కూటమి కట్టకనే ఓడాయా..?

 ఒంటరిగా బరిలో నిలువడమే బిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ పార్టీలకు శాపమైందా..
 దెబ్బ మీద దెబ్బతో కోలుకోలేని స్థితిలో బిఆర్‌ఎస్‌
పార్టీని నిలబెట్టుకోవడంపై మల్లగుల్లాలు

(మండువ రవీందర్‌రావు)
కూటమి కట్టకుండా అత్మవిశ్వాసంతో ఒంటరిగా బరిలో నిలవడం ఆ పార్టీలకు శాపమైందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్డీయే కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరకుండా తాము చేసిన పనులే తమను గెలిపిస్తాయన్న ధృడ విశ్వాసమే వారిని అధికారానికి దూరం చేసిందంటున్నారు. రానున్నదంతా ప్రాంతీయ పార్టీల  హవానే అని చెబుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌,  వైఎస్‌ఆర్‌సిపీ పార్టీలు ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించిన  మొదట్లో బిజెపితో ఉన్న సఖ్యతను అలానే కొనసాగిస్తే పరిస్థితి మరో రకంగా ఉండేదన్న వాదన వినిపిస్తున్నది. జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న రెండు జాతీయ పార్టీల మధ్య బిఆర్‌ఎస్‌ పార్టీ నలిగిపోయింది. ఫలితంగా అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బిఆర్‌ఎస్‌, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోక పోవడం అటుంచి, కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోకపోవడం దారుణం. అదే సమయంలో అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి తమ స్థానాలను పెంచుకున్నాయి. ఇరవై నాలుగేళ్ళుగా ప్రజల మధ్యనే నానిన పార్టీకి ఇవ్వాళ మనుగడే కష్టమైపోయింది. దేశ రాజకీయాల్లో సమగ్ర మార్పును తీసుకొస్తామన్న పార్టీకి స్థానికంగానే అధికారం లేకుండా పోయింది.

బిఆర్‌ఎస్‌కు పదిసీట్లు ఇవ్వండి కేంద్రంలో చక్రం తిప్పుతామని కాలుకు బలపం కట్టుకుని కెసిఆర్‌ ఎన్నికల ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి 17 లోకసభ స్థానాల్లో ఒక్కటి కూడా రాకపోవడంపైన నిజంగా ఆ పార్టీ విశ్లేషించుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో పక్కనున్న తెలుగు రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఎన్డీయేతో పొత్తుపెట్టుకోవడం ద్వారానే పడిలేచింది. కేంద్రంలో ఎలానైతే చక్రం తిప్పే అవకాశం తనకు వొస్తుందని బిఆర్‌ఎస్‌ భావించిందో అలాంటి అవకాశమే ఏపిలో టిడిపికి వొచ్చింది. ఇవ్వాళ కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ మరోసారి అధికారంలోకి రావడానికి ఏపిలోని టిడీపీ, బీహార్‌లోని జేడీయూ కారణాలైనాయి. ఆయా పార్టీలు తమ ఎంపీలకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంతో పాటు, తమ రాష్ట్రాలకు కావాల్సిన నిధులైతేనేమీ, పథకాలైతేనేమీ సునాయాసంగా తెప్పించుకునే కీ రోల్‌ను పోషిస్తున్నాయి. ఇలాంటి అవకాశం కోసం దాదాపు రెండేళ్ళుగా ప్రజలకు చెబుతూ వొచ్చిన బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఆ అవకాశం లేకుండాపోయింది. దానికి తోడు దెబ్బమీద దెబ్బగా గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌పైన ఆనేక ఆరోపణలు, విచారణలు కొనసాగుతుండడం ఆ పార్టీని కోలుకోకుండా చేస్తున్నాయి. దిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే కెసిఆర్‌ కూతరు జైలు జీవితాన్ని అనుభవిస్తుండగా, , తాజాగా విద్యుత్‌ కొనుగోలు విషయంలో కెసిఆర్‌కే నోటీసులు జారీ కావడంతో  ఇక బిఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదన్న భావన క్యాడర్‌లో  కలుగుతున్నది. మరికొద్ది కాలంలోనే పంచాయితీరాజ్‌,  మున్సిపల్‌ ఎన్నికలు కూడా రానున్నాయి.  దీంతో తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నాయకులు తమకు నచ్చిన దారి వెతుక్కుంటున్నారు. వీరంతా కాంగ్రెస్‌ లేదా బిజెపిలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు.

 

అసెంబ్లీ ఎన్నికల నుండే కాంగ్రెస్‌, బిజెపి నాయకులు అంటున్నట్లు ఇక బిజెపిలో ఎవరూ మిగలరన్నట్లుగానే ఇప్పటికే కొందరు ముఖ్యనాయకులు పార్టీకి గుడ్‌ బై చెప్పగా మరికొందరు వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్త్త్తలు వొస్తున్నాయి. తాజాగా 20 మంది ఎంఎల్‌ఏలు కలిసి కట్టుగా పార్టీ మారుతారన్న వార్తలు వొస్తున్నాయి. అందుకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా వారు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితిలో తమ ఎంఎల్యేలను కాపాడుకోవడం ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు బిఆర్‌ఎస్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. దీంతో ఆ పార్టీ అంతర్మథనం చేపట్టినట్లు తెలుస్తున్నది. పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు మొదలైనట్లు వినికిడి. ప్రధానంగా భవిష్యత్‌ కార్యాచరణపైన మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది.

 

ముఖ్యంగా గులాబీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని    నింపడం, వారిలో పార్టీ పునర్జీవనం పట్ల విశ్వాసం కలిగించడమన్నది ప్రధానాంశంగా ఆపార్టీ కార్యాచరణను చేపట్టే వ్యూహరచన చేస్తున్నది. పార్టీ ఆవిర్భావం నుండి ఇలాంటి ఒడిదొడుకులు అనేకం చూశామని, గెలుపుతో పొంగిపోవడం, ఓటమితో కుంగి పోకూడదని ఈ సందర్భంగా తమ క్యాడర్‌కు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ హితబోధ చేస్తున్నప్పటికీ 39 మంది ఎంఎల్‌ఏల్లో ఎంతమంది ఈ అయిదేళ్ళు పార్టీని పట్టుకుని ఉంటారన్నది ఆ పార్టీకే క్లారిటీ లేదు. పదవులు అశించకుండా వీరంతా ప్రతిపక్ష పాత్రను పోషిస్తారా అన్నది అనుమానమే. ప్రజలు తమను ఓడిరచారనుకునే కన్నా తమ నుంచి జరిగిన పొరపాట్లను సవరించుకోగలిగితే పార్టీ మరికొన్నాళ్ళు మనగలుగుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కాగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీకి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నది. బిఆర్‌ఎస్‌కు కష్టకాలం వొచ్చినప్పుడల్లా వరంగల్‌లో సభపెట్టి  బలప్రదర్శన చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వొస్తున్నది. అలాగే ప్లీనరీని ఈసారి వరంగల్‌లోనా లేక కరీంనగర్‌లోనా అన్న మీమాంసలో పార్టీ నాయకులున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *