టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి డిమాండ్
గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 3016రూపాయల పెన్షన్ హామీ మాటను నిలబెట్టుకోవాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి డిమాండు చేశారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ…గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయస్సు మళ్లిన వారికి ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో దాంట్లో కొంత మంది అనేక ఇబ్బందులు ఎదుర్కునాల్సి వొస్తుందన్నారు. వాళ్ల వయస్సు 65 నుండి 70 సంవత్సరలు ఉంటే ఆధార్‌కార్డులో మాత్రం 55, 60వయస్సు లోపుగా ఉన్నాయనీ, ఈ వయస్సు వారి దగ్గర బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం ప్రధాన కారణమన్నారు. దీంతో రాష్ట్రంలో అనేక మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోల్పోతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారి, సిబ్బందిని ఇంటింటికి పంపించి ఆ ఇంట్లో వయస్సు మీరిన వారిని అడిగి వారి ఆధార్‌కార్డులో డేట్ మార్చాలన్నారు.
Also Read: నేటి నుండి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు
ఇలా చేస్తే ముసలితనంలో ఉన్న వారు చాలా మందికి ఆర్థికంగా లాభం జరుగుతుందన్నారు. దీనిని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులందరికీ 3016 రూపాయలు ఇస్తామన్నారనీ, కానీ ఇప్పుడు 2016 రూపాయలే ఇస్తున్నారనీ, ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా వెంటనే 3016 రూపాయల పెన్షన్ అమలు చేయాలన్నారు. 57 ఏళ్ల వారికి కూడా 3016 రూపాయల పెన్షన్ అమల్లోకి రావాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోని వార్డులో, గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆధార్‌కార్డులో వయస్సు తక్కువ, తప్పుగా వొచ్చినవారికి ప్రభుత్వమే సవరణ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నో లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఇరిగేషన్ ప్రాజెక్టులను కడుతున్న ప్రభుత్వం ముసలితనంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న భార్య భర్తలిద్దరికీ పెన్షన్ ఇవ్వడం వల్ల ఇంకొకరిపై ఆధారపడకుండా జీవించే అవకాశం ముసలితనంతో ఉన్న వృద్దులకు దొరుకుతుందనీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.




