మన ఊరు – మన బడి సాధ్యమేనా…
ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి ‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టు,’’న్నది.ప్లానింగ్,శాఖ,ఆర్ధిక శాఖ అనుమతులు,అసలు నిధుల అవసరమే లేని డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఏడేళ్ళుగా చేస్తున్న ఉద్యమాలను ఒక వైపు పెడచెవిన పెడుతూ,మరొక వైపు వేలకోట్ల నిధులతో బడుల అభివృద్ధి పేరిట మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.సర్కార్ ప్రకటించే ప్రతి పనిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో,ఉద్యోగులకు జీతాలే సరైనసమయంలో ఇవ్వలేని సర్కార్ ఈ పథకం ప్రకటించటం గమనార్హం.ఈ పథకంలో ఇప్పటికే నిర్వహించిన టెండర్ల తంతు భారీ అవినీతికి తెర లేపిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే ఎన్నికల ముందస్తు జాగ్రత్తలతో అభివృద్ది పనుల బడ్జెట్ కేటాయింపు నిధులు ఓట్లురాల్చే’’సంక్షేమ’’పథకాలకు మళ్ళిస్తున్నదని ప్రతిపక్షాలు,ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్నాయి.పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పథకాల ఫలితంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు కుదేలయి విద్యాశాఖ పాలన గందరగోళం లోకి దిగజారింది.కోట్లాది రూపాయల నిధులతో పాఠశాలల మౌలిక సదుపాయాల సంగతేమోగానీ ముప్పయి లక్షల మంది పేద విద్యార్థులు చదివే ఇరవై అరువేల డెబ్బయి రెండు పాఠశాలల్లో కనీస నిర్వహణకు సంబంధించిన నిధులు కూడా విడుదల కాకపోవటంతో రోజువారి బడి నిర్వహణ ఇబ్బందులు పడుతున్నది.
ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాల విద్యాశాఖకు అభివృద్ధి పనులను తాయిలంగా చూపిఅట్టహాసంగా ప్రకటించిన’’మన ఊరు- మన బడి’’ నిధులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పనుల పూర్తి పై అపనమ్మకం కల్గిస్తుంది. ఈ పథకం ఆమలు కోసం వేరే శాఖల అభివృద్ది పనుల లోంచి మళ్ళిస్తున్న అత్తెసరు నిధులతో ఇపుడిపుడే శంఖుస్థాపన పనుల తంతు మొదలయింది.ఇప్పటికే తలెత్తిన అవినీతి ఆరోపణల నిగ్గు తేలితే ఆ టెండర్లు రద్దయ్యే అవకాశం లేకపోలేదు.గత ఆర్ధిక సంవత్సరం నుండి బడ్జెట్ ప్రతిపాదిత నిధులను భారీయెత్తున ఓటుబ్యాంకు పనులకు మళ్ళించటం మూలంగా ఉద్యోగుల జీతాలకు సైతం అప్పులుచేసే దుస్థితికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దిగజారింది. పాఠశాలవిద్యకు ఈ యేడు కేటాయించిన నిధులు వార్షిక బడ్జెట్లో 6.26 శాతం లోంచి ఎంతశాతం వాస్తవ వినియోగం చేశారనేది అనుమానమే! పాఠశాల మెయింటేనెన్స్ కోసం విడుదల చేసిన నిధుల వినియోగానికి మార్గదర్శకాలు వెలువడని నేపధ్యంలో ఖర్చు కాని ఆ నిధులను మార్చిలో వెనక్కి మళ్ళించుకున్న విషయం అందరికీ విదితమే!పాఠశాల విద్య మీద ప్రభుత్వం ప్రకటించిన ‘‘కేజి టు పీజి’’ సమాధుల పై మొలిచిన పూల మొక్క లాంటి ‘‘మన ఊరు – మన బడి’’ పథకం టెండర్ల గందరగోళం,నిధుల లేమితో అమలు పై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆచరణ లో వా•స్తవంగా ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్దే వుందని భావిస్తే రాష్ట్రంలోని పాఠశాల విద్య మ రింత పురోగతి సాధించడానికి చేపట్టిన కార్యక్రమం మన ఊరు మనబడి /మన,బస్తీ మన బడి పథకం ఆహ్వానించతగినదే!. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి అభ్యసనను ప్రభావితం చేసే మౌలిక సదుపాయాలనే అంశాలు ముఖ్యమైనవే!.పాఠశాల వాతావరణం అందుబాటులో ఉన్న వనరులు వసతులు ఆకర్షణీయమైన పాఠశాల భవనాలు, తరగతి గదులు విద్యార్థులను బడి వైపు కదిలిస్తాయి,చదువు పై ఆసక్తిని కలిగిస్తాయి.చదువులో మెరుగైన ప్రమాణాలను సాధించేందుకుకు ఉపాధ్యాయుల బోధనతో పాటు మౌలిక సదుపాయాల ప్రకల్పన కూడా దోహదపడుతుందనేది అంగీకరించాల్సిందే!. విద్యార్థుల అవసరాలను తీర్చినప్పుడు పాఠశాలవిద్యా వ్యవస్థ మరింత బలోపేతమయి దేశానికి వెన్నెముకగా నిలుస్తుంది.కాబట్టి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మూడుదశలలో చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఈ కార్యక్రమా అమలుకు మూడు సంవత్సరాలకు గానూ రూ. 7229.54 కోట్లు నిధులు కేటాయించింది.
దీనిలో మొదటి విడతలో భాగంగా 2021- 22 సంవత్సరంలో ప్రతి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నతఉన్నత పాఠశాల నుండి అధిక నమోదు కలిగిన 9123 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు రూ. 3242.33 కోట్లు ఖర్చుతో బడుల అభివృద్ధి పనులు
చేపట్టడం జరిగిందని ప్రభుత్వం మన ఊరు మన బడి ప్రణాళికలో మొదట పేర్కొన్న ది.కానీ,ఈ పనులకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా భౌతిక వనరులు పెంపుదల పాఠశాలలో అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఎస్టిమేషన్ కు అనుగుణంగా నిధుల కేటాయింపు చేసిన సందర్భాలు రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. జిల్లాకు కేవలం రెండు కోట్లు మాత్రమే కేటాయించి ఈ నిధులను కలెక్టర్ ఆధ్వ్యర్యం లో ఉంచారు. అన్నీ అనుమతులు వస్తే దీనిలో నుంచి పాఠశాలలకు 15 శాతం నిధులుమాత్రమే మంజూరు చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న గదులను కూల్చలేదు.నిర్మాణాలకు శంకుస్థాపన అంతగా చేసింది లేదు. కేవలం మన ఊరు మన బడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం అర్బాటం కోసమే ప్రవేశపెట్టింనడంలో సందేహములేదు. నాలుగైదు దశాబ్దాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ బడుల బాగు కోసంఆలోచన చేయడాన్ని ఆహ్వానించదగిందే.కానీ ఇందుకు చిత్తశుద్ధి లోపించటం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విద్య పట్ల ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయి.
ఈ పథకానికి కావలసిన నిధులను రాష్ట్ర బడ్జెట్ నుండి నేరుగా కేటాయించకుండా ఇతర శాఖల నుండి నిధుల మళ్లింపు చేసే కార్యక్రమం చేపట్టడం అంటేనే మన ఊరు మన బడి పథకాన్ని నీరుగార్చినట్లే అవుతుంది. ఇతర శాఖల నుండి నిధుల కేటాయింపు అంటే ఆయా శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులు నిలిచిపోయినట్లు గానే భావించాలి. ప్రభుత్వం ఒక శాఖలో జరిగే అభివృద్ధిని నిలుపుదల చేసిమరొక శాఖను అభివృద్ధి చేయాలని అనుకోవడం పూర్తిగా ప్రచారం కోసం మాత్రమే తప్ప మరొకటి కాదు. ఇది ప్రజలను వంచించే నయా వి
ధానంగానే భావించాలి.రాష్ట్రంలోని మొత్తం 26072 పాఠశాలల్లో 18233 ప్రాథమిక పాఠశాలలు,3151 ప్రాథమికోన్నత పాఠశాలలు,4688 ఉన్నత పాఠశాలలున్నాయి. మొదటి దశలో 36శాతం పాఠశాలలు అనగా 5399 ప్రాథమిక,994 ప్రాథమికోన్నత,2736 ఉన్నత పాఠశాలలో మొత్తం 9123పాఠశాలను ఎంపిక చేశారు.వీటిలో గ్రామీణ ప్రాంతం లోని పాఠశాలలు 7476, పట్టణ ప్రాంతం లోని పాఠశాలలు 1647..30 లక్షలకు పైబడి ఎస్టిమేషన్ ఉన్న పాఠశాలలు 1640,30 లక్షలకు లోపు అంచనా ఉన్న పాఠశాలలు 7182.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో 12 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, త్రాగునీరు, ఫర్నిచర్, పేయింటింగ్, మైనర్ మరమ్మత్తులు, గ్రీన్ బోర్డులు ప్రహరీ గోడ,వంటగది, శిథిల భవనాలు స్థానంలో నూతన గదులు, భోజనశాల,డిజిటల్ సౌకర్యాలు..ఈ పన్నెండు ఎంచుకొని ఆయా పాఠశాలను అభివృద్ధి చేయాలనే నిర్ణయించారు.
ప్రస్తుతం మండలానికి రెండు పాఠశాలలను మోడల్ గా ఎంపిక చేసి,వాటిలో సత్వరమే పనులు చేపట్టాలనేఅధికారుల ఆలోచన అడుగు దాటలేదు,ఇప్పటికీ ఒక్క పాఠశాలలో కూడా పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో తరగతి గదుల నిర్మాణపనులు నిధుల లేమితో గత నాలుగేళ్ళనుండి అసంపూర్తి దశలో వున్నాయి.సివిల్ పనులు చేపట్టిన స్థానిక గుత్తేదారులకు లక్షల రూపాయల బిల్లుల చెల్లింపులు నిలిచి పోయాయి.మైనర్ మరమ్మత్తుల కింద రెండేళ్ళ క్రితం చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపులు కాకముందే పాఠశాల ఎకౌంట్ల నుండి సివిల్ పనుల కోసం జమచేసిన నిధులనం ప్రభుత్వం వెనుకకుతీసుకుంది. పాఠశాలల అభివృద్ధి కి ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు-మన బడి కార్యక్రమం పనుల టెండర్ ప్రక్రియలదశ లోనే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూంది. ప్రభుత్వ కనుసన్నలలో నడిచే బడాకంపెనీలకే ఈ కార్యక్రమం పనులను అప్పగించారని తెలుస్తూంది. ఈ పథకంలో పనులపై అనుభవం లేని అర్హత లేని అస్మదీయ బడా కంపెనీలు అన్ని పనులు దక్కించుకోవటం వెనుకఅవినీతి వుందని, అంఛనా సొమ్మును రెండింతలు చేయటం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనేప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని తెలుస్తున్నది.
మండల,జిల్లాపరిషత్,ప్రభుత్వ పాఠశాలల్లో రోజు వారి పరిశుభ్రత కోసం వెయ్యి,రెండున్నర వేల రూపాయ నెలసరి చెల్లింపులతో ఏర్పరిచిన తాత్కాలిక స్కావెంజర్లను గత మూడేళ్ళుగా తిరిగి నియమించటం లేదు. మునిసిపాలిటీ,గ్రామపంచాయతీ పారిశుద్ద కార్మికులకు ఆబాధ్యతలు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.స్కావెంజర్ల నియమానికి నిధులు వెచ్చించని ప్రభుత్వం కోట్ల రూపాయలతో బడుల అభివృద్ధి పనులు చేసేందుకు ఈ పథకం ప్రకటించటం హాస్యాస్పదంగానే భావించాలి.ఆ నిధుల మంజూరు ఎవరి ప్రయోజనాలకో అనే అనుమానాలు కలుగక మానవు.విద్యా సంవత్సరం ప్రారంభమై రెండువారాలు గడిచినా మొదటి దశ పనుల కనీసం ప్రారంభానికి సంబంధించి ఆనవాళ్లు లేవు. నిధులమంజూరీ దాఖలు లేదు.ఒక వేళ ప్రారంభిస్తే మొదటి దశ పనులు ఎప్పటికి పూర్తిచేస్తారనేది స్పష్టత లేదు. రెండవదశ పనుల ప్రారంభం ఎప్పుడు మొదల వుతుందో తెలియదు.ఈ నేపధ్యంలో మూడవదశ ఉంటుందనేది అనుమానమేనని భావించాల్సిందే! ప్రయివేట్ బడుల ఫీజుల దోపిడిని భరించలేక పేద కుటుంబాలే కాకుండా దిగువ,ఎగువ మధ్య తరగతి,ఉద్యోగుల కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా సర్కార్ బడులల్లో చేరుతున్నారు. ఈ తరుణంలో మౌలిక సదుపాయాలు చేకూర్చటం అవశ్యమే! విద్యార్థుల నమోదుకు సరిపడే ఉపాధ్యాయుల నియామకాలు లేనట్లయితేభవిష్యత్కాలంలో ప్రభుత్వ బడులో నమోదు శాశ్వతంగా తగ్గి పోయే అవకాశాలుంటాయి.ఇకనైనా నిరుపేదలబడుల అస్థిత్వం కాపాడుకునే క్రమంలో ప్రభుత్వం నిజాయితీ తో వ్యవహరించి ప్రభుత్వ విద్యాభివృద్ధికి తోడ్పడాలి.
– మైస శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి,TPTF




