గడీల పాలన స్థానంలో ఇందిరమ్మ రాజ్యం..

దాయాదులకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
బిఆర్‌ఎస్‌ బోగస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు..
అధికారం పోయిందనే అక్కసుతో అసత్య ప్రచారం
ప్రజలపై రూ. 7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది
మూడు నెలల్లో 25వేల ఉద్యోగాలిచ్చాం : మంత్రి పొంగులేటి

కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 29 : తెలంగా ణలో గత పదేళ్ల గడీల పాలన నుంచి విముక్తి లభించి  నేడు ఇందిరమ్మ రాజ్యం దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన వైపు అడుగులు వేస్తోందని  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అభయ హస్తం పేరిట ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని బిఆర్‌ఎస్‌ పార్టీ నియామకాలు, నీళ్ల పేరుతో అధికారంలోకి వచ్చి యావత్‌ తెలంగాణను దోచుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పాలనను ఓర్వలేని బిఆర్‌ఎస్‌ నేతలు బోగస్‌ ప్రచారాలకు సిద్దమవ్వడం సిగ్గు చేటని విమర్శించారు.  దాయాదులకు దోచి పెట్టేందుకు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని తీవ్రంగా విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి మండలం విద్యానగర్‌ కాలనీలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధనిక రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై పెను భారాన్ని మోపిందని మండిపడ్డారు.  నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్‌  వైద్యం అందించేందుకు  ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ 10 లక్షలకు పెంచామని, పేద, మధ్యతరగతి కుటుంబాలపై  భారం తగ్గించేలా 200 యూనిట్ల ఉచిత కరెంటు, గ్యాస్‌ సబ్సిడీ ఇస్తున్నామన్నారు.  అభయ హస్తం పేరుతో  ఇచ్చిన ఆహామీలను నెరవేర్చే దిశగా సిఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.  అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని,  ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో18500 ఉద్యోగాలు ఇచ్చామన్నారు.   ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలలోపే 25వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని తెలిపారు.   ఇచ్చిన మాట ప్రకారం  11062వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని చెప్పారు.   పదేళ్ల  పాలనలో తెలంగాణను బిఆర్‌ఎస్‌ ఏ విధంగా దోచుకున్నారో అసెంబ్లీ  సాక్షిగా తెలంగాణ ప్రజల ముందుంచామని  అన్నారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సొమ్మును అప్పనంగా దోచుకున్నారని మంత్రి విమర్శించారు. బిఆర్‌ఎస్‌ పాలనలో టిఎస్‌పిఎస్‌సి అవినీతిమయమైందని,  పేపర్‌ లీక్‌  చేసి మంత్రులే ఉద్యోగాలు అమ్ముకున్నారని మండిపడ్డారు.  భ్రస్టుపట్టిన టిఎస్‌ఎస్సీని  ప్రక్షాళన చేసి పారదర్శకంగా పనిచేసేందుకు రిట్కెర్డ్‌ ఉద్యోగులను నియమించామన్నారు. ఆరు గ్యారెంటీల అమలు జరగడం లేదంటూ బిఆర్‌ఎస్‌ నేతలు బోగస్‌ ప్రచారాలకు తెరతీస్తున్నారని, అవి ప్రజలు నమ్మవద్దని మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే లబ్దిదారులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వ కార్యాలయాల్లో  అధికారులతో వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లబ్దిదారులు ఆధారాలు సమర్పిస్తే పథాకాలను అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాన్ని సైతం అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడిరచారు. బిఆర్‌ఎస్‌ అవినితీకి పరాకాష్టకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్దం పడుతోందని. కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు కలిసి రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తే మాజీ సిఎం కెసిఆర్‌ కుంటి సాకులు చూపారని ఎద్దేవా చేశారు. కుంగిన ప్రాజెక్టును పరిశీలించమని అడిగితే సభ్యత మరిచి మాట్లాడారని, అధికారం పోయినా అహంకార ధోరణి ఇంకా పోలేదన్నారు. పద్దతి మార్చుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. త్వరలోనే కొత్త తెల్ల రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని, లబ్దిదారులను సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని  మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *