జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యనేతల భేటీకి పిలుపునిచ్చింది. ఈ భేటీలో రూట్‌మ్యాప్‌తో పాటు లోగో, పాటకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 8న రూట్‌మ్యాప్‌, జనవరి 12న యాత్రకు సంబంధించిన ప్రత్యేక పాటను విడుదల చేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు.

ఇప్పటికే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర తీసుకొచ్చిన పాజిటివ్‌ వైబ్స్‌ ఇంకా కాంగ్రెస్‌ క్యాడర్‌లో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సారి దేశంలోని తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్‌ న్యాయ యాత్ర చేపట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు చేపడుతున్న ఈ యాత్ర ప్రభావం ఖాయంగా కనిపిస్తుంది. 2024, జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా..ఈ సారి మధ్యమధ్యలో బస్సు యాత్ర కూడా ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *