కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం చేసి, మనసు లేని  మరమనుషుల ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఆధునికం  ఆటవికంగా,అనాగరికంలా నగ్న సంస్కృతికి స్వర్గధామంలా మారింది.కుట్రలు,కుయుక్తులతో  సాగుతున్న మానవ జీవన ప్రస్థానంలో మనిషిని మనిషే చంపుకునే విష సంస్కృతికి బీజం పడిరది. అరాచకాలకు హద్దులేకుండా పోతున్నది.  కాఠిన్యభావాలు కారుణ్య దహనానికి నిచ్చెనలు వేస్తున్నాయి.చిరుమొగ్గలను సైతం చిదిమేసే మృగత్వం మనిషిలో వికృత రూపం ధరించింది.

నరరూప మృగాల కామాగ్నిలో దహనమయ్యే  అతివల ఆర్తనాదాలు శూన్యాకాశంలో నిశ్శబ్ధ తరంగాలై అదృశ్యమౌతున్నాయి. మనిషికి మనిషే శతృవుగా పరిణమించిన  దుస్థితి దాపురించిన నేపధ్యంలో మానవ సంబంధాల పునరుద్ధరణకై నడుంబిగించవలసిన తరుణం తరుముకొస్తున్నది. దుర్గుణాలతో  అంతరించబోతున్న  మానవ సమాజంలో అడపాదడపా  అంకురించే సద్గుణాలు కూడా అణగ ద్రొక్క బడుతున్నాయి. దైవంపై మమకారం పెరిగినా, మానవ నైజం మాత్రం వికృతంగానే తయారౌతున్నది. దుష్ట ప్రవృత్తి  వేయితలల రూపం ధరిస్తున్నది. మంచి చెడుల విచక్షణ నశించింది.

మానవత్వం అల్లంత దూరంలో నిలబడి, సాగర కెరటం లా హఠాత్తుగా మన పాదాలను తాకి ముద్దాడితే,ముద్దాడిన కెరటాన్ని  వద్దని వదిలేసి, రాకాసి కెరటాన్ని రారమ్మని స్వాగతించి  మృత్యు సుడిగుండంలోకి ఇరుక్కుపోయి మింగేసే మృత్యువు నీడలో సేదతీరాలను కోవడం మన పొరపాటు- గ్రహపాటు. సకల అవలక్షణాలతో, అష్ట వంకరలతో నైతిక పతనం వైపు పరుగులు పెడుతున్న మానవ జాతికి పట్టిన గ్రహణం వీడేదెన్నడు? మనిషి మనిషిగా జీవించే అలనాటి  రోజులు ఇలలో పునరావృతం  కాగలవా? చీకటి కమ్మిన జీవితాలు ఆకలి కోసం అలమటిస్తుంటే, వారి కంట రాలుతున్న అశ్రుధారలను స్పృశించని వైనం ఆర్ధిక అంతరాల  మధ్య నలిగిపోతూ భారంగా బ్రతుకు బండిని లాగిస్తున్న సగటు జీవుల గమ్యం తెలియని  పయనానికి దర్పణం.

గగన సీమను తాకే ఆశల స్వప్నాలను గాంచి, ఆనందంతో ఉరకలేసి, స్వప్నం శిథిలమైన మరుక్షణం  వాస్తవం కళ్ళెదుట కనిపిస్తుంటే, ఆశలు వికటించి, వెక్కిరిస్తుంటే  నిస్సహాయత ఆవహించి నీరుగారి  నిలువ నీడ లేక అలమటించే అసహాయుల ఆర్తనాదాలు గొంతు దాటకుండా, కన్నీళ్ళకు అర్పితమై కలవరపాటుకు గురి చేస్తుంటే, కలిమి బలిమితో  సామాన్య జీవుల బ్రతుకు వెతలను అహం నిండిన కళ్ళన్నీ హేళనతో  వెక్కిరిస్తుంటే, డొక్క నిండని జీవితాలు వెలుతురులో సైతం చీకటిని చవిచూస్తున్నాయి. విలాసాల కులాసాల్లో మైమరచి, చిందేస్తున్న   స్వార్ధమనే  మైకం సోకిన కళ్ళన్నీ కటిక చీకటిలో సైతం వెలుతురును ఆస్వాదిస్తుంటే,ఆర్ధిక అంతరాలు మంచి చెడులను మార్చేస్తుంటే వ్యక్తి కలిమికే గాని వ్యక్తిత్వ బలిమికి విలువివ్వని లోకంలో మానసిక అంధత్వం అలముకుంది.

ఇలాంటి పరిస్థితులు మారాలి.మార్చగలగాలి. ఇది కేవలం వ్యక్తుల వలన సాధ్యం కాదు. వ్యక్తిత్వమున్న వ్యక్తుల సమూహంతో, అంతర్జాతీయ సంస్థలతో, వివిధ దేశాల సమిష్ఠతత్వంతో సాధ్య పడుతుంది.  ప్రతీ దేశం అభివృద్ధి వెంట పరుగులు తీయడం, ఆర్దికంగా బలోపేతం కావడం హర్షదాయకం. అయితే అభివృద్దికి నిజమైన నిర్వచనం ఏమిటి?  ఏ కొద్ది వ్యక్తులో బిలియనీర్లుగా, ట్రిలియనీర్లుగా అవతరించడాన్ని అభివృద్ధిగా భావించే ధోరణి విడనాడాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆకలి,దరిద్రం,నిరుద్యోగం వంటి సమస్యలు తొలగాలి. ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి. అదే నిజమైన అభివృద్ధి. మానవ సంబంధాలు విలువలతో వికసించాలి. అవినీతి, స్వార్ధం లేని సమాజం ఆవిర్భవించాలి. యువత నిర్మాణాత్మక  పాత్ర పోషించి ప్రగతి రథ చక్రాలను ముందుకు నడిపించాలి.

సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు)
9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *