చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి

  • బిజెపితో పొత్తు కోసమే తెలంగాణలో డ్రామాలు
  • ఖమ్మం పర్యటనపై సజ్జల విసుర్లు

అమరావతి,డిసెంబర్‌22 : ‌టీడీపీ అధినేత చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం డియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియదన్నారు. చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని అన్నారు. తెలంగాణలో స్లీపర్‌ ‌సెల్‌లను చంద్రబాబు పెట్టారని అనిపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. డీఎల్‌ ‌రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నట్లు తాము భావించట్లేదన్నారు. డీఎల్‌ ‌రవీంద్రారెడ్డిని ఎవరో మాట్లాడించినట్లు తెలుస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన, బహిరంగసభపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు వాలకం చూస్తుంటే ఆయన ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిదని.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లారని ఆరోపించారు. అయితే, ఎన్నికల్లో ఏం చేయాలో చంద్రబాబుకు కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన గురించి ఉన్నట్లుండి చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాష్ట్రం అన్యాయంగా విడిపోయింది, సేవ చేయాలి అనే క్లారిటీ సీఎం జగన్‌కు ఉందని స్పష్టం చేశారు. అయితే, తనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఉపయోగం ఉంటుందని బీజేపీకి చెప్పడమే చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయనకు ఆధార్‌ ‌కార్డు, ఓటర్‌ ‌కార్డు రెండూ తెలంగాణలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డికి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలన్న విషయమై పూర్తి స్పష్టత ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *