- ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే హైలైట్
- గుజరాత్‌కు బంగారు గుడ్డు…తెలంగాణకు గాడిదగుడ్డు అంటూ బిజెపిపై కాంగ్రెస్ విమర్శలు
- వంద రోజుల్లో ప్రజలకు మీరిచ్చింది అదే అంటూ బిజెపి ప్రతి విమర్శ
(మండువ రవీందర్‌రావు)
ఈ మధ్య రాజకీయల్లో ‘గుడ్డు’ పదప్రయోగం బాగా వినిపిస్తున్నది. ఒక విధంగా దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవంగా మొదటి నుండీ గుడ్లకు రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నిరసనలు తెలపడం, దాడిచేసుకునే క్రమంలో కోడిగుడ్లు, టమాటాలు విసురుకోవడం గతంలో చూశాం. ఇప్పుడు కుర్చీలెత్తేసుకుంటున్నారు..అది వేరే విషయం. ఈ మధ్య రాజకీయ నాయకులు మరో కొత్త ‘గుడ్డును వాడుకలోకి తీసుకుని వొస్తున్నారు. కొత్తదంటే కొత్తదేమీకాదు కానీ ఒక సామెతగా వాడుకునే ఈ గుడ్డు కథాకమామీషేమిటన్నది ఇప్పటికే అర్థమై ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హోరాహోరీ పోరాడుతున్న కాంగ్రెస్, బిజెపిల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఈ ‘గుడ్డు’ ప్రాధాన్యత పెరిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత దశాబ్దకాలంగా తెలంగాణకు ఇచ్చింది ఇది మాత్రమేనంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవల కాలంలో పలు ప్రచార సభల్లో అతిపెద్ద కోడిగుడ్డు ఆకారంపైన ‘గాడిద గుడ్డు’ అని రాసిన దాన్ని ప్రజలకు చూపించడం ప్రారంభించాడు. సాధారణంగా ఒకరు బాధ్యతగా చేయాల్సిన పనిని చెయ్యకపోవడాన్ని, ఆర్థికంగా ఆదుకోకపోవడాన్ని ఎదుటివారి దృష్టికి తీసుకువచ్చే క్రమంలో ‘ ఆ.. ఏంచేశాడండీ గాడిద గుడ్డు’ అని తీసిపారేయటం ఆనవాయితీ. అంటే గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. ఆ వ్యక్తి పనిచేయడం కూడా అంతే నిజమని అర్థం వొచ్చే విధంగా పూర్వ కాలం నుండీ ఈ పద ప్రయోగం చేయడం అనవాయితీగా వొస్తున్నది. అయితే తెలంగాణ ఎన్నికల్లో దీనికిప్పుడు ఎక్కడలేని ప్రాధాన్యత వొస్తున్నది.
ఎన్నికల కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్న క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం దీన్ని సామెతగా కాకుండా గుడ్డు ఆకారాన్ని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేయడం పలువురిని విస్మయపరుస్తున్నది. బిజేపి చేసిందేమీలేదు అని రాసి ఉన్న బాక్స్‌మీద ఒక పెద్ద గుడ్డు ఆకారాన్ని నిలిపి, దానిపైన ‘గాడిద గుడ్డు’ అని రాసి, ప్రతీ సభలో దాన్ని చూపించడం ద్వారా బిజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని చెప్పడం ద్వారా ప్రజల నుండి సానుభూతిని పొందాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభల్లో ఇదొక హైలెట్‌గా మారింది. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు లాంటివాటిపై మా• ఇచ్చి తప్పిన కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ మాత్రమేనంటూ ఆయన బిజేపీపైన తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తాజాగా విడుదల చేసిన ‘దిల్లీ దర్బార్’ యాడ్ వీడియోలో, దర్బార్‌ను నడుపుతున్న మోదీని రాజుగా చూపిస్తూ, పన్నుల వసూళ్ళలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నా, తెలంగాణ ప•్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్న విషయాన్ని తెలియజేస్తూ, గుజరాత్‌కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిద గుడ్డు అని చూపించింది. రేవంత్‌రెడ్డి తన ఎక్స్ వేదికలోకూడా పదేళ్ళ బిజెపి తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని విమర్శించడం ప్రారంభించారు. గోదావరి జలాల వాటాల పంపకం, మేడారంకు జాతీయ హోదా లాంటి పలు హామీలను నెరవేర్చలేదంటూ అందులో విమర్శిస్తున్నారు.
అయితే దీన్ని బిజేపి కూడా సీరియస్‌గానే తీసుకుంది. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను ప్రజల చెంతకు చేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అయిదు నెలల్లో ఇచ్చింది ఆ ‘గాడిద గుడ్డే’కదా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎదురు దాడి ప్రారంభించారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపి, బిజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అయితే మరింత ఘాటుగా రేవంత్‌రెడ్డి గాడిద గుడ్డుపై స్పందించారు. సంక్షేమాన్ని నిజంగా కోరుకున్నవారికి ఇది బంగారు గుడ్డుగా కనిపిస్తుందని, దోపిడి మాత్రమే తెలిసిన వారికది ‘గాడిదగుడ్డు’గానే ఉంటుందన్నారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం దాదాపు పది లక్షల కోట్ల రుణసహాయం అందించడమే ‘గాడిద గుడ్డు’ అవుతుందా అని ఆయన నిలదీస్తున్నారు. 60 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన హైవేలకు సమానంగా పదేళ్ళలో బిజేపి ప్రభుత్వం హైవేలు నిర్మించడం, గిరిజనుల ప్రగతికి సమ్మక్క, సారలమ్మ విశ్వవిద్యాలయం ఇవ్వడం, రైతుల ఎరువు నష్టాలను తీర్చేవిదంగా రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించడం, పన్నుల వాటాలో 32 శాతంనుండి 41 శాతానికి పెంచి లక్షా 60కోట్లు ఇవ్వడమంతా గాడిదగుడ్డేనా అని ఆయన ప్రశ్నించారు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన అనేక పనులు, నిధులను ఆయన ఏకరువు పెట్టారు. కాగా రాజ్యసభ బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా రేవంత్‌పై మాటల దాడి చేశారు. గాడిదగుడ్డో.. పాము గుడ్డో ముందు ముందు మీకే గుర్తుకు వొస్తుందంటూ ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో అడ్డదారులు తొక్కవద్దని హితవు పలికారు. రేవంత్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటూ.. స్వయంగా ప్రధాని మోదీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినా, ప్రచార సభల్లో పదేపదే అదే విషయాన్ని రేవంత్ ఊటంకించడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ‘గాడిద గుడ్డు’పై ఒక కథ ప్రచారంలో ఉంది. గాడిద గుడ్డు అంటే.. అది గాడిద కనుగుడ్డు అని. తోటివారితో సమానంగా విద్యనభ్యసించలేకపోయిన ఒక శిష్యుడికి కేవలం నాలుగు శ్లోకాలతో పండితుడైపోవచ్చని చెప్పిన గురువు ద్వారా నాలుగు శ్లోకాలు వల్లెవేసిన శిష్యుడికి దారిలో కనిపించిన మృతగాడిదకు తన మొదటి శ్లోకాన్ని అనుసరించి ప్రేత సంస్కారం చేయడానికి దాన్ని తాడుతో కట్టి తీసుకెళ్ళడంలో జరిగిన పరిణామాలే ఈ కథలోని ముఖ్యాంశాలు. చివరలో రాజదర్శనం వేళ వట్టిచేతులతో వెళ్ళకూడదన్న శ్లోకాన్ని గుర్తుంచుకున్న శిష్యుడు, అంతకుముందే నరికిన గాడిద తలలోని కనుగుడ్డును రాజుకు బహుమతిగా ఇచ్చి, ఆయన ఆగ్రహానికి గురై చావుదెబ్బలు తినడం అందులోని చివరి ఘట్టం. గాడిద కనుగుడ్డు రాజుకివ్వడం ఎంత ఉపద్రవాన్ని తెచ్చిపెట్టిందన్న దాన్ని బట్టి అదే గాడిద గుడ్డు కథగా ప్రచారం పొందిందని సోషల్ మీడియాలో కథ ప్రచారంలో ఉంది. ఏదేమైన గాడిదగుడ్డు చుట్టూ రాజకీయాలు తిరగడం ఓ కొత్త వింత.





