తన పదవీకాలం ముగిసిందన్న సిఎం రేవంత్ రెడ్డి
ఎవరిని నియమించినా కలిసి పనిచేస్తా..
రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానన్న తృప్తి
సోనియాతో మధుయాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్‌ల భేటీ
టిపిసిసి కోసం పోటీ పడుతున్న పలువురు సీనియర్ నేతలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 27: టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందనే ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని అన్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానని, అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎవర్ని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని అన్నారు. తాను టీపీసీసీగా ఉన్న కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామని ఆయన అన్నారు. దిల్లీలో డియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలకు మించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వోటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగిందని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు వచ్చిన చోట తాము గెలిచామని, బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచిందని అన్నారు. తాను కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరిందని అన్నారు. ముఖ్యమంత్రిగా నా రెండో కల నెరవేరింది. బీఆర్‌ఎస్‌ను లోక్‌సభభలో జీరో చేశాను. ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరింది.
తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసం అయిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు పూర్తి చేసిందని తెలుస్తోంది. ముఖ్య నాయకులను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. రాత్రి 8 గంటలకు ముఖ్య నాయకులతో సీఎం రేవంత్.. ఇంఛార్జి దీపా దాస్ మూన్షి సమావేశం అవుతారు. ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. పార్లమెంట్ హాల్‌లో సోనియాగాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ కలిసి చర్చించారు. తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ పార్టీని గెలిపించారు. ఆయనకు సీఎం పదవి వచ్చింది. ఇక పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి వేరే వారికి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ప్రచారంగానే ఉంది. లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి. ఈ నెల 27వ తేదీతో అంటే గురువారంతోనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడై 3 సంవత్సరాలు పూర్తి అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం పీసీసీ చీఫ్ పదవికాలం 3 సంవత్సరాలు. ఆ తర్వాత కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది.
లేదా పొడిగించవచ్చు. అయితే, సీఎంగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పోస్టును మరొక నేతకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారని అంతా ఊహించారు. కానీ లోక్ సభ ఎన్నికలు వెంటనే ఉండటంతో రేవంత్ రెడ్డినే అధిష్టానం కొనసాగించేసింది. దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా, రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పీసీసీ చీఫ్ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గ నేతకు పీసీసీ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర దకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు పార్టీ జాతీయ స్థాయి పోస్టులుసైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ, జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులకోసం నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.




