- ప్లకార్డులతో నిరసలను వ్యక్తం చేసిన సభ్యులు
- వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు
- సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్న స్పీకర్
- సెషన్ మొత్తానికి నలుగురు కాంగ్రెస్ ఎంపిల సస్పెన్షన్
- గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపిలు
న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తిస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మాణికమ్ టాగూర్, టీఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్య హరిదాస్‌ను ఈ లోక్‌సభ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్షం కోరుకున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్ష సభ్యులు నిరసన తెలిపారని స్పీకర్ ఓం బిర్లా చెప్పుకొచ్చారు. ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నిరసనకు దిగడంతో సమావేశాలు వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్పణంపై చర్చకు సోమవారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు పట్టుబట్టాయి. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరైన లోక్‌సభ ఎంపీ మాణికమ్ ఠాకూర్ మాట్లాడుతూ.. జీఎస్టీ, ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై కేంద్రం దృష్టి సారించే విధంగా విపక్షాలు ప్రయత్నం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం విపక్షాలతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిరోజు పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని.. తాము వాయిదా తీర్మానాలను ఇస్తున్నామని చెప్పారు.
ఇవాళ కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చామని.. అయితే ప్రభుత్వం మాత్రం అదేవి• పట్టించుకోకుండా విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, మైదా, మజ్జిగ, పెరుగు వంటి వస్తువులపై జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ధరల పెరుగుదలపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. అయితే.. నిరసన తెలియ జేయాలనుకుంటే సభ బయట ప్లకార్డులు ప్రదర్శించాలని, సభలో ప్రదర్శించకూడదని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నామని, తమ ఓపికను బలహీనతగా భావించవద్దంటూ హెచ్చరించారు. అంతకుముందు సభ వాయిదా పడిన తర్వాత మరోసారి సభలోకి ప్లకార్డులతో వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో సభకు పదేపదే ఆటంకం కలుగుతుండడంతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్ష ఎంపీల తీరును ఖండించారు.
సభలోకి ప్లకార్డులు తీసుకొచ్చిన కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీంతో నలుగురిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 12వ తేదీన వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకూ నలుగురు ఎంపీలపై వేటు పడినట్లే. సస్పెన్షన్ కు గురైన అనంతరం నలుగురు ఎంపీలు పార్లమెంటు మైదానంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తమ ఎంపీల్లో కొందరిని సస్పెండ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రజలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో ప్రశ్నిస్తుంటే కేంద్రం తమ సభ్యుల గొంతు నొక్కేస్తోందని ఆరోపించింది.




