చైనా వీధులు కొరోనా లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా నిరసనలు

‘‘‌కోవిడ్‌-19 ‌టీకాలను ఉద్యమంగా చేపడుతూనే క్రమంగా కొరోనా కఠిన నిబంధనలను దశల వారీగా సడలించడం ఉత్తమ మార్గమని నిపుణులు తెలుపుతున్నారు. ఫైజర్‌, ‌బయోయన్టెక్‌, ‌మాడెర్నా లాంటి కొరోనా టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, తాము తయారు చేస్తున్న టీకా ఉత్పత్తుల మీదనే ఆధారపడి వ్యాక్సినేషన్‌ ‌మందకోడిగా జరగడంతో కోట్ల మందికి మూడు డోసుల టీకాలు ఇప్పటి వరకు అందక ప్రాణాపాయ స్థితులు అనుభవిస్తున్నారు.’’

 – డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి

డిసెంబర్‌ 2019‌లో చైనా దేశపు వూహాన్‌ ‌నగరంలో ప్రారంభమైన కొరోనా వైరస్‌ ‌కల్లోలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మానవాళి అతలాకుతలం కావడం, ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోవడం, ఆసుపత్రి పడకలు/ఆక్సీజన్‌ ‌దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి పీల్చడం, లక్షల ప్రాణాలు గాల్లో కలవడం లాంటి అసాధారణ, భయానక అనుభవాలను ప్రపంచ దేశాలు ఇంకా మరిచిపోలేదు. గత మూడేళ్లలో ప్రపంచ దేశాలు లాక్డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్లను దాటుకుంటూ వస్తూ నేడు కొరోనా భయ మేఘాలు తొలిగి సాధారణ జనజీవనం మొదలైంది. ప్రపంచ దేశాలు కొరోనా విపత్తు నుంచి తేరుకొని ప్రగతి పథంలో నడుస్తున్న వేళ నేడు చైనాలో కొరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల్లో భాగంగా నెలల కొద్ది కొరోనా లాక్డౌన్లను ప్రకటించడం, బలవంతంగా కోవిడ్‌ ‌పరీక్ష చేయడం, క్వారంటైన్లు అమలు చేయడంతో చైనీయుల జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చైనా వీధుల్లో అతి తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. గత ఆది వారం ఒక్క రోజున చైనాలో 39,506 కొరోనా కేసులు బయట పడడం జరిగింది. కమ్యునిస్ట్ ‌పార్టీ ఆఫ్‌ ‌చైనా ప్రభుత్వం బలవంతంగా ప్రవేశ పెట్టిన ‘‘జీరో – కోవిడ్‌ ‌పాలసీ’’లో భాగంగా లాక్డౌన్‌ ‌విధించడంతో వేల కొద్ది చౌనీయులు పలు నగర వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయడం అధ్యక్షుడు జింగ్‌పింగ్‌కు పెద్ద సవాలుగా నిలుస్తున్నది. 1989 తరువాత ఇంత పెద్ద ఎత్తున చైనా ప్రజలు వీధుల్లో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడం ఇప్పుడు మాత్రమే చూస్తున్నాం. చైనా ప్రభుత్వం కొరోనా తొలి అల కట్టడికి లాక్డౌన్లు, కరోనా పరీక్షలు, కొరోనా రోగులను క్వారంటైన్లు లాంటివి విధిస్తూ సమర్థవంతంగాఎదుర్కొన్న విషయం మనకు తెలుసు.

చైనా నగరాల్లో నెలలుగా లాక్డౌన్లు:
నేడు కొరోనా కొత్త వేరియంట్లు బయట పడడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడం జరుగుతోంది. మార్చి 2022లో షాంగై నగరంలో రెండు మాసాలకు పైగా లాక్డౌన్‌ ‌విధించడంతో ఆహార ధాన్యాలు, ఔషధాల కొరత ఏర్పడడంతో ప్రజలు వీధుల్లోకి చేరి నిరసన గళం వినిపించడం చూసాం. ఉరుమ్కీ నగరంలో 100 రోజులకు పైగా విధించిన లాక్డౌన్కు వ్యతిరేకంగా రగిలిన నిరసన ప్రదర్శనలో 10 మంది మరణించడం, అనేకులు గాయపడడం నిరసన దుస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ‘‘ రాజకీయ స్వేచ్ఛ/వాక్‌ ‌స్వతంత్రం/ మానవ హక్కుల రక్షణలు కావాలి, బలవంతపు కోవిడ్‌ ‌టీకాలు/లాక్డౌన్లు వద్దు’’ అంటూ నినాదాలు చేస్తూ లాక్డౌన్కు వ్యతిరేకంగా బీజింగ్‌, ‌షాంగై, చెన్డూ, వూహాన్‌, ‌గ్వాంజోవ్‌ ‌లాంటి 15కు పైగా పెద్ద నగరాల వీధుల్లో తెల్ల కాగితాలు చేత పట్టుకొని ప్రదర్శనలు నిర్వహించడం, బారికేడ్లను తొలగించుకుంటూ వేలాది యువత ముందుకు రావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లుగా తెలుస్తున్నది.

లాక్డౌన్‌ ‌వ్యతిరేక నిరసనల మంటలు విశ్వవిద్యాలయ ప్రాంగణాలకు సహితం పాకడంతో పరిస్థితులు చేయి దాటినట్లుగా కనిపిస్తున్నది. చైనాలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా గళం పెకలించడం చాలా అరుదు. చైనా ప్రభుత్వాలు అనాదిగా ప్రజల గొంతులను బలవంతంగా మూయడంలో సఫలం అవుతూనే వస్తున్నారు. షాంగై నగరంలో నిరసనకారులపై పోలీసుల లాఠీలు నాట్యమాడడం, భౌతిక దాడులు చేయడమే కాకుండా 100కు పైగా నిరసనకారులను నిర్భంధించడం జరిగింది. చైనాలో జరుగుతున్న ప్రజా నిరసనలకు సంఘీభావం తెలుపుతూ యూకె, కెనడా, ఆస్ట్రేలియా, యూయస్‌, ‌మలేసియా లాంటి దేశాల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ప్రాణాపాయ స్థితిలో చైనా వయోవృద్ధులు :
‘‘జీరో-కోవిడ్‌ ‌వ్యూహం’’తో మరణాలను, వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం వ్యూహం చేపట్టి లాక్డౌన్‌ ‌పాలసీని సమర్ధించుకుంటున్నది. ఇప్పటి వరకు చైనా ప్రజలకు, ముఖ్యంగా అధిక శాతం వయోవృద్ధులకు మూడు డోసుల టీకాలు ఇంకా అందనే లేదు. లాక్డౌన్లకు ప్రత్యామ్నాయంగా అందరికీ మూడు డోసుల టీకాలను వెంటనే ఇవ్వాలను ప్రజలు కోరుతున్నారు. నేటికి 60 ఏండ్లు పైబడిన 25 కోట్ల వృద్ధుల్లో 68 శాతం వరకు మాత్రమే పూర్తి టీకా డోసులు అందాయి. 80 ఏండ్లు దాటిన చైనా వయోవృద్ధుల్లో 40 శాతం మాత్రమే మూడవ డోసు టీకాలు తీసుకున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. కరోనా కేసులు బయట పడుతున్న వేళ లాక్డౌన్‌ ‌విధించని ఎడల చౌనాలోని వృద్ధుల ప్రాణాలు ప్రమాదంలో పడి ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

కోవిడ్‌-19 ‌టీకాలను ఉద్యమంగా చేపడుతూనే క్రమంగా కొరోనా కఠిన నిబంధనలను దశల వారీగా సడలించడం ఉత్తమ మార్గమని నిపుణులు తెలుపుతున్నారు. ఫైజర్‌, ‌బయోయన్టెక్‌, ‌మాడెర్నా లాంటి కొరోనా టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, తాము తయారు చేస్తున్న టీకా ఉత్పత్తుల మీదనే ఆధారపడి వ్యాక్సినేషన్‌ ‌మందకోడిగా జరగడంతో కోట్ల మందికి మూడు డోసుల టీకాలు ఇప్పటి వరకు అందక ప్రాణాపాయ స్థితులు అనుభవిస్తున్నారు. అంతే కాకుండా చైనా తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచిన తమ స్వదేశీ కొరోనా టీకా ప్రభావం తక్కువగా ఉండడంతో చైనా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. నేడు చైనా విదేశాల నుంచి పెద్ద ఎత్తున టీకాలను దిగుమతి చేసుకుంటూ అందరికీ మూడు డోసుల టీకాలను వేయడం, లాక్డౌన్లను క్రమంగా సడలించడంలో ప్రభుత్వం సఫలం కావాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *