చెప్పకుండానే.. ఎమ్మెల్యే షేక్‌ హ్యాండ్‌

  • బిత్తర పోతున్న జగిత్యాల బీఆర్‌ఎస్‌ శ్రేణులు…ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
  • అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి గుస్సా..
  • ఎమ్మెల్సీ పదవికి జీవన్‌ రాజీనామా? జీవన్‌ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టేనా..!
  • జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఆ పార్టీని ఆదివారం రాత్రి వీడి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ మారే ముందు తనను దశాబ్దం పాటు అంటిపెట్టుకుని ఉన్న అనుచర వర్గం, కార్యకర్తలు, నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమతో కనీసం చర్చించకుండా, మాట మాత్రమైనా చెప్పకుండా పార్టీని వీడి తన స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఆ పార్టీ నాయకులు సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన జగిత్యాల పట్టణానికి చెందిన స్థానిక కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ అవకాశం ఇచ్చి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జీవన్‌ రెడ్డిపై బరిలోకి దించింది.

ఆనాడు 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సంజయ్‌కు, తిరిగి 2018 ఎన్నికల్లో అవకాశం ఇవ్వగా మొదటిసారి గెలిచారు. అనంతరం 2023 ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ సంజయ్‌కి అవకాశం ఇచ్చి మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. దీంతో రెండోసారి కూడా వరుసగా గెలుపొందారు. దశాబ్ద కాలం పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండగా, ఆ పార్టీలో ఉన్న సంజయ్‌ కుమార్‌ అధికారం చేజారగానే ఆ పార్టీని వీడి అధికార పార్టీ అయినా కాంగ్రెస్‌ పార్టీలో చేరడం పట్ల బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

బిఆర్‌ఎస్‌ పార్టీ మూడుసార్లు అవకాశం ఇవ్వగా, ఒకసారి ఓడిపోయి రెండుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి సంజయ్‌ గెలువగా ఆ పార్టీ అధికారం లేకపోవడంతో అధికార పార్టీ అయినా కాంగ్రెస్‌ పార్టీ వంచన చేరి తన రాజకీయ స్వార్థ బుద్దిని ప్రదర్శించుకున్నాడని ఆ పార్టీ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కేవలం అధికార దాహంతో మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంపై ఆయన అనుచర వర్గం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడిరచి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, చెప్పా పెట్టకుండా రహస్యంగా రాత్రికి రాత్రే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం పట్ల నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమయితున్నారు.

ప్రశ్నార్థకంలో జీవన్‌ భవితవ్యం..
జగిత్యాల అంటే జీవన్‌ రెడ్డి..జీవన్‌ రెడ్డి అంటే జగిత్యాల అనే పేరును తెచ్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి, ప్రస్తుత కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి భవితవ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రశ్నార్థకంగా మార్చి వేసిందనే భావనలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీని అంటిపెట్టుకొని, పార్టీ కోసం విశేష సేవలు అందించి, అహర్నిశలు కష్టపడి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న జీవన్‌ రెడ్డి భవిష్యత్తుకు అడ్డంకి సృష్టించే విధంగా నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడం పట్ల అసంతృప్తి సెగలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఏనాడు ఇంతటి అవమానకర పరిస్థితిని ఎదుర్కునని దుస్థితిని ఈనాడు రేవంత్‌ రెడ్డి కల్పించారని తన సన్నిహితుల వద్ద జీవన్‌ రెడ్డి బాధను వెల్లగక్కుతున్నట్లు తెలిసింది. తన అభిప్రాయం తీసుకోకుండా..కనీసం తనకు మాటవరసకైనా సమాచారం తెలుపకుండా తన నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు ఇంతటి అవమానకర పరిస్థితి తనకు కాంగ్రెస్‌ పార్టీ కల్పించలేదని, ఎంతో హుందాతనంతో నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని గడిపిన తనకు, తన జీవిత చరమాంకంలో ఇంతటి అవమానకర పరిస్థితిలు కల్పించిన రేవంత్‌ సర్కార్‌ పై జీవన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

 

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న జీవన్‌ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం పెద్దలు మంత్రి శ్రీధర్‌ బాబును జగిత్యాల పంపుతున్నట్లు తెలిసింది.  ఇప్పటికే జీవన్‌ రెడ్డి ఇంటి వద్దకు భారీగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఏ క్షణమైనా జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరనాలు మారే అవకాశాలు ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్‌ రాజకీయ నాయకులు మాత్రం జీవన్‌ రెడ్డి పార్టీని వీడే అవకాశం లేదని దీమాగా చెప్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీ అంటే జీవన్‌ రెడ్డి.. జీవన్‌ రెడ్డి అంటే కాంగ్రెస్‌ పార్టీ అన్న అంతగా పార్టీలో లీనం అయిపోయిన జీవన్‌ రెడ్డి ఇంకో పార్టీలోకి వెళ్లే అవకాశం ఉండదని, చావైనా రేవైనా అదే పార్టీలోనే ఉంటాడని, వేరే పార్టీ మారి తప్పిదం చేసే ప్రయత్నం చేయరని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. రాజకీయ అవకాశవాదులు పార్టీలోకి వస్తూ పోతూ ఉంటారని, అటువంటి వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జగిత్యాల బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఆ పార్టీని వేడి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో జగిత్యాల నియోజకవర్గం లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

జగిత్యాల అభివృద్ధి  కోసమే పార్టీ మారా..
 ఎమ్మెల్యే సంజయ్‌
జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : జగిత్యాల అభివృద్ధి కోసమే తాను బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరానని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. అధికార పార్టీలో ఉంటే అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని అన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పారు.

జగిత్యాల నూకపల్లిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్దిదారులతో టెలికాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే మాట్లాడాడుతూ…డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల మౌలిక వసతుల కోసం రూ. 80 కోట్లు కావాలని నిధుల కేటాయింపు కొరకు సీఎంను కలసానని చెప్పారు. అప్పుడే ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. మౌలిక వసతులు, నియోజకవర్గం అభివృద్ధికి అవసరమయ్యే నిధులు విడుదల చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరానని అన్నారు. తన వ్యక్తిగత అవసరాలకే పార్టీ మారారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మొద్దని సూచించారు సంజయ్‌ కుమార్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *