చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

  • బకాయిల కింద రూ.50 కోట్లు విడుదల
  • త్వరలో మిగతా బకాయిలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండిరగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పడిరది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళనలు చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పలుమార్లు అక్కడి కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపారు.

కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని బకాయిలను క్లియర్‌ చేయాలని సూచించారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభయాన్‌ యూనిఫామ్‌ల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు మరియు సైజింగ్‌ కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపులకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *