కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల వరదలు, ఈదురు గాలులు, ఎడతెగని గాయాలూ చెప్పుకోలేని అఖాతాలు, ఆశావేశపు శ్వాసలు, బోసి వెన్నెలలూ కోకొల్లలుగా కన్పిస్తాయి. బతుకు మీది ఆశను చుక్కానిగా మార్చి వెక్కిరించే వికృతాన్ని ఖండాంతరాలకు ధైర్యంగా తరిమే మానవ సమూహానికి సేనాని కవే. ఆధిపత్యానికి ఎదురొడ్డి రేపటి వెలుగుల ప్రపంచం కోసం ఔన్నత్యపు శిఖరాలపై నిలబడి శంఖారావం ఊదే కవి తన కలల రెక్కలు తెగిపోయినప్పటికీ సజీవమై నిలిచిపోయే స్వీయ కవితలో సుందర స్వప్నమై తొణకిసలాడుతాడు. ఆరని ఆశల కవితావేశంతో లయ తప్పని భావావేశాన్ని కొనసాగించి అక్షరాలా చేనేతల బతుకు పోగుల చుట్టూ ఆవరించిన కష్టాలను కవితలు చేసి దీపముండగానె అన్న సంకలనాన్ని గజ్జెల రామకృష్ణ అందించారు.
పోగులో పుట్టి/ పోగులో పెరిగి/ పోగూ పోగూ అల్లుకుపోతే తప్ప కంటకనబడని మెతుకును గుర్తు చేశారు. దారానికి రెక్కలొస్తే ఒంటరిదై మగ్గం పాడిన హృదయ విదారక చేదుగానాన్ని పేగుమాడిన శోకగీతం చేసి వినిపించారు. ఆకలిపిట్ట ఎగిరి ఎగిరి అలసిపోతే కామాపెట్టని వాక్యంలా శ్రమకావ్యం ఆదమరచి సేదతీరిన తీరును కాలయంత్రం కవితలో కళ్లకు కట్టేట్టుగా దృశ్యీకరించారు. కాలంతో పోటీ పడే శ్రమజీవుల పోరాట పటిమను గుండెల్లో పెట్టుకున్నారు. కాంక్రీటు వీధులలో, ఆకాశమెత్తు భవంతులలో లేని సంబురాన్ని ఊరు తల్లి ఆకు పచ్చతనంలో చూసి మురిసి కొత్త గాలిని ఆస్వాదించారు. ఊరు నిండా తూరుపు దేశపు వలసవాదం ఊరుతుంటే పొయ్యి మీది ఎసరుగిన్నె ఎచ్చవడుతనే లేదు/ నా నేత కలల బియ్యపు గింజ నానుతనే లేదు అని నేతన్న దైన్యాన్ని వివరించారు.
ఊరును కష్టనష్టాలు అల్లుతున్న/ పడుగూ పేకల కారా?నా అని, నగరాన్ని ఊరు అనుకరించి కాళ్ళ యంత్రమై పరుగెత్తి దుఃఖం ఊరుతున్న గుండె బాయిలా మారిందని వేదన చెందారు. కునుకు అంటినా/ చాప కింద నీరు ఎన్నుమీద పాకుతున్నా/ నిద్రలోతు మెలుకువ పాట గావాలి అని కష్ట జీవిని ఉద్దేశించి చెప్పారు. ప్రతి సాయంత్రాన్ని మనిషి కష్టాల కావడి నేలకు దించి/ భుజం మార్చుకునే విరామంగా నిర్వచించారు. స్వేద పరిమళమే ఆనంద పారిజాత సౌరభమని తేల్చారు. ఊరెళ్ళిన చిట్టది తిరిగొస్తే ఇల్లు దోసెడు నీళ్ళు పోసిన నవ్వుపూల చెట్టయితది అన్నారు. పనిని గుప్పెడు మెతుకుల వెతుకులాటగా చెప్పారు. ఆకలి తీర్చేందుకు దొరికిన పనికి మనిషి పక్షాన కృతజ్ఞతారాగం సమర్పించారు. కరోనా పుణ్యంతో కకావికలమైన జీవితాన్ని వేదనను తెల్లారితే కవితలో విశ్లేషించారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు తెలిసిన వాడు కూడా సాటి మనిషికి సాయపడడం లేదని బాధపడ్డారు. ఎన్నింటినో, ఎందరినో కరోనా గర్వభంగం చేసి తన ప్రతాపం చూపి వెళ్లిందని వివరించారు. గిన్నెడు గంజి సముద్రంలో మెతుకు అగుపడని అగాధాల్ని చూపించారు. తన రెక్కల కష్టం మీద మనస్సు పడ్డ పెద్ద పాము పన్నాగానికి పొగ పెట్టడానికి ఎవరైనా సాయం రావాలన్నారు. కాలమే శత్రువైనప్పుడు కాలు కదపొద్దని, అడుగు జారనీయొద్దని సూచించారు. కుల వృత్తికి సాటేదను గువ్వల చెన్న గీతం గుడ్డి దీపమైందని వేదన చెందారు. పాట ఒక ఓదార్పు అన్నారు. నేలంతా పువ్వైతే మట్టి పరిమళం ఎదను ముద్దాడుతుందని చెప్పారు. శ్రామికులు, కార్మికులు లోకమంతటిని సుఖ తీరాలకు చేరవేస్తున్న దేవదూతలని వివరించారు.
బతుకంతా కలిసి రాని కాలమే ఎదురవుతున్నా నాలుగు పోగులు కూడగట్టి ఎలాగైనా తాడును పేనాలని చెప్పారు. చెట్టును అష్టదిక్కులతో తలపడుతున్న హరిత విప్లవంతో పోల్చారు. వానంటే అన్నం పండుగ, అమృత ధార అని అభివర్ణించారు. కూతురు పద్యం కవిత చిట్టిదాన్ని కొండంత ఎదుగుతున్న అనురాగంగా చేసి చూపింది. పోగు లేని మగ్గాన్ని ఏకాకి విషాదంగా చూపించారు. గాయాలను మాన్పే గేయమొక్కటి కావాలని ఆకాంక్షించారు. ఒక్క పూట మెతుకయ్యే అరణ్య మధనమే ఆకలి పంతమని చెప్పారు. కుప్పవోసిన పూవ్వుల్లా మనుషుల్ని పోగేసి / మనసుల్ని మాలగట్టుడు ఇప్పుడు అత్యవసరం అన్నారు. మనసు నెమరేసినప్పుడల్లా మూత తీసిన అత్తరు సీసలా పరిమళించే ఓ జ్ఞాపకం గుర్తొస్తుందని శ్రమ ఫలం ఎప్పుడూ అర్థ చంద్రుడేనని తెలిపారు. కాలం బాణంలా దూసుకుపోతున్నదని అన్నారు. రాత్రంటే పీకలు కొరికి ఆయాసపడుతున్న పెద్దపులి ఆవాసం అని చెప్పారు. మూలాలంటే ఒక్క పలకరింపుతో ఆనందం విరబూసే పక్షి రెక్కలని చెప్పారు. కదులుతున్న మట్టి పాదాలతో తాడు మీద నడుస్తున్న ఒడుపే బతుకులోని ఆకుపచ్చ దీపమౌతుందని తెలిపారు. చీకటి కొమ్మల్లో చిక్కుకుపోయిన రోడ్డును నిద్ర లేపి మరీ ఉదయం వేడెక్కుతుందని చెప్పారు. దిగులు పూసిన చెట్టు ఆకాశం పైకి తలేసి చిగురు పిట్టల కోసం ఎదురు చూస్తున్నదని తెలిపారు. బాధల్ని సవరించేదే ఓర్పు పాఠమని చెప్పారు. పరామర్శ లేపనం పూయకపోతే గాయం ఎప్పటికీ పచ్చిపుండే అన్నారు. దోసిలి తెరిస్తే ఏ అడ్డూ లేని శూన్యంలోకి సీతాకోకచిలుక స్వేచ్ఛగా ఎగిరిపోతుందన్నారు. గడ్డిపూల మీద గడ్డకడుతున్న మౌన రాగాలను వినిపించారు. ఇల్లుని గాయాలగని అన్నారు. పొట్ట చేతపట్టుకున్న జనం మెతుకు సత్యాగ్రహాలను కవిత్వం చేసి చూపించారు. పట్టుపోగుల నడుమ నెత్తిపోగు అడ్డుపడ్డట్టు/ జిగిబిగి అల్లిక పట్టుతప్పుతున్నదని చేనేత వృత్తిని తలపోస్తూ బాధపడ్డారు. చీరకట్టు సంస్కృతికి ఊపిరి దారం అందుతుందని తెలిపారు. మబ్బు మాటుకు వెలుగు వెళ్ళిపోయిందని వేదనపడ్డారు. సినారె సంతకం కవితలో విశ్వంభరను గురించి చెప్పారు. పాదాలను తాకితే రెండు చేతుల నిండా కవిత్వం అంటుకునేది కదా అని తెలిపారు. రెక్క తెగిన చిలుక మూగ రోదనను ప్రపంచానికి తెలియజెప్పారు. పరాన్నజీవుల నైజాన్ని ఎండగట్టారు.
పూలతోటలో గాలివానలా పుట్టిన బుల్లితెర నాటకాన్ని తప్పిపోయిన తన మొదటి పాఠకురాలిగా చూపించారు. కనురెప్ప ఒడిలోంచి జారిపోయిన దుఃఖాలను గురించి తెలిపారు. కొత్త శివుడు కవితలో నాన్న విశ్వరూపాన్ని చూపించారు. బ్రతుకు వెతుకులాటలో ప్రాణం ఫణంగా పెట్టిన సర్కస్ వారికి ప్రణామాలు అర్పించారు. పిడికెడు ఖాళీ కప్పులోకి గాలిలా ఒదుగుతుందని అన్నారు. కొత్త ఆశల సెలైన్ ఉషారెక్కిస్తుందని చెప్పారు. ఆ మూలమలుపున తన రెక్కల కష్టం సగం ధరకే అమ్ముకునే దుస్థితి పొందిన పొద్దటి చందమామ రైతన్నను తలుచుకున్నారు. వేన్నీళ్ళకు చన్నీళ్ళలా బ్రతుకు బాటలో ఎదురయ్యే కష్టాలను వివరించారు. బెంగటిల్లిన రాత్రిల్లో దొర్లిపోయిన దిగులులను కూడా ప్రస్తావించారు. కాలం కవిత్వంలా కదిలిపోతుందని చెప్పారు. వాడు / మురికి దుప్పటి కప్పుకొని / మాడుతున్న పేగు ఈడ్చుకెళ్తున్న / ఆకలి శిఖరం/వాని కాలి కడుపు నిండిన ఆనందం/ కళ్లల్లో పూయిస్తాడు అంటూ ఐస్క్రీం అమ్మే కరిగిపోని మనసున్న మంచు మనిషిని లోకానికి పరిచయం చేశారు. ఎవరైనా గాలి నురగల తలస్నానం చేసి వాయు విహారానికి వెళ్ళాల్సిందే అన్నారు. బెత్తం దెబ్బలు/ చెట్టు కింద ఎక్కాలు/ అదృశ్య దృశ్యాలుగా కురుస్తున్నాయని తెలిపారు. అప్పంటే జ్వరం మందు కాలకూటమైనట్టు భావించారు. వానంటే అనురాగ సందేశం/ నీటి పువ్వుల సంబరం/ మారాము చేసే పసితనం అన్నారు. అప్పంటే / జ్వరం మందేదో కాలకూటమైనట్టు/ మిత్రుడు సతమతమయ్యే ఒప్పంద పత్రం అని చెప్పారు. బతుకు భారాలు తెలిసి ఆగని కన్నీళ్లతో తన అంతరంగంలో కవి అల్లిన ఆర్ద్రపు భావాల పోగుల పేటిక ఇది. (దీపముండగానె కవితా సంపుటికి… 2023 ఫీచర సునీతారావు తృతీయ వార్షిక స్మారక సాహిత్య పురస్కారం లభించిన సందర్భంగా…)
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





