- కేబినేట్ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు
- నామినేటెడ్ ఎమ్మెల్సీలపైనా చర్చించి ఉంటారని చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించ వొచ్చునని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గత వారం దిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్ ప్రధాన నాయకులతో కేబినెట్ విస్తరణ గురించి చర్చించారని తెలిసింది. ఐదు నుంచి ఆరుగురు మంత్రులను కేబినెట్లోకి తీసుకోవడం ఖరారయిందని తెలుస్తుంది. మంత్రి పదవులు వొస్తాయని చాలా మంది గత ఆరు మాసాలుగా ఎదురుచూస్తున్నారు.
రేవంత్ రెడ్డి, ఆయన 11 మంది కేబినెట్ కొలీగులు 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సహా రాష్టాన్రికి గరిష్ఠంగా 18 మంది మంత్రులు ఉండొచ్చు. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నఅసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి గవర్నర్‌కు వివరించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా నామినేటెడ్ ఎంఎల్‌సిల అంశం కూడా చర్చకు వొచ్చిందని తెలుస్తుంది.
గత మార్చిలో తెలంగాణ హైకోర్టు గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన ఎమ్ కోదండరామ్, అర్ అలీ ఖాన్ నామినేషన్లను కొట్టేసిసిన నేపథ్యంలో సిఎం భేటీలో ఈ అంశాలు కూడా చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ప్రధానంగా కేబినేట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలను చర్చించి ఉంటారని అనుకుంటున్నారు.





