దేశంలో రూ. 2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు..ఏటా రూ.12 వేల కోట్లు
కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి
డీఎస్సీ సహా 9 వేల గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్
సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్ రూ.600లే ఇస్తున్నారని, దేశంలో రూ.2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు సదాశివపేట, మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో హరీష్ రావు పర్యటించారు. పలుచోట్లా నూతన పింఛన్లు పంపిణీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…టీడీపీ హయంలో 75 రూపాయలు ఇచ్చేవారని, కొత్త పెన్షన్ అడిగితే ఊళ్లో ఎవరన్నా చనిపోతే ఆ పెన్షన్ మీకు ఇస్తమని చెప్పేవారని, కాంగ్రెస్ హయంలో 200రూపాయల పెన్షన్ మాత్రమే అని, కాని తెలంగాణ వొచ్చాక ఇచ్చిన మాట ప్రకారం సీఎం 200 పెన్షన్‌ను వేయి రూపాయలు టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వేయి రూపాయలు చేశామని, మళ్లీ అధికారం వొస్తే 2016 రూపాయలు చేస్తమని కేసీఆర్ చెప్పిన మాట తప్పకుండా వేయి రూపాయల పెన్షన్‌ను 2016కు పెంచారని వివరించారు.
సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్, కర్ణాటకలో ఉన్నది బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వమని, కానీ అక్కడ ఇచ్చే పెన్షన్ కేవలం 600 రూ మాత్రమే అని అన్నారు. కొరోనా వల్ల కొంత జాప్యం జరిగినా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తమని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 57 ఏళ్ల వారికి పెన్షన్లు ఇస్తున్నామని, తెలంగాణ వొచ్చాక సంగారెడ్డిలో లక్షా 5వేల పెన్షన్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు మరో 66 వేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినమని అన్నారు. ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం లేదని కాని కేసీఆర్ వారికి పెన్షన్లు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 25 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే, తెలంగాణ వొచ్చాక కేసీఆర్ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నరని గుర్తు చేశారు. ఏడాదికి 12 వేల కోట్లు నెలకు వేయి కోట్లు ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వ ఖర్చు చేస్తుందన్నారు.
పేదవాడికి పది కేజీల బియ్యం, 2016 పెన్షన్ ఇచ్చేది వారు ఆత్మగౌరవంగా బతకడానికని, కాని బీజేపీ ఉచితాలు అనుచితమని అంటున్నదని అన్నారు. బడా కంపెనీలకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ప్రభుత్వం, రెక్కాడితే కాని డొక్కాడని పేదలకు పెన్షన్లు ఇస్తే ఉచితాలు, అనుచితమని అంటుందని అన్నారు. బీజేపీ నాలుగొందలున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200కు పెంచిందని, పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిందని అన్నారు. టీఆర్‌ఎస్ పేద ప్రజలకు పంచే కార్యక్రమం పెడితే, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్లు పంచి పెడుతుందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు కాన్పుకు కెళితే 12 వేల రూపాయల సాయం, కేసీఆర్ కిట్, మంచి బోజనం పెట్టి, ఆటో కిరాయి ఇచ్చి ఇంటి దగ్గర దింపుతున్నమని వివరించారు. ఇలా సంగారెడ్డిలో ప్రతీ నెల ప్రభుత్వ హాస్పిటల్‌లో 800 కాన్పులు జరుగుతున్నయని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నమని, రైతు బీమా, రెండు పంటలకు పది వేల రైతు బంధు సాయం, అందిస్తున్నమని అన్నారు. ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంతకు ముందే నోటిఫికేషన్లు ఇచ్చిందని ఇప్పుడు గ్రూప్-2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చినమని, రాబోయే 2-3 రోజుల్లో 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నామని తెలిపారు.
91 వేల ఉద్యోగాల భర్తీ పక్రియ జరుగుతుందని, 52 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చామని రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇవ్వనున్నామని, అందులో డీఎస్సీ, గ్రూప్-4 ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినమని, 11 వేల కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తమని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ పక్రియ సాగుతుందని అన్నారు. మొత్తం మీద 2 లక్షల 10 ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వొచ్చాక ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తమన్నదని, ఆ ప్రకారం 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా అవి ఇవ్వకపోగా పైపెచ్చు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదని, ఆ పార్టీకి సరైన గుణపాఠం నేర్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ రాజహర్ష, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజు శ్రీ, జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీఎంస్ ఛైర్మన్ శివకుమార్,సీడీఎస్ ఛైర్మన్ బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.


