‘‘ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్య్ర భారతావనిని అభివృద్ధి పర్చుకునేందుకు రాసుకున్న రాజ్యాంగాన్ని కేంద్ర పాలకులు విస్మరిస్తున్నారన్నది ఆ రాష్ట్రాల ఆరోపణ. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒకతీరు న్యాయం, ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మరో తీరు న్యాయాన్ని కనబరుస్తున్న తీరుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. సమర్థమైన నాయకుడెవరైనా ఇలా పక్షపాతంగా వ్యవహరించడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలన్న దృక్పథంతోనే కెసిఆర్ ఈ భారత్ భవన్ నిర్మాణానికి ఉపక్రమించారు.’’
కెసిఆర్ మస్తిష్కం నుండి ఉద్భవించిన మరో కొత్త ఆవిష్కరణ ‘భారత్ భవన్’. కోకాపేటలో సుమారు పదకొండు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేస్తున్న ఈ భవనానికి సోమవారం స్వయంగా కెసిఆరే శంఖుస్థాపన చేశారు. సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ భవన్‌గా పేర్కొంటున్న ఈ కట్టడం భవిష్యత్‌లో భారతదేశానికి సమర్థవంతమైన నాయకులను అందించే శిక్షణా కేంద్రంగా విలసిల్లాలన్నది కెసిఆర్ ఆకాంక్ష. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాలన్న ఉద్దేశ్యంగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌పేరున జాతీయ పార్టీగా మార్చినప్పటినుండి ఆయన జాతీయ రాజకీయాలవైపు ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ విషయమై గత సంవత్సరకాలంగా ఆయన వివిధ రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలతో మంతనాలు జరుపుతూ వచ్చారు. దేశంలో రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మినహా కలిసి వచ్చే పార్టీలతో స్నేహహస్తం జాపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. అయినా తన ప్రయత్నలోపం లేకుండా ముందుకు దూసుకు పోతున్న క్రమంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి మంచి స్పందన లభించింది. మహారాష్ట్రలో ఇప్పటికే మూడునాలుగు బహిరంగ సభలను ఏర్పాటు చేయడంతోపాటు, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఏలు, రైతు నాయకులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూకట్టడం ఒక విధంగా ఆ పార్టీకి కలిసి వస్తున్న అంశం. అలాగే కర్ణాటక•, ఏపి నుండి కూడా మంచి స్పందనే కనిపిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికలనాటికి మరెన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీ వేళ్ళూనుకుంటుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.
అయితే ముందుగానే చెప్పినట్లు దేశంలో ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడలేదన్న భావన ఉంది. ముఖ్యంగా బిజెపి పాలనలో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తుందనడానికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తరుచు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైన విరుచుకు పడుతున్న తీరే ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్య్ర భారతావనిని అభివృద్ధి పర్చుకునేందుకు రాసుకున్న రాజ్యాంగాన్ని కేంద్ర పాలకులు విస్మరిస్తున్నారన్నది ఆ రాష్ట్రాల ఆరోపణ. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒకతీరు న్యాయం, ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మరో తీరు న్యాయాన్ని కనబరుస్తున్న తీరుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. సమర్థమైన నాయకుడెవరైనా ఇలా పక్షపాతంగా వ్యవహరించడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలన్న దృక్పథంతోనే కెసిఆర్ ఈ భారత్ భవన్ నిర్మాణానికి ఉపక్రమించారు.
నాయకుడనేవాడు కేవలం ఒక ప్రాంతం, ఒక పార్టీ అనే భేదాభిప్రాయం లేకుండా ఎక్కడ ఎలాంటి అవసరమున్నదన్న విషయాన్ని గ్రహించగలిగే నేర్పరితనం ఉండాల్సి ఉంటుంది. అప్పుడే అతను ఆసాధారణ నాయకుడిగా కొనియాడబడుతాడు. ప్రకృతి, దైవం మనకిచ్చిన వనరులను సద్వినియోగం చేసుకునే నేర్పరితనం ఉండాలి.
అప్పుడే దేశంలో అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. వివిధ సంప్రదాయాలు, ఆచారాలతో ముడివడి ఉన్న అతి ప్రాచీన భారతదేశానికి నాయకత్వం వహించడమంటే భరతజాతి పూర్వపరం గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి. పుష్కలంగా ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యం దిశగా పురోగమించాల్సి ఉంటుంది. అలా అన్ని కోణాల్లో నాయకులుగా ఎదిగేందుకు ఉపయోగపడేదే భారత్ భవన్. భావితరాలకు సరైన మార్గ నిర్దేశికత్వాన్ని చూపించగల నాయకులను తయారు చేసే ఒక పరిశ్రమగా ఇది విరాజిల్లాలన్నదే కెసిఆర్ సంకల్పంగా కనిపిస్తున్నది. ప్రాంతీయ, జాతీయ. అంతర్జాతీయ అంశాలపైన బోధన, శిక్షణ, పరిశోధనలు జరిపే ప్రక్రియను ఇక్కడ చేపట్టబోతున్నారు. అంతేకాదు ఆర్థిక, పర్యావరణ, రాజకీయ విషయాలపై ప్రతీ నాయకుడికి అవగాహన ఉండాలన్నదే ఈ భవన నిర్మాణ లక్ష్యం. ఏండ్లు గడుస్తున్న కొద్ది మానవ పరిణామ క్రమంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సమాజంలో కొత్త అవసరాలు వెలుగు చూస్తుంటాయి. లక్ష్యాలు మారుతుంటాయి. అనేక క్లిష్ట సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. వాటన్నిటినీ ఆకళింపు చేసుకుని, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఎదగాలంటే వివిధ విషయాలపైన అవగాహన ఉండాల్సి ఉంటుంది. తగిన భూమికను పోషించగలిగే సిద్ధాంతకర్తలు కావాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అన్ని విషయాలను వివరించి చెప్పేందుకు పలువురు ఆర్థిక నిపుణులు, మాజీ గవర్నర్‌లు, వివిధ రంగాల్లో ఉన్నత పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసిన నిపుణులు, రాజకీయ, సామాజిక వేత్తలు, తమ కాలంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది, భవిష్యత్‌లో అలాంటి వాటి పరిష్కారాలెలా ఉండాలన్న విషయాలను వివరించగలిగే మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్ర పతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ శిక్షణలో భాగస్వాములు అవుతారంటున్నారు. వీరేకాకుండా వివిధ రంగాల్లో నిపుణులైన విదేశస్తులను కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి ఆహ్వానించనున్నట్లు భవన శంఖుస్థాపన సందర్భంగా కెసిఆర్ పేర్కొనడం గమనార్హం. అయితే ఈ భవనం బిఆర్‌ఎస్ మరో పార్టీ కార్యాలయంగా కొనసాగనుండడంపై పలురాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
మండువ రవీందర్ రావు




