు చేసినపుడు దండించే దశలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ మంచిని ప్రభోదించి తప్పు చెయ్యడం వల్ల వచ్చే చెడు పరిణామాలను మాత్రమే తెలియజేసి సన్మార్గంలో నడిపించే దశలో ‘‘ప్రవచనకర్త’’గా, యుక్తవయసులో జీవనోపాధికి అవసరమయ్యే విజ్ఞానాన్ని విపులీకరించే దశలో సమకాలీన ‘‘మిత్రుడి’’గా, నడి వయసులో వచ్చే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కోవడంలో సలహానివ్వగలిగే ‘‘చతురుని’’గా ఉంటూ ఒక మనిషి జీవన క్రమంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం. అనగా తండ్రి తన సమయాన్ని పిల్లలకోసం వెచ్చించడం అన్నది ఖచ్చితంగా అవసరం.

అందుకే ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చరిత్ర చూసినా, ఆ వ్యక్తి యొక్క తండ్రి తన సమయాన్ని పిల్లలతో గడుపుతూ వారిని, విజయం వైపు నడిపించడం చూస్తాం. అందువల్లనే అపర కుబేరులైనా, వారి వారసుల తండ్రులు ధనార్జనలో పడి, పిల్లలకోసం సమయాన్ని కేటాయించలేని తండ్రుల సంతానం, అందువల్లే కొంత శృతి తప్పిపోవడాన్ని ఈ మధ్య గమనిస్తున్నాం. బిడ్డలచే కీర్తించబడాలంటే ఆ తండ్రికి సహనము, సమయస్పూర్తి, సంయమనము మెండుగా ఉండాలి. అంతే కాక బిడ్డల కోసం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించగలగాలి. తన ఇంటిలో బిడ్డల ఎదుగుదలకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచగలగాలి. తాను సమకుర్చలేని వాటిని గురించి ఏంతో సంయమనంతో బిడ్డలకు విశదికరించ గలగాలి. ఇవన్నీ అనుకున్నంత సులభంగా అలవడవు. కాబట్టే ప్రపంచంలో కొంతమందే మంచి తండ్రులు కాగలుగుతారు. మిగిలినవారు తండ్రులుగా మాత్రమే మిగిలిపోతారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *