‘అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్థానం చేసింది’, 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి మన మరోప్రపంచం – తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర మరువలేనిది. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రానికి పునాదులు వేసింది అమరవీరులు. వీరులారా వందనం అమరులారా వందనం అని రాగం నేర్పిన దరువు ఎల్లన్న పాటే అమరవీరుల జాతీయగీతం అయింది. 1969 ఉద్యమంలో 369 మంది , మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా బలిదానాలు చేశారు. మలిదశ ఉద్యమంలో ఎల్.బి నగర్ చౌరస్తాలో అగ్గికి ఆహుతి అయిన శ్రీకాంతాచారి, ఠాగూర్ ఆడిటోరియం వెనుక వేణుగోపాల్ రెడ్డి , ఎన్.సి.సి గేటు దగ్గర సిరిపురం యాదయ్య, పార్లమెంటు ముందు యాదిరెడ్డి, కానిస్టేబుల్ క్రిష్ణయ్య, భూక్యానాయక్, ఇషాన్ రెడ్డి, భాగ్యా నాయక్, స్వర్ణ ఇలా ఎంతో మంది తెలంగాణ పోరులో రాలిపోయిన వీరులు. ఉద్యమ నెలబాలురు, పోరు మందారాలు, గునుగు పూల నవ్వులు, మోదుగు పూల వనాలు, తంగెడు పూల రెమ్మలు మన అమరవీరులు… పొడిసేటి పొద్దుల్లో పొద్దుపొడిచి ఉద్యమంలో అసువులు బాసి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పోరుకు సై అని ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడని శూరులు నా తెలంగాణ ధీరులు.
తెలంగాణ ఉద్యమం నీరుగారుతుంది అన్న ప్రతిసారి ఒక బలిదానం ఉద్యమానికి పురుడు పోసింది. వీరి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. అందుకే వేరే రాష్ట్రాలకు తెలంగాణకు తేడా, వారికి రాష్ట్రం మాత్రమే కానీ మనకు అది జీవితం. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా నీ పార్వతిని అడగరా శంకరా.. తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెలపైన చితి మంటనా… అని మిట్టపల్లి సురేందర్ రాసిన పాట అమరవీరుల తల్లుల్లకు ఓదార్పు లాంటిది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మా బిడ్డల్ని చూసుకుంటాం అనుకున్న తెలంగాణ అమరవీరుల తల్లులకు కడుపుకోతే మిగిలింది. ఓ అమరవీరులారా.. విద్యార్థి యోధులారా మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలలెలబోతుందని మళ్లీ పాడుకునే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్న రాజకీయనాయకుడు లేడు. అమరవీరుల దినోత్సవం రోజు జోహార్లు చెప్పి మళ్ళీ ఏడాది వరకు ఆ ముచ్చటే పట్టించుకోరు. ప్రభుత్వానికి కూడా పదేండ్ల తర్వాత అమరులు యాదికొచ్చిండ్రు.
నిఖార్సైన తెలంగాణ వాదులు ప్రతిరోజు అమరులను తల్చుకోవాల్సిందే. వాళ్లు తృణప్రాయంగా వదిలేసిన ప్రాణాల పునాదులపై నేడు మన రాష్ట్రం అనే ఇంటిని నిర్మించుకొని బతుకుతున్నాం. ప్రతి అమరవీరుని కుటుంబాన్ని మనం గౌరవించుకోవాలి. వాళ్ల బిడ్డల్ని ఎలాగో తీసుకురాలేం ప్రభుత్వమే పెద్దదిక్కులా మారి వారి జీవీతాలకు ఆసరా కావాలి. లేకపోతే అమరవీరుల ఆత్మ నిజంగానే ఘోషిస్తుంది. తెలంగాణ పోరులో రాలిన మోదుగు వనాలు మన వీరులు, వారి ఆశయాలను సాధించి మోదుగు వనంలో చిగురాకులు విరాజిల్లేలా చేయాలి. ఎన్నికల వేల ప్రతిఒక్కరు వీరుల త్యాగాలను రాజకీయం చేస్తున్నారే తప్ప నిజంగా వారిని ఏనాడూ పరామర్శించలేదు, వారికి వెన్నుదన్నుగా నిలువలేదు. వారి ఆత్మలు శాంతించాలంటే వారి ఆశయాలను సాధించాలి.
– శ్రీకాంత్ చెర్వుగట్టు, ఎంఏ, కాకతీయ యూనివర్సిటీ
9491533693




