సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ
అభివృద్ధి కంటే అప్పుల ఊబిలోకి రాష్ట్రం..
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం
బిఆర్‌ఎస్ అంటే భారత రాక్షస సమితి
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 23 : తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీ సాగుతుందని, కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోపించారు. ధరణితో పేదల భూములు గుంజుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎటిఎంగా మారిందని, 38 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లకు పెరిగిందని, అయినా కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన పిల్లర్లు కుంగినయని ఆయన దుయ్యబట్టారు. దళితబంధులో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని, ఇలాంటి వాళ్ళని జైల్లో వెయ్యాలా.. వొద్దా అంటూ నడ్డా ప్రశ్నించారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అవినీతిపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపిస్తామని నడ్డా అన్నారు. గురువారం బీజీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో జెపి నడ్డా మాట్లాడుతూ..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారని, బిజెపి అధికారంలోకి వొస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తామని అన్నారు. బిఆర్‌ఎస్ అంటే భారత రాక్షస సమితి అని తెలిపారు. ఫసల్ భీమా యోజన కోసం ప్రధాని డబ్బులు పంపిస్తే కేసీఆర్ అడ్డుకున్నారని అన్నారు. ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ని అడ్డుకుని తగి బుద్ధి చెప్పాలని తెలిపారు.
ప్రధాని అవాస్ యోజన కింద 20 వేల ఇల్లు ఇస్తే…డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ గా మార్చారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ 5జి నడుస్తుందని అన్నారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని దోచుకునే రాజ్యాన్ని కొనసాగిద్దామా..? మహిళలకు ఆర్థిక స్వాలంబన లభించాలంటే బిజెపికి వోటేయండి అని అన్నారు. మన మధ్య ఉన్న భేదాలను పక్కకు పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేద్దామని కోరారు. ప్రధాని అధికారంలోకి మళ్ళీ వొస్తే రెండేళ్లలో మూడో స్థానంలోకి వొస్తుందని అన్నారు. చైనా మొబైల్ కాకుండా మెడ్ ఇన్ ఇండియా మొబైల్స్ వాడుతున్నామని, అది మార్పు అని తెలిపారు. రూ .35 కోట్ల మంది దారిద్య్ర రేఖకి దిగువన వొచ్చారని తెలిపారు. గత పదేళ్ళలో కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.అన్ని వర్గాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే నవంబర్ 30న కమలం పువ్వు గుర్తుకు వోటెయ్యండని కోరారు. 26 లక్షల బీద కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని అన్నారు. ఈ కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని తెలిపారు. 38 లక్షల కుటుంబాలకు తాగు నీరు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. కేసీఆర్, కాంగ్రెస్ అన్ని ఉచితాలు చెబుతుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని అన్నారు.
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, రెండు పార్టీలలో ఎవరు అధికారంలోకి వొచ్చిన అవినీతి గ్యారెంటీ అని తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని అన్నారు. ఓ బిసి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. పసుపు ధరని నిర్ణయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫసల్ బీమా యోజన అమలు చేస్తామని తెలిపారు. ‘‘కాంగ్రెస్ మాటలకు గ్యారెంటీ లేదని, కాంగ్రెస్ సర్కారు వొస్తే కర్ణాటకలాగా అవుతుందని, కేసీఆర్ వొస్తే కుటుంబ పాలన వొస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎన్నికలు వొస్తేనే ప్రజలు గుర్తొస్తారని, పెట్రోల్‌పై, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని, రూ.2500 ఇన్‌పుట్ సబ్సీడీ రైతులకు ఇస్తాం, పసుపుబోర్డు ఇచ్చామని అన్నారు. మార్కెటింగ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆడపిల్లలు పుడితే రూ. 2లక్షలు బాండ్ ఇస్తామని ప్రకటించారు. డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో పేదలకు వైద్యానికి రూ. 10లక్షలు, పేదలకు ఇంటి స్థలం, నిర్మాణానికి సాయం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు వోట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థులు పులిమామిడి రాజు, సంగప్ప, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, కొండాపురం జగన్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




