కోట్లు కుమ్మరించినా గంగా ప్రక్షాళన  ఏదీ?

ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపి వరుణ్‌ ‌గాంధీ విమర్శలు
న్యూ దిల్లీ, జూలై 26 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’నమామి గంగే’ కార్యక్రమంపై బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. సొంత పార్టీకిచెందిన వరుణ్‌ ‌ప్రశ్నలు లేవనెత్తారు. రూ.11,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ గంగా నది ఎందుకు కలుషితమవుతోందని ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నమామి గంగే కార్యక్రమం జరుగుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది జరుగుతోంది. 2015-2020 మధ్య కాలంలో ఈ పథకం కోసం రూ.20,000 కోట్లు కేటాయించారు.

ఈ నేపథ్యంలో వరుణ్‌ ‌గాంధీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, గంగా నది మనకు కేవలం నది మాత్రమే కాదు. మన తల్లి. కోట్లాది మంది భారతీయుల జీవనాధారం, ఆచార, సంప్రదాయాలు, అస్థిత్వాలకు ఆధారం గంగా మాత. అందుకే నమామి గంగే కోసం రూ.20,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు అని పేర్కొన్నారు. రూ.11,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ గంగా నది ఎందుకు కలుషితమైంది? గంగా నది జీవనోపాధిని ఇస్తుంది. అలాంటపుడు మురికి నీటి వల్ల ఇక్కడి చేపలు ఎందుకు మరణిస్తున్నాయి? దీనికి ఎవరు జవాబుదారీ? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *