గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా
ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి చూపును పరిరక్షించు కోవడానికి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలను విధిగా తీసుకోవాలి. ‘చికిత్స కన్న నివారణే మిన్న’ అని భావించాలి. తరుచుగా (కనీసం 2 ఏండ్లకు ఒకసారి) నేత్ర పరీక్షలు చేయించుకుంటూ, ప్రమాదకర అంధత్వ కారణ గ్లాకోమా దుస్థితి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. కంటి చూపు క్రమంగా మందగించడంతో ఏర్పడే దృష్టి లోపాన్ని ‘గ్లాకోమా’ వ్యాధి గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి కారణమైన 2వ అతి పెద్ద వ్యాధి అయిన గ్లాకోమా అనే నేత్ర సంబంధ లోపాన్ని నివారించడానికి తరుచుగా కంటి పరీక్షలు చేసుకోవడం, తొలి దశలోనే గుర్తించడం, వైద్యంతో నయం చేసుకోవడం జరగాలి. గ్లాకోమా ముదిరితే కంటి చూపు తగ్గిపోతూ, వైద్యులు కూడా నయం చేయలేని నిస్సహాయ దుస్థితికి చేరి, చివరకు కోలుకోలేని అంధత్వం ఆవహిస్తుంది.

‘గ్లాకోమా లేని ప్రపంచ నిర్మాణానికి ఐక్యమవుదాం’ నినాదం:

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.3 శాతం ప్రజలు గ్లాకోమా సమస్యతో సతమతం అవుతున్నారని, 4.5 మిలియన్ల గ్లాకోమా రోగులు దృష్టి కోల్పోయారని, 2020 నాటికే వీరి సంఖ్య 11.2 మిలియన్లకు చేరి ఉండవచ్చని అంచనా వేశారు. ఇండియాలో కనీసం 12 మిలియన్ల ప్రజలు గ్లాకోమా సమస్యతో బాధ పడుతున్నారని, వీరిలో 1.2 మిలియన్లు అంధత్వం పొందారని తేలింది. తెలంగాణలో 5 లక్షల గ్లాకోమా బాధితులు ఉన్నారని అంచనా. సాధారణంగా 90 శాతం కేసుల్లో గ్లాకోమా సమస్య ఉందని కూడా తెలియదు. వయసు పెరిగిన కొద్దీ గ్లాకోమా వ్యాధి బారిన పడే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి ప్రమాదకర దృష్టి దోష సమస్య తీవ్రతను గుర్తించిన ‘ప్రపంచ గ్లాకోమా అసోసియేషన్‌‘ ‌నిరంతర కృషితో గ్లాకోమా వ్యాధి పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ప్రతి ఏటా 06 మార్చి నుంచి 12 మార్చి (కొన్ని దేశాల్లో 8 – 14 లేదా 07-13 మార్చి) వరకు ‘ప్రపంచ గ్లాకోమా వారం (వరల్డ్ ‌గ్లాకోమా వీక్‌)’ ‌పాటించుట ఆనవాయితీగా వస్తున్నది. ‘యునైటింగ్‌ ‌ఫర్‌ ‌గ్లాకోమా-ఫ్రీ వరల్డ్’ అనబడే అంశం పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వయసు పైబడి జనులు జాగ్రత్త:
గత దశాబ్ద కాలంగా గ్లాకోమా సంబంధ దృష్టి లోపాన్ని అనుభవిస్తున్న ప్రజల్లో, ముఖ్యంగా వృద్ధులలో, 30 శాతం పెరిగిందని తేలింది. కంటి చూపుకు ప్రధానమైన ‘దృష్టి నాడి (ఆప్టిక్‌ ‌నర్వ్)’ ‌దెబ్బతినడం కారణంగా బయట పడే దృష్టి లోపాన్ని గ్లాకోమాగా పిలుస్తారు. నేత్రాలు సక్రమంగా విధులు నిర్వహించడానికి, నేత్ర నిర్దిష్ట ఆకారం నిలవటానికి కనీస నేత్ర పీడనం (11 – 21 యంయం మెర్క్యురీ) అవసరం అవుతుంది. దృష్టి నాడి బలహీన పడడం లేదా దెబ్బతినడంతో నేత్ర పీడనం అతిగా పెరిగినపుడు దృష్టి నాడి దెబ్బతిని కంటి చూపు క్రమంగా తగ్గిపోతూ, సకాలంలో గుర్తించని యెడల శాశ్వత అంధత్వం రావచ్చు. నేత్ర వ్యవస్థలో నిరంతరం నియమిత పరిమాణంలో జల ద్రవాలు ఊరుతూ, కొంత ద్రవం కంటిలోంచి బయటకు వస్తుంది. ఈ జల ద్రవం అవసరం కన్న తక్కువ ఉత్పత్తి అయినపుడు కంటి వ్యాధులకు దారి తీస్తుంది.

పుట్టుకతో, నవజాత శిశువుల్లో, చిన్నతనంలోనూ వచ్చే అవకాశం ఉన్న గ్లాకోమా వ్యాధి 40 ఏండ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. గ్లాకోమా వ్యాధికి తీవ్రమైన లక్షణాలు ఏవీ కనిపించని కారణంగా కంటి నొప్పి లాంటి లక్షణాలు అనుభవంలోకి వచ్చినపుడు నేత్ర వైద్యున్ని సంప్రదించాలి. తరుచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అనే సూత్రమే గ్లాకోమాను ఎదుర్కొనే ఏకైక మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లాకోమా వ్యాధిలో దీర్ఘకాలిక (క్రోనిక్‌), ‌తీవ్రమైన (అక్యూట్‌) ‌గ్లాకోమా రకాలు ఉన్నాయి. వయస్సు, మానవ జాతి, బిపి, షుగర్‌, ఇతర వ్యాధులు, కుటుంబ నేపథ్యం, హ్రస్వ దృష్టి లాంటి అంశాలపై దీర్ఘకాలిక గ్లాకోమా ఆధారపడి ఉంటుంది. నేత్ర పీడనం అతిగా పెరిగినపుడు తీవ్రమైన (అక్యూట్‌) ‌గ్లాకోమా లక్షణాలకు దారి తీస్తూ, అంధత్వం రావచ్చు.

నిశ్శబ్ద అంధత్వ వ్యాధి – గ్లాకోమా:
గ్లాకోమా సమస్య వచ్చిన తరువాత తిరిగి నయం చేయడం అసాధ్యం కావడంతో ఈ వ్యాధిని ‘నిశ్శబ్ద అంధత్వ వ్యాధి’ లేదా ‘చూపును దోచుకునే దొంగ వ్యాధి’గా వర్ణిస్తారు. తొలి దశలో గ్లాకోమాను గుర్తిస్తే నయం చేసి దృష్టిని కాపాడవచ్చు. వ్యాధి ముదురుతే నయం చేయడం వీలుకాదని తెలుసుకుందాం. తొలి దశలో గుర్తించబడిన రోగులకు కంటి చుక్కలు, ఔషధాలు, శస్త్రచికిత్స విధానంతో నయం చేసే ప్రయత్నాలు చేస్తారు. గ్లాకోమా ప్రమాదం 40 ఏండ్లు దాటిన ప్రజల్లో సాధారణంగా కనిపిస్తాయని తెలుసుకొని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విధిగా నేత్ర పరీక్షలు చేసుకొని గ్లాకోమాకు దూరంగా, వెలుగులకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో గ్లాకోమా పట్ల ప్రజలకు జాగరూకత అత్యవసరం. ప్రపంచ గ్లాకోమా వారం సందర్భంగా సమాజంలో ఉచిత నేత్ర పరీక్షల నిర్వహణ, గ్లాకోమా రోగులకు అవసర చికిత్స, అవగాహన వేదికలు, ఉపన్యాసాలు, ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం, విద్యాలయాలలో వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం జరగాలి. అదృశ్య శత్రువు గ్లాకోమా, ముందు చూపుతో తరుచుగా పరీక్షలు చేయించుకొని గ్లాకోమాను అంతం చేద్దాం.
image.png
-డా. బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *