‘‘సాధారణంగా ఒక దారుణమైన స్థితిలో మరణించిన వ్యక్తి పట్లా మనం చూసే దృష్టి ఆ మరణించిన వ్యక్తి స్థాయి, ఆ చర్యకు పాలు పడ్డ మనుషుల పట్ల మనకుండే హ్రస్వ దృష్టి లోపం వల్ల సహజంగానే నిందితుల పట్లా కోపం మరియు ఆ చనిపోయిన వ్యక్తి పట్లా అపారమైన సానుభూతి వ్యక్త పరుస్తారు. ఈ సానుభూతి వల్ల వారు జీవించినపుడు చేసిన దుశ్చర్యలన్ని మరణం మాటున కీర్తి శేషం గా మిగులుతాయి. అట్లా చూడటం వల్లనే అతను గతం లో చేసిన అమానవీయ చర్యలన్నీ మాయమై అతని ఖాతాలో కీర్తి చేర్చ బడితే, సంవత్సరాల తరబడి వేధింపులను భరిస్తూ వస్తున్న ఒక సామాజిక వర్గం మొత్తం నేడు వెలి కి గురి కాబడుతున్నది. ఇద్దరి అనుకోని చర్యల వల్ల జరిగిన దానికి మొత్తం గూడెం గూడెం దోషిగా చూడబడుతున్నది. ఇవన్నీ చెప్పడం చనిపోయిన అధికారిని చెడుగా చూపడానికి కాదు కానీ ఆవేశాలతో, ఒక వర్గం పై ఒక చర్యను సాకుగా చూపి మనలోని ద్వేషాన్ని వెళ్లగక్కి వాళ్ళ అస్తిత్వాన్ని చెరిపే ప్రయత్నం చేయకూడదని మాత్రమే.’’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చద్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయితీ పరిధిలోని ఎర్రబోడు గొత్తికోయ గూడెంలో ఇటీవల నవంబర్ 22న జరిగిన ఘర్షణలో అటవీ అధికారి మరణించడం విచారకరం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ ఎట్లా జరిగిన వాటిని ఖండించాల్సిందే. అయితే ఈ ఖండనల మాటున మనలోని ద్వేషాన్ని వెళ్లగక్కడమే ఇక్కడ అసలు సమస్య. చాలా సార్లు మనలోని ద్వేషాన్ని వెళ్లగక్కడానికి అనువైన సందర్భం దొరికితే అది మరింతగా బయటపడుతుంది. అది మైనారిటీ వర్గంపై, లేదా అణగారిన వర్గాలపై అయితే మరింతగా ఈ సమాజం చాలా సులభంగా ఆ అక్కసంత కక్కుతుంది. వాళ్ళు అడవిని నరికి వ్యాపారం చెయ్యడం లేదు. వాళ్ళ అక్రమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని పథకం ప్రకారం దాడులు చేసిన స్మగ్లర్లు కూడా కాదు. అయినా ఇప్పుడు ఎర్రబొడు ఆదివాసీ సమాజం మొత్తం అటు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు శత్రువుగా, బయట ప్రజానీకానికి, నిజాలు మాట్లాడాల్సి, రాయాల్సిన వార్తా సాధనాలకు కూడా దోషిగా కనపడుతుంది. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అని మానవ హక్కుల వేదిక ఇద్దరు సభ్యుల (బధవత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి, వి.దిలీప్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి) బృందం వెళ్లి ఆ ప్రజలను విచారించింది. కొన్ని వాస్తవాలు చెప్పుకునే ముందు ఎర్రబొడు ప్రజల ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం… 2002 లోనే ఎర్రబొడు ప్రజలు బెండాలపాడు గ్రామ పరిసరాలలో నాగ భూషణం అనే రైతు పట్టా భూమిలో 15పాకలు వేసుకొని పరిసర ప్రాంతాలలో కూలీ పనులకు వెళ్ళేవారు. ఆ తర్వాత సంవత్సరానికి ఇప్పుడు ఉంటున్న ప్రాంతం ఎర్రబోడు లో 20ఏకరాలు పోడు కొట్టి అది కూడా దట్టమైన అడవి ఏం కాదు. ఇప్పుడు మనం పోయి చూస్తే తెలుస్తది. వాళ్ళు నివాసాలు వేసుకున్న ప్రాంతం ఎటువంటిది మరియు ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు నివసిస్తున్నది అనడానికి ప్రస్తుతమున్న ఆ నేలే సాక్షం. అట్లా ఆ పోడు కొట్టినందుకు 2004లోనే మేం పది రోజులు జైలు కి పోయి వచ్చినం సార్ అని ఆ గ్రామ పెద్ద రవ్వ రమేష్ చెప్పుకొచ్చారు. మన అధికారులు ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఆ నేల అయితే అబద్ధాలు చెప్పదని నేల సాక్షం అనడం. అట్లా వారి వారి పిల్లలు ఏర్పడి ఇప్పుడు మొత్తం 45కుటుంబాలుగా ఏర్పడినవి.
ఇట్లా చూసుకున్న ఎర్రబోడు ప్రజలు 2005 సంవత్సరం కంటే ముందుగానే ఇక్కడ నివసిస్తున్నట్టు లెక్క. వాళ్ళు మేం పోడు కొట్టలేదు అనడం లేదు. పోడు కొట్టినం సార్ కానీ ఎప్పుడైతే సార్లు వద్దన్నరో అప్పటి నుండి పోడు కొడ్తలేం సార్ అని చెప్పుకొచ్చారు. ఇక పోతే మన పత్రికలు రాసినట్టు వాళ్ళు వేల వేల ఏకరాలు పోడు చెయ్యట్లే. వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం చేసిన పోడు కూడా 200ఏకారాలు సుమారుగా. ఇందులో హరిత హారం పేరు మీద మూడు దఫాలుగా ప్రభుత్వం వంద ఎకరాలూ పై చీలుకు భూమిని తీసేసుకున్నది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పోడు భూమి కేవలం 90నుండి 100 ఎకరాలు మాత్రమే. ఇందులో వాళ్ళు మనకు లాగా డబ్బులు సంపాదించాలని, లేదా ఆస్తులు కూడబెట్టుకొడానికి వ్యవసాయం చెయ్యరు. వారి పొట్టకు నింపుకొడానికి అవసరమైన పప్పుదినుసులు, కొంచం వరి,రాగులు,సజ్జలు, కొర్రలు,మొక్క జొన్న, నువ్వులు, ఇట్లా చిరు ధాన్యాలు సాగుచేసుకుంట అడవిలో దొరికే పండ్లు,కాయలు తింటూ జీవిస్తున్నారు. నిజానికి ఆదివాసుల జీవన శైలి అత్యంత కనిష్ట జీవన విధానం. ‘‘సార్ మాకు ఈ పత్తి పండించడం కూడా తెలీదు సార్..ఈడకు వచ్చినాకే నేర్చుకున్నాం. అది కూడా కొంచం డబ్బులు వస్తాయ’’ని. రవ్వ రమేష్ అన్నాడు. నిజానికి ఆదివాసుల వ్యవసాయం వల్ల ఒక్క పోడు సమస్య తప్పించి ఇంకా ఈ ప్రకృతికి, నేలకు సంబంధించి మనం చేసే హానిలో 0.001 శాతం కూడా ఉండదు. వాళ్ళు అడవులను నాశనం చేస్తున్నారు అని మాట్లాడే మనకు ఆ అర్హతనే లేదు. మన అభివృద్ధి పేరు మీదా ఎన్ని కొండలు మన కాళ్ళ కిందా కరిగిపోవట్లేదు. ప్రాజెక్ట్ ల పేర ఎన్ని వేల ఏకరాలలో అడవి అంతం కావడం లేదు. రోడ్లు విస్తరణ పేరు మీద ఎన్ని వేల చెట్లు నేల రాలడం లేదు. ఈ లెక్కతో పోల్చితే ఆదివాసులు కొట్టిన పోడు ఏపాటిదో లెక్కగడితే ముందుగా కేసులు పెట్టాల్సింది ప్రభుత్వం మీదా, అనుభవిస్తున్న మనందరి మీద.
ఇకా పత్రికలలో వచ్చిన వార్తలు చూసి మీరు అడవిలో గంజాయి, ఇప్ప సారా కాస్తున్నరట కదా? అని అడిగినపుడు వారంతా… ‘‘సార్..ఇప్పటి వరకు మాకు గంజాయి ఇత్తనమే తెలియదు, ఈ అడవిలో ఇప్ప చెట్టే లేదు. అట్లంటప్పుడు మేం ఇప్ప సారా ఎట్లా కాస్తం సార్’’ అన్న ఆదివాసీ ప్రశ్న కు సమాధానం ఇవ్వగలరా? మేం సాగు చేసిన భూములు గుంజుకుందాం అని మమ్మల్ని వెళ్లగొట్టడానికి ఇట్లా గంజాయి పండిస్తున్నమని, సారా కాస్తున్నమని వంకర మాటలు మాట్లాడుతున్నరు అని మూకుమ్మడిగా ఒకింత కోపంగానే అన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడి ఆదివాసులకు 15 మందికి ఆహార భద్రత కార్డులు ఉంటవి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటది. పోడు భూములకు పట్టాలు ఇస్తం అని ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో దానిలో భాగంగా ఇక్కడి తొమ్మిది మంది రైతుల భూముల సర్వేలు కూడా చేస్తది. మిగతా వాళ్ళు తమ భూములు కూడా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా వీళ్ళు అటవీ ఆక్రమణదారులు అని అటవీ అధికారులు అంటారు.అంటే ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపునే అటవీ అధికారులు ఒప్పుకోవడం లేదన్నమాట. అందుకు నిదర్శనమే ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల సంఘమొకటి పోడు భూముల పట్టాల వల్ల అడవి అన్యాక్రాంతం ఐపోతది. ఈ సర్వే నీ మేం వ్యతిరేకిస్తున్నామని కూడా పత్రిక ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వ పాలసీకి సంబంధించిన విషయాన్ని దిక్కరించిన వారి పట్లా ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంది. లేక ప్రభుత్వమే కావాలని ఆ మాటలు మాట్లాడించి ఆదివాసీలను అవమానించేలా ప్రవర్తిస్తున్నదా. అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి.
ఇక అసలు విషయానికి వద్దామని రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణానికి సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చినపుడు… సార్ అక్కడ ఏం జరిగిందో తెల్వదు కానీ సార్ సచ్చిపోవుడు మాకు కూడా బాధగానే ఉన్నది సార్. వాళ్ళు ఇంటికొచ్చిన తర్వాత అందరం వాళ్ళను తప్పు పట్టినం. వాళ్లకు చట్ట పరమైన శిక్ష వెయ్యాలి కానీ ఆ పేరు మీద మమ్ములందరిని ఎల్లగొట్టాలని సూసుడు ఎట్లా న్యాయమైతది? అన్న వారి ప్రశ్నకు సమాధానం ఈ సమాజం ఏం ఇస్తది. మమ్ముల ఎన్ని సార్లు ఎంత కొట్టిన, ఏమన్నా మనం బతుకాడానికి వచ్చినం ఐతమాయలే అనుకున్నాం కానీ సార్లు మీదకు ఎన్నడూ మర్ల బడలే సార్ అనుకుంటనే…శ్రీనివాస్ రావు వల్ల వాళ్ళు పడ్డ బాధలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకోచ్చిండ్రు.. మేం 20యేండ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం కానీ ఈ సార్ పెట్టినన్ని బాధలు మమ్ముల ఏ సార్ పెట్టలే అని… సార్ ఈ సార్ వచ్చిన కొత్తల్నే అడవులకు పొయిల కట్టెలకోసం పోయిన మా ఆడవాళ్ళను బెల్ట్, కట్టెలతో కొడితే కాళ్లు విరిగితే ఇక్కడి ఊరు నాయకులే మమ్ముల కొత్తగూడెం దవాఖానలో చేర్పించి బాగు చేపించిండ్రు సార్ అని చెప్పారు. ఈ సార్ కొట్టడం వల్లనే మడకం పర్మిల(ప్రమీల) 3నెలల కడుపు పోయింది. అప్పుడు పేపర్లల్లో వార్త వచ్చింది సార్ అని చెప్పుకొచ్చారు.
‘‘ మాకు కరెంటు ఉండదు, గ్యాస్ లేదు.మేమెట్లా వండుకుంటం? మేము ఎండిన కట్టెలతోనే కదా వంట చేసుకునేది? మేమేమీ పచ్చి చెట్ల కట్టెలతో వంట చేయం కదా? అన్న అడవి బిడ్డల ప్రశ్నకు అధికారులు బదులు ఇవ్వగలరా? ఇట్లాంటి సంఘటనలు అడవిలోనే ఉండే ఆదివాసుల పై నిత్యం జరుగుతూనే ఉండే నిరంతర దాడులు. వేల కోట్ల విలువైన కలపను దోసుకుపోతుంటే మూసుకుని ఉండే అటవీ అధికారుల కళ్లు ఎండు పుల్లలు ఏరుకునే ఆదివాసీలపై మాత్రం శాటిలైట్ కెమెరాలాకన్న నిశితంగా పనిచేస్తాయి. ఇంకా శ్రీనివాస రావు చర్యలను చెప్తుంటే మాకే ఒకింత సిగ్గుగా అనిపించింది. అది వింటే నాగరికులంగా చెప్పుకునే ఎవరైనా సిగ్గుపడాల్సిన విషయం అది. సార్.. ఈ అడవిలో తాగడానికి మాకు నీళ్ళే ఉండవు. ఎక్కడనో పై నుండి నీళ్ళు పారే సోటు సూసుకుని కొంచం చెలిమే తోడుకుంటే ఆ చెలిమను మొత్తం కూడిపించాడు.
ఆ పక్కనే ఇంకొక చెలిమ తోడితే అందులో ఉచ్చ పోసిండు. ఆ పక్కన ఇంకొక చెలిమ తోడితే ఆ చెలిమ పక్కన దొడ్డికి పోయి కడుకున్నడు సార్.. అని విచారంగా చెప్తూ దాదాపు కిలోమీటర్ కి ఎక్కువగా దూరమున్న ఆ చోటును చూపించారు మాకు. ‘‘ మా గుడిసెల పక్కనే హరిత హారం మొక్కలకోసం బోర్ వేశారు. ఎప్పుడన్నా దూపై నీళ్లకు పోతే మీ మనుషులకారా బోర్ వేసింది. అది ఈ చెట్లు పెంచటానికి అని తిట్టేవారు. ఇప్పుడు కంచే వేసుకున్నారు సార్. మా పానాలకు మొక్కల పానాలకున్న విలువ లేదా? సార్ అన్న వారి ఆవేదనను మనం అర్థం చేసుకోగలమా? ఇట్లా శ్రీనివాస రావు వల్ల వాళ్ళు పడ్డ బాధలన్నిటిని వరుసగా ఏకరువు పెట్టారు. ఇంకా వాళ్లే ఇట్లా అన్నారు… ఇంతకముందు సార్లు ఎవ్వలు కూడా మమ్ముల ఇంత గోస పెట్టలే. అడవులకు పోకు అనేది. కొత్త పోడు కొట్టకు అంటే కొట్టకుండా ఊకున్నం. మమ్ముల వాళ్ళు కూడా మంచిగా చూసుకునేది సార్.
కానీ గీ సార్ వచ్చినంకనే మమ్ముల బాగా గొసపుచ్చుకున్నడు. మమ్ముల పురుగుల లెక్క చూసేది అని చెప్పారు. ఇక్కడ ఒక్క కాడనే కాదు. శ్రీనివాస రావు గారు పనిచేసిన ప్రతి చోట వారు చేసిన ఇట్లాంటి చర్యలు ఒకటో రెండో లేకపోలేదు. అడవిని కాపాడటానికి నిబద్దతతో పనిచేస్తే అభినందించాల్సిందే. కానీ ఇట్లాంటి అమానవీయ చర్యలను మాత్రం మరుగునపరిచి కేవలం ఆదివాసీలను దోషులుగా చూపెట్టడం తగదు. సాధారణంగా ఒక దారుణమైన స్థితిలో మరణించిన వ్యక్తి పట్లా మనం చూసే దృష్టి ఆ మరణించిన వ్యక్తి స్థాయి, ఆ చర్యకు పాలు పడ్డ మనుషుల పట్ల మనకుండే హ్రస్వ దృష్టి లోపం వల్ల సహజంగానే నిందితుల పట్లా కోపం మరియు ఆ చనిపోయిన వ్యక్తి పట్లా అపారమైన సానుభూతి వ్యక్త పరుస్తారు. ఈ సానుభూతి వల్ల వారు జీవించినపుడు చేసిన దుశ్చర్యలన్ని మరణం మాటున కీర్తి శేషం గా మిగులుతాయి. అట్లా చూడటం వల్లనే అతను గతం లో చేసిన అమానవీయ చర్యలన్నీ మాయమై అతని ఖాతాలో కీర్తి చేర్చ బడితే, సంవత్సరాల తరబడి వేధింపులను బరిస్తూ వస్తున్న ఒక సామాజిక వర్గం మొత్తం నేడు వెలి కి గురి కాబడుతున్నది. ఇద్దరి అనుకోని చర్యల వల్ల జరిగిన దానికి మొత్తం గూడెం గూడెం దోషిగా చూడబడుతున్నది. ఇవన్నీ చెప్పడం చనిపోయిన అధికారిని చెడుగా చూపడానికి కాదు కానీ ఆవేశాలతో, ఒక వర్గం పై ఒక చర్యను సాకుగా చూపి మనలోని ద్వేషాన్ని వెళ్లగక్కి వాళ్ళ అస్తిత్వాన్ని చెరిపే ప్రయత్నం చేయకూడదని మాత్రమే.
ఈ సమస్యలన్నిటికీ కారణం ప్రభుత్వాల వైఫల్యాలు అనాలా లేకా ఆదివాసుల పట్లా చులకన భావం వల్ల అనాలా ఏమో కానీ ఇప్పటికే కొన్ని వేళల్లో ఉన్న ఆదివాసుల సాగు భూముల పట్టాలకోసం అర్జీలను త్వరితగతిన పరిష్కరించి పరిష్కార మార్గం చూపాలి. కారణం ఏదైనా కానీ పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమే. కానీ 2005కు ముందు సాగు చేసుకుంటున్న ఆదివాసీల అందరికీ సర్వే చేసి పట్టాలు ఇస్తేనే ఈ సమస్యకు ఏదో ఒక చోట ముగింపు పలికినట్లు ఉంటది. లేకుంటే అధికారుల దాడులు నిత్యకృత్యం ఉంటే వాళ్ళ భూములను హక్కులను కాపాడుకోడానికి ప్రయత్నించే ఆదివాసులు దోషులుగా ఈ సమాజం ముందు నిలబడాల్సి వస్తుంది. ఇంకా ఆదివాసులకు పోడు పట్టాల పేరుతో ఆదివాసీయేతరుల చేతులలో ఉన్నా వేలాది ఎకరాలు వాళ్లకు అధికారికంగా అప్పగించే కుట్ర జరుగుతోందని, కాబట్టి ఆదివాసీయేతరుల చేతులలో ఉన్న భూముల లెక్కలు కూడా తేల్చి, వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న ఆదివాసీ సమాజం, సంఘాల కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
దిలీప్.వి, జిల్లా ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక, ఉమ్మడి వరంగల్ జిల్లా
8464030808.




