హైదరాబాద్‌లో కెటిఆర్, కవిత..సిద్దిపేటలో హరీష్ రావు వోటు
కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వొచ్చిన కెసిఆర్ తన వోటు వేశారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని చింతమడక వోటర్లు..కేసీఆర్ రాగానే భారీ సంఖ్యలో క్యూ కట్టారు. వోటు వేసిన అనంతరం బయటకు వొచ్చిన సీఎం ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కేసీఆర్ దంపతులు హైదరాబాద్‌కు బయలదేరారు. కేసీఆర్ దంపతుల వెంట మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు వోటు వేశారు. ఇక బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన వోటు హక్కును బంజారాహిల్స్ నందినగర్ ప్రాంతంలో ఓ పోలింగ్ బూత్‌లో తన భార్య శైలిమతో కలిసి వోటు వేశారు. పోలింగ్ బూత్ బయట డియాతో మాట్లాడుతూ…తెలంగాణ పౌరుడిగా తన వోటు హక్కు వినియోగించు కున్నానని అన్నారు.
దీంతో తన బాధ్యత తాను నెరవేర్చుకున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను వోటు వేసినట్లుగా కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి వోటు వేశానని చెప్పారు. అందరూ తమ వోటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వోటు వేయాలని కేటీఆర్ అన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత కూడా తన వోటు హక్కును బంజారాహిల్స్‌లోని నందినగర్ ప్రాంతంలో డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో వినియోగించుకున్నారు. ఆ తర్వాత కవిత డియాతో మాట్లాడుతూ…ప్రజలు అందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని అందరూ వోటు వేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించేలా కవిత వ్యాఖ్యలు చేశారు. తమకు వోటు వేయాలనే వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో వోటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్‌తో కలిసి వొచ్చిన మంత్రి వోటు వేసి.. ప్రజలంతా వోటు వేయాలని పిలుపునిచ్చారు.
కవితపై ఫిర్యాదు అందింది : సిఈఓ వికాస్ రాజ్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వోటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో కవితపై ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు ఆదేశాలిచ్చామని ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయిందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల సరళిపై డియాతో మాట్లాడిన వికాస్ రాజ్…రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఈవీఎం సమస్యలు వొచ్చిన దగ్గర కొత్తవి మార్చామని వెల్లడించారు. రూరల్‌లో పోలింగ్ శాతం బాగానే ఉందన్న ఆయన…అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయని,జరిగిన ప్రతి కంప్లైంట్స్‌పై డీఈవోలను రిపోర్ట్ అడిగామన్నారు వికాస్ రాజ్.
వోటు హక్కు వినియోగించుకున్న ఐ లండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్ సమీపంలోని జీహెచ్‌ఎంసీ ట్రయినింగ్ సెంటర్ లో తన వోటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా, ఇదే పోలింగ్ బూత్‌లో వోటు వేయడానికి వొచ్చిన ఒక వృద్ధ మహిళ తన వోటును వినియోగించుకుని వొస్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతతో పడిపోగా, దీనిని గమనించిన అశోక్ రెడ్డి వెంటనే ఆ వృద్ధ మహిళలను ప్రత్యేక వాహనంలో తగు చికిత్సకై సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు .



