కెసిఆర్‌కు చెక్‌ ‌పెడుతున్న విపక్షాలు

కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా ..
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌పట్ల  రైతుల ఆగ్రహం
ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్‌ ‌లంబాడీలు
మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):  కెసిఆర్‌ ‌కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ఈ ముగ్గురిని ఓడించడంద్వారా ఇటు దొరల పాలనకు, అటు కుటుంబపాలనకు చరమగీతం  పాడినట్లు అవుతుందని ఆ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాలిప్పుడు ఆసక్తికరంగా  మారాయి. అభ్యర్ధుల ఎంపికలో గతంలోలాగా సిఫారసులకు లొంగకుండా గెలిచే గుర్రాలకే టికట్లు ఇచ్చే దిశలో పార్టీ అధినాయకత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

image.png

భారస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ఎన్నికల్లో అనూహ్యంగా రెండు స్థానాలనుండి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం ఇక్కడి రాజకీయాల్లో కొత్త మలుపుకు దారి తీసింది. రెండు స్థానాలనుండి తాను పోటీ చేయడం వెనుక ఆయన చెప్పిన కారణాలేమైనప్పటికీ, విపక్షాలు మాత్రం తమ ధాటికి తట్టుకోలేకనే రెండు చోట్ల నిలబడుతున్నాడని ప్రచారం చేసుకుంటున్నాయి. ఏదిఏమైనా ఆయన చుట్టిన శ్రీకారం ఇప్పుడు అన్ని పార్టీలకు రాచుకుంది. కెసిఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌, ‌బిజెపిలు  రెండేసి స్థానాల్లో  తమ అభ్యర్ధులను పోటీకి నిలిపేందుకు సిద్దపడుతున్నాయి,  ఆయా పార్టీల అనుమతికూడా వారికి లభిస్తున్నట్లు తెలుస్తున్నది. కెసిఆర్‌ ‌తన సొంత • నియోజకవర్గమైన గజ్వేల్‌తోపాటు ఇప్పుడు కామారెడ్డి నుండి పోటీ పడుతున్నారు. అధికార పార్టీకి అధినేత అయిన కెసిఆర్‌ను ఎట్టి పరిస్థితిలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఓడించి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్న పై రెండు జాతీయ పార్టీలు ఆయనకు సమఉజ్జీలను నిలబెట్టేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నాయి.

image.png
గజ్వేల్‌లో కెసిఆర్‌ను ఊపిరిసల్పకుండా చేయగల వ్యక్తి ఈటల  రాజేందరేనని బిజెపి గుర్తించి ఆయనకు హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కెసిఆర్‌తో తలపడాల్సిందిగా గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. పార్టీ అలా ఆదేశించిందో లేదో ఆయన యుద్దరంగంలోని సైనికుడిలా గురువారం గజ్వేల్‌లో తన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌లో ముదిరాజ్‌ ‌సామాజిక వర్గానికి చెందిన వోటర్ల  సంఖ్య గణనీయంగా ఉందంటున్న నేపథ్యంలో వారితోపాటు, కుమ్మరి సామాజిక వర్గాలతో మొదటినుండీ సంబంధాలున్న ఈటలకు రాకకు ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్‌కూడా ఎట్టిపరిస్థితిలో కెసిఆర్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉంది. దాంతో ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకులంతా గజ్వేల్‌లో పోటీ చేసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా మరోసారి పార్టీ మారి మాతృసంస్థలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పాత నియోజకవర్గం అయిన మునుగోడును కోరుకుంటున్నారు.
image.png
దానితోపాటు అధిష్టానం అనుమతిస్తే తాను గజ్వేల్‌లో కెసిఆర్‌ను ఓడించి తీరుతానంటున్నాడు.  కెసిఆర్‌ను ఓడించే సత్తా బిజెపికే ఉందన్న ఉద్దేశ్యంగా తాను ఆ పార్టీలోకి వెళ్ళానని, కాని ఇప్పుడు కాంగ్రెస్‌వల్లే అది సాధ్యమవుతుందన్న నమ్మకం కలగటంతో మాతృసంస్థలోకి వచ్చినట్లు చెబుతున్న రాజగోపాల్‌రెడ్డికి మరో సవాల్‌ ‌విసిరాడు. నిజంగా  కెసిఆర్‌ ‌కు సత్తా ఉంటే మునుగోడులో  తనతో పోటీ పడాలని ఆయన సవాల్‌ ‌విసిరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే విధమైన  ఛాలెంజీ చేశారు. కెసిఆర్‌ ‌కామారెడ్డికి వెళ్ళాడుకాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాను సూచించే ఏ మూడు నియోజకవర్గా)నుంచైనా పోటీ చేసి గెలిచి చూపించా లంటున్నాడు. ఒక వేళ కెసిఆర్‌ ‌గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే కెసిఆర్‌కు ధీటైన వ్యక్తిని బరిలోకి దింపాలని యోచిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం సరాసరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డినే రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. దానికి ఆయన కూడా సంసిద్దతను వ్యక్తం చేస్తున్నట్లు  ఇటీవల  ఆయన ప్రకటనలద్వారా అర్థమవుతున్నది. రేపోమాపో దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. ఆ పార్టీ త్వరలో ప్రకటించనున్న రెండవ జాబితాలో దీనిపై స్పష్టత వస్తుందనుకుంటున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి కూడా కెసిఆర్‌ను సవాల్‌ ‌చేస్తున్నాడు. నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే తన నియోజకవర్గమైన కొడంగల్‌లో తనతో పోటీ చేయాల్సిందిగా ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఒక వేళ కెసిఆర్‌ ‌రాని పక్షంలో తానుకాని, తమ సిఎల్సీ నేత భట్టి విక్రమార్కగాని కామారెడ్డిలో కెసిఆర్‌తో పోటీ పడేందుకు సిద్దంగా ఉన్నామని తాజా మీడియా సమావేశంలో ఆయన  బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ‌కోర్‌ ‌కమిటీ దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా కామారెడ్డి రైతులు కెసిఆర్‌పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌వల్ల రైతులు భూమి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా పట్టించుకోకపోవడమే వారి ఆగ్రహానికి కారణమైంది. మాస్టర్‌ప్లాన్‌ ఎత్తివేస్తున్నట్లు గవర్నర్‌తో చెప్పించాకే కామారెడ్డిలో అడుగు పెట్టాలని రైతులు కెసిఆర్‌ను నిలదీస్తున్నారు. కాని పక్షంలో గతంలో నిజామాబాద్‌లో మాదిరిగా వేల సంఖ్యలో నామినేషన్‌ ‌వేయడానికి సిద్దపడుతున్నట్లు వారు ప్రకటించారు.   మరోవైపు లబాన్‌ ‌లంబాడీలు తమను ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని పట్టుపడుతున్నారు. ఎస్టీ జాబితానుండి తొలగించడంతో ఎంతో కాలంగా  పోడు వ్యవసాయం చేసుకుంటున్న తాము తమ భూములను కోల్పోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు సరైన హామీ ఇవ్వని పక్షంలో  గతంలో నిజామాబాద్‌ ‌పసుపు రైతుల్లాగా అధిక సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు లబాన్‌ ‌లంబాడీల నేత తాన్‌సింగ్‌ ‌హెచ్చరిస్తున్నారు. కాగా, వారికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, వారి పక్షాన తమ పార్టీ నిలబడుతుందని ప్రజాశాంతి పార్టీ అధినాయకుడు కెఏ పాల్‌ ‌కూడా హెచ్చరిస్తున్నారు. అయితే రైతులు  వెయ్యి మంది నామినేషన్‌ ‌వేసినంత మాత్రాన జరిగేదేమీలేదని, అందుకు రైతులంతా కలిసి ఒకే వ్యక్తిని కెసిఆర్‌కు వ్యతిరేకంగా నిలబెట్టాలని సూచించాడు. అప్పుడు రైతుల పక్షాన  ప్రచార కార్యక్రమాన్ని తాను భుజాన వేసుకుంటానంటున్నాడు కెఏ పాల్‌. ‌కాని పక్షంలో తమ  పార్టీ అభ్యర్థిని  గెలిపిస్తే  కామారెడ్డిలో హైదరాబాద్‌లోని అపోలా హాస్పిటల్‌ ‌కు  ధీటైన హాస్పిటల్‌  ‌ని కట్టిస్తానని, ప్రతీ మండలానికి ఒక అంబులెన్స్‌తోపాటు, ఎమర్జన్సీగా రోగులను తరలించేందుకు ఒక హెలికాఫ్టర్‌ను కూడా అందుబాటులో ఉంచుతానని రైతులకు హామీ ఇస్తున్నాడు.
ఇదిలాఉంటే  బిఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న హరీష్‌రావును కూడా విపక్షాలు టార్గెట్‌ ‌చేస్తున్నాయి. ఆయనకు సరైన పోటీదారుకోసం కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. అయితే అధిష్టానం అనుమతిస్తే తాను పోటీకి దిగుతానంటున్నాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అలాగే కెటిఆర్‌పైన ఇప్పటికే బిజెపి రాణి రుద్రమను నిలబెట్టగా కాంగ్రెస్‌నుండి ఇంకా అభ్యర్థి ఖరారు కావాల్సిఉంది. అయితే మాజీ పిసీసీ అధ్యక్షుడు, ఎంపి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయితే ఆయనకు ధీటైన పోటీ ఇవ్వగలడని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ముగ్గురిపైన పోటీకి నిలబడేందుకు సిద్దమైన వారంతా తమ సొంత నియోజకవర్గాలతోపాటు అదనంగా  వీరిపై పోటీకి సిద్దమవుతున్నవారే. వీరంతా కెసిఆర్‌ ‌రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడాన్ని  విమర్శిస్తున్నవారే కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *