కె.పి.హెచ్‌.బి. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పోలీస్‌ అట్రాసిటీపై పారదర్శకంగా విచారణ జరపాలి

మానవ హక్కుల వేదిక డిమాండ్‌

హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన  ప్రణీత్‌ అనే వ్యక్తి పైన, పోలీసులు డిసెంబర్‌ 23 న కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ లో విచారణ పేరుతో  దాడికి పాలుపడ్డారు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు, నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక  ప్రధాన కార్యదర్శి సంజీవ్‌, కార్యదర్శి రోహిత్‌,  సభ్యురాలు శ్రావ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని పత్రికలు, మీడియా ద్వారా వచ్చిన వార్తలు తెలుసుకున్న మానవ హక్కుల వేదిక బృందం,  డిసెంబర్‌ 27న  నిజ నిర్ధారణ జరిపిందని వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నారు.

ప్రణీత్‌ ఒక ప్రైవేట్‌ బ్యాంకులో మేనేజర్‌ గా పని చేస్తున్నాడు, స్వగ్రామం గుంటూరు. హైదరాబాద్‌ నిజాంపేటలో నివసిస్తున్నాడు. ఇతనికి 2018 లో శ్రీలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి 3 ఏళ్ల పాప ఉంది. గత రెండు సంవత్సరాలుగా భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. 2023 జూన్‌ లో గుంటూరులోని దిశ పోలీస్‌ స్టేషన్‌ లో తనను వేధిస్తున్నారు అనీ, ప్రణీత్‌ మరియు అతని కుటుంబ సభ్యుల మీద గృహహింసా చట్టం కింద శ్రీలక్ష్మి కంప్లైంట్‌ చేసింది. ఈ విచారణ నడుస్తుండగా, తన సర్టిఫికెట్స్‌ ప్రణీత్‌ దగ్గరే ఉన్నాయి అని గుంటూరు పోలీసులను ఆశ్రయించగా, అంతకుముందే  పెట్టిన కేసు విచారణలో  ఉంది అని ఈ కొత్త కంప్లైంట్‌ తీసుకోలేదు. ఇదే విషయమై హైదరాబాద్‌ నిజాంపేట పరిధిలో ఉన్న కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్‌ చేసింది. పోలీసులు ఇంతకు ముందే గుంటూరులో ఉన్న కేసు విషయం తెలిసి కూడా, ఈ కొత్త కంప్లైంట్‌ తీసుకొని విచారణ కోసం ప్రణీత్‌ ని డిసెంబర్‌ 23 న కె.పి.హెచ్‌.బి స్టేషన్‌ కి ఉదయం 11 గంటల ప్రాంతంలో పిలిచారు. విచారణ పేరుతో తన దగ్గర ఉన్న ఫోన్‌, ఇతర వస్తువులు అన్ని లాక్కున్నారు. కంప్లైంట్‌ కి సంబంధించిన ఎలాంటి వివరాలు చూపించలేదు. సి.ఐ వెంకటేష్‌ తన గదిలోకి  పిలిచి కొట్టాడు.

అక్కడే సివిల్‌ డ్రెస్‌ లో ఉన్న ముగ్గురు  కానిస్టేబుల్స్‌, ఎస్‌.ఐ. తీవ్రంగా కొట్టారు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. రబ్బరు లాఠీలతోని అరికాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు బాదారు, తనను అనేక ప్రాంతాల్లో గాయ పరిచి చిత్రహింసకు గురిచేసారు అనీ, బాధితుడు మా బృందంతో చెప్పాడు.   తనని తీవ్రంగా కొట్టిన తరువాత, తను ఉన్న పరిస్థితిని అప్పటికే స్టేషన్‌ చేరుకున్న తన భార్యకి పోలీసులు చూపించారు. రాత్రి 11 గంటల సమయానికి కుటుంబ సభ్యులు వాళ్లకు తెలిసిన నాయకులతోని ఫోన్‌ చేయిస్తే తప్పా, విడిచి పెట్టలేదు. చికిత్స కోసం ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి వెళ్లితే, మెడికో లీగల్‌ కేసు అని నిరాకరించి, ప్రభుత్వ హాస్పిటల్‌ లో చేరి వైద్యం చేయించుకున్నాడు. శరీరం నిండా దెబ్బలు, తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయ్యాడు. ఈ వార్త సైబరాబాద్‌ కమీషనర్‌ దృష్టికి వెళ్లగా, కమీషనర్‌ విచారణకు ఆదేశించాడు. శ్రీలక్ష్మి చేత మురళి మీద ఒక కంప్లైంట్‌ కూడా తీసుకున్నట్టు, బాధితుల కుటుంబం భావిస్తున్నది.  ఈ విషయమై కె.పి.హెచ్‌.బి. పోలీస్‌ స్టేషన్‌ లో నిజ నిరాదరణకి వెళ్లిన మా బృందానికి, కమిషనర్‌  డీ.సీ.పీ. స్థాయి అధికారి తోని ఎంక్వయిరీ వేశారు అనీ, వాటి వివరాలు రావలసి ఉంది అనీ తెలిపారు.

దొంగతనాలు, పెద్ద నేరాలు చేసిన వాళ్లను పోలీసులు స్టేషన్‌ కి తీసుకువెళ్లి హింసకు గురి చేయడం తరచుగా వింటుంటాం. కానీ, సామాన్య జీవితం గడుపుతూ బ్యాంకు మేనేజర్‌ హోదాలో ఉంటూ, గృహ హింస కేసులో విచారణ ఎదుర్కుంటున్న వ్యక్తి పైన అది కూడా వేరే రాష్ట్రంలో నమోదు అయిన కేసు మీద, ఇక్కడి పోలీసులు అక్కసు చల్లడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, దుర్భాషలాడడం అత్యంత హేయమయిన చర్య. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అన్న ఆకాంక్షకు ఎంత దూరాన ఉన్నామో ఈ సంఘటనే ఉదాహరణ.

ఇంత చిన్న విషయంలో బాధితుడి పై జరిగిన దాడి వెనుక, రాజకీయ పలుకుబడి, డబ్బు ప్రవాహం ఉన్నదన్న ఊహాగానం వినిపిస్తున్నది. సగటు మనిషి మీద జరిగిన ఈ పోలీసుల దాడి వల్ల, పోలీస్‌ స్టేషన్లు ప్రజలకు మరింత దూరం అవుతున్నాయి. ఈ సంవత్సరం హైదరాబాద్‌ లో పోలీస్‌ స్టేషన్లో జరిగి వెలుగులోకి వచ్చిన ఐదవ పోలీస్‌ అట్రాసిటీ కేసు ఇది. ఇటువంటి విషయాలలో పోలీసు శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించాలని వారు కోరారు.  అడిషనల్‌ డీ.సీ.పీ ఆధ్వర్యంలో వేసిన విచారణ పారదర్శకంగా జరగాలి. బాధితుడిపై జరిగిన దాడికి కారణం అయిన పోలీసుల్ని సస్పెండ్‌ చేయాలి, వారి పైన క్రిమినల్‌ ప్రొసీడిరగ్స్‌ జరపాలి. బాధితుడిని, తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయకుండా, ఎలాంటి విచారణలు అయినా చట్ట పరిధిలోనే జరపాలి. బాధితుడి తమ్ముడి మురళి పైన తప్పుడు కేసు పెట్టారు అనీ, బాధితుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు, అలాంటి కేసులు ఏమైనా ఉంటే కొట్టి వేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తుందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *