చారిత్రకంగా తెలంగాణ చదువులో అడుగులు పడలేకపోయాయి.నిజాం పాలన, పోలీస్ యాక్షన్ అనంతరం విద్యా ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలోనే విశాలాంధ్రలో భాగం కావడం తెలంగాణ చదువులకు ఒక విషాదంగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగంలో విద్య పూర్తిగా బలహీన పడడం మరోవైపు వ్యాపార విద్య ప్రవేశించి బలోపేతం కావడం జరిగిపోయినాయి. తెలంగాణ ఉద్యమం చదువుల విషయంలో సంపూర్ణ మార్పులు రావాలని కోరుకున్నది. తెలంగాణలో ఏర్పడ్డ కార్పొరేట్ విద్యావ్యవస్థ ఇక్కడ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టివేసింది.కాబట్టి ప్రభుత్వ రంగంలో కేజీ నుంచి పీజీ దాకా కామన్ విద్యా విధానాన్ని అందించాలని తెలంగాణ ఉద్యమం ప్రాణప్రదంగా ఒక డిమాండ్ ను ఉంచింది.ప్రత్యేక తెలంగాణలో ఈ సమస్య పరిష్కారం కావాల్సి ఉండే. తెలుగు మాతృభాషను బతికించుకుంటూనే ఆంగ్ల విద్యను విద్యార్థులకు అందు బాటులోకి తీసుకురావలసి ఉండే. తెలంగాణ విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అందించే విధంగా విద్యా విధానం రూపొందించాల్సి ఉండే. ఇందుకోసం ప్రభుత్వం సమాజం పట్ల బాధ్యతతో విధాన నిర్ణయాలు జరగాల్సి ఉండే. కానీ స్వరాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు నియంత్రించాల్సింది పోగా వ్యాపార వర్గాలకు పెట్టుబడిగా తన విధానాలను రూపొందించుకుంది అనేది ఈ తొమ్మిదేళ్ల పాలనాకాలం రుజువు చేసింది.
యూనివర్సిటీలలో 80% ఖాళీల సంగతి పై మాట్లాడరేమి.?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజాలు వేసిన విశ్వవిద్యాలయాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. సమాజాన్ని అధ్యయనం చేసి దిశా నిర్దేశం చేయాల్సిన అధ్యయన కేంద్రాలు టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలతో నేడు వెలవెలబోతున్నాయి.తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీలపై సమైక్య పాలకులు సవతి తల్లి ప్రేమను కనబరిచారని పోస్టుల విషయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తున్నారని గొంతు చించుకొని ఉస్మానియా,కాకతీయ తదితర యూనివర్సిటీ ల విద్యార్థులు మొరపెట్టుకున్నారు.నేడు స్వయం పాలనలో కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని యూనివర్సిటీలను కాపాడమని మొరపెట్టుకుంటున్న దుస్థితి ఏర్పడ్డది.
తెలంగాణలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు టీచింగ్ పోస్టులకు సంబంధించి మంజూరైనవి, ఖాళీగా ఉన్నవి పరిశీలిస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయంకు మంజూరైన పోస్టులు 1268 కాగా, ఖాళీగా ఉన్నవి 848.కాకతీయ యూనివర్సిటీ కి మంజూరైన పోస్టులు 403, ఖాళీగా ఉన్నవి 295.తెలంగాణ యూనివర్సిటీ కి మంజూరైన పోస్టులు 150 ఖాళీగా ఉన్నవి 75.మహాత్మా గాంధీ యూనివర్సిటీ మంజూరైన పోస్టులు 70 ఖాళీగా ఉన్నవి 35.శాతవాహన యూనివర్సిటీకి మంజూరైన పోస్టులు 120, ఖాళీగా ఉన్నవి 100.పాలమూరు యూనివర్సిటీకి మంజూరైన పోస్టులు 150, ఖాళీగా ఉన్నవి 130.తెలుగు యూనివర్సిటీకి మంజూరైన పోస్టులు 115,ఖాళీగా ఉన్నవి 97. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మంజూరైన పోస్టులు 84, ఖాళీగా ఉన్నవి 58.జెఎన్టియూ కు మంజూరైన పోస్టులు 410,ఖాళీగా ఉన్నవి 232.జవహ్రలాల్ నెహ్రు పైన్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ కి మంజూరైన పోస్టులు 115,ఖాళీగా ఉన్నవి 24.మొత్తంగా ఈ విశ్వవిద్యాలయాలకు సమైక్య పాలనలోనే మంజూరైన టీచింగ్ పోస్టులు 2885 లో అనాడే భర్తీ చేసినవి 991 కాగా..నేడు 1894 ఖాళీలు దర్శనం ఇస్తున్నవి.అనగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క టీచింగ్ పోస్టు కూడా పైన పేర్కొన్న ఏ విశ్వవిద్యాలయాలలో కూడా భర్తీ చేయలేదు. కాంట్రాక్టు మీద.కలెక్టరేట్, సచివాలయం, పోలీసు ఆఫీసుల వంటి కొత్త భవనాల మీద ఉన్న ప్రేమ విశ్వవిద్యాలయాల పై ఎందుకు లేదు. యూనివర్సిటీల నిధుల విషయానికొస్తే జీతభత్యాల కోసం పెన్షన్ల కోసం మాత్రమే బడ్జెట్ లు కేటాయిస్తున్నారు. అందులో కూడా 15 పర్సెంట్ నుంచి 25% వరకు తగ్గించి ఇస్తున్నారు. దీనికి విద్యార్థులు కట్టిన ఫీజులను జతచేసి యూనివర్సిటీ ఉద్యోగుల జీతాలు వెల్లదీసుకుంటున్న పరిస్థితి. యూనివర్సిటీల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల విషయానికొస్తే అరా కొరాగా కేటాయింపులు జరిగినవి కానీ ఈ తొమ్మిదేళ్ల చరిత్రలో యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఒక్క రూపాయ కూడా నిధులను ఖర్చు చేయలేదు.
ప్రైవేట్ యూనివర్సిటీ లను పల్లకిలో మోస్తున్నారు
ప్రభుత్వ యూనివర్సిటీ లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఖాళీ లలను నింపకుండా నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం విచ్చల విడిగా ఇప్పటివరకు 13 ప్రైవేట్ యూనివర్సిటీ లకు అనుమతులు ఇచ్చినారు. వీటికి అనుమతులు ఇచ్చే క్రమంలో ఏలాంటి పట్టింపులు ఉండవు.వీటి ద్వారా పేద వర్గాల విద్యార్థులుకు విద్య దక్కని పరిస్థితి. రిజర్వేషన్ల అమలుకు నోచుకోని దుస్థితి. సేవా దృక్పథంతో కాకుండా ధనార్జనే ద్యేయంగా ఈ యూనివర్సిటీలు నడుస్తుంటాయి. అవసరమైన సందర్భంలో ఈ యూనివర్సిటీ ల యజమాన్యాలను ఎన్నికల పెట్టుబడిగా అధికార పార్టీ ఉపయోగించుకుంటుంది.అది మల్లారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వరదా రెడ్డి,రిలయన్స్, టెక్ మహేంద్రా,అజీం ప్రేమ్ జీ లాంటి వారి యొక్క ఆర్థిక సహకారం తోటి ఎన్నికల క్రమంలో ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారు.కొన్ని సందర్భాలలో చట్టసభలకు వీరినే పంపుతుంటారు.
కార్పొరేట్ కళాశాలలకు కళ్లెం వేయరా.!
సమైక్య పాలనలో ఒక వ్యాపారం లాగా నెలకొల్పబడిన కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు నేడు అంతకంటే రెట్టింపు స్థాయిలో తెలంగాణలో బలోపేతమై కూర్చున్నాయి.సామాజిక వికాసానికి నిలయాలుగా ఉండాల్సిన విద్యాలయాలు, నేడు కార్పొరేట్ కౌగిలి లో బంధి ఐ యాంత్రిక విద్యతో విద్యార్థుల ను మర యంత్రాలుగా తయారు చేస్తున్నారు. నారాయణ,చైతన్య ఎక్స్లెన్షియా,ఎస్సార్, విద్యాసంస్థల చేతిలో అన్ని స్థాయిల్లో విద్య బంధీ ఐ ఉన్నది. నిబంధనలను ఉల్లంఘించి ఒక్క పేరుతో అనేక బ్రాంచీలు నడుపుతున్నా, వసతులు లేకున్నా వారిపై చర్యలు తీసుకోరు.ఆట స్థలాలు ఉండవు,మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు ఈ కళాశాలలో అసలే ఉండవు.ఈ కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఐనా ప్రభుత్వము ఆ సంస్థలపై చర్యలు తీసుకోదు.ఈ సంస్థలపై ఉక్కుపాదం మోపకుండా సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ఆరా కొరా ఉపాద్యాయులతో అగమ్యగోచరంగా ప్రభుత్వ బడులు
తెలంగాణ వచ్చేనాటికి సుమారుగా 12 వేల పాఠశాలను రేష్నలైజేషన్ పేరుతో మూసి వేసినారు. తెలంగాణ వచ్చిన తర్వాత 6000 పాఠశాలను రేష్నలైజేషన్ పేరుతో మూసివేసినారు. కేవలం 26 వేల పాఠశాలలకు మాత్రమే పరిమితమైనాయి. ఇందులో సుమారు 6,500 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఈ ఉన్నటువంటి పాఠశాలలో 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.2015 నుంచి మరో 6000 డి.ఈ.ఓ పరిధిలో హోల్డ్ లో పెట్టినారు.538 ఎం.ఇ.ఓ పోస్టులలో 20 కూడా భర్తీ చేయని దుస్థితి.33 జిల్లాలు ఉండగా 10 మంది డిఈఓ లు మాత్రమే ఉన్నారు.మిగతా జిల్లాల్లో అదనపు బాధ్యతలను డిప్యూటీ డిఓలకు ఇచ్చి పని చేపిస్తున్నారు.66 డిప్యూటీ డి.ఈఓ పోస్టులకు 60 ఖాళీగానే ఉన్నాయి.4,379 మంది ప్రధానోపాధ్యాయులు కావాలసి ఉండగా 1950 మాత్రమే ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. మిగతా స్థానాల్లో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.2200 ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం ఒక టాయిలెట్ కూడా లేదు. టాయిలెట్స్ కలిగిన పాఠశాలల్లో 9000 పాఠశాలల్లో వినియోగంలో లేవు. కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో 1200 ల మంది విద్యార్థులకు ఒకే ఒక టాయిలెట్ ఉండడం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తుంది.ఒక ధనిక రాష్ట్రంలో ఈ పరిస్థితులు చోటు చేసుకోవడం ప్రభుత్వ విధానాలు ఎటువైపు నిరూపిస్తున్నాయి. కనీస మౌలిక వసతులు కల్పించడం విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు హక్కును నిరాకరించడమే.
రెసిడెన్షియల్ పాఠశాలల పై ఉన్న శ్రద్ద మిగతా ప్రభుత్వ పాఠశాలల పై ఉండాలి కదా.!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాఠశాల వ్యవస్థలో 60 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 31 లక్షల మంది విద్యార్థులు ప్రవేటు పాఠశాలలో చదువుతున్నారు.మిగతా 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ రంగంలో విద్యను అభ్యసిస్తున్నారు.ఇందులో 7.5 లక్షల(9%)మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.మిగతా 21 లక్షల పైబడి విద్యార్థులు జిల్లా పరిషత్,మండల పరిషత్,కేజీవీబి, మోడల్ స్కూల్స్ లలో అభ్యసిస్తున్నారు.ఇందులో అధికంగా నిధులు రెసిడెన్షియల్ పాఠశాలలకే కేటాయిస్తున్నారు,కేటాయించాలి కూడా..అదే స్టాయిలో జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలకు ఎంధుకు చేయూతనివ్వడం లేదు.వాటిని క్రమక్రమంగా ఎత్తివేసే కుట్రలకు తెరలేపుతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి రిక్షా పుల్లర్ కొడుకైనా ముఖ్యమంత్రి మనువడైన ఒకే బడిలో చదివే విద్యా విధానాన్ని తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వివక్షతలను సృష్టిస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియం సరే అధ్యాపకులు ఎక్కడ.?
గత సంవత్సరం 2022-23 నుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి నుండి 8వ తరగతి వరకు గొప్పలకు పోయి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు.ఈ సంవత్సరం 9వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేసినారు.అందుకు అనుగుణమైన ప్రణాళికను సిద్ధం చేసుకోలేదు ఆచరణలో అమలు పెట్టలేదు.కానీ వారికి ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించడానికి సుశిక్షితులైన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులలో ఇంగ్లీష్ మీడియం నైపుణ్యాలు పెంపొందడం లేదు. దీనితో తల్లిదండ్రులు అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు.తెలుగు మీడియం పాఠశాలలకు అనుబంధంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం చెప్పే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్ అస్థవ్యస్థం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగానికి 13 శాతం నిధులు కేటాయిస్తే,తెలంగాణలో విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ గనుక పరిశీలించినట్లయితే రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అంచలంచెలుగా బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పతనం చేస్తూ వస్తున్నారు. కొఠారి కమిషన్ ప్రకారం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని సిఫారసులు చేసినప్పటికీ పట్టించుకోలేదు.2014-15 సంవత్సరానికి విద్యారంగానికి కేటాయించినవి 10.89% అనగా 10,963 కోట్లు, వాస్తవ వ్యయం 61,59కోట్లు.
2015-16 కేటాయింపులు 9.69% అనగా 11,216, ఖర్చు చేసినది 10,594 కోట్లు.
2016-17 కేటాయింపులు 8.23%అనగా 10,738, వాస్తవంగా చేసిన వ్యయం 9,628 కోట్లు.
2017-18 జరిగిన కేటాయింపులు 8.49% అనగా 12,709 కోట్లు వాస్తవ ఖర్చు 12,442 కోట్లు.
2018-19 సంవత్సరానికి జరిగిన బడ్జెట్ కేటాయింపులు 7.61%అనగా 13,276 కోట్లు, వాస్తవ ఖర్చు 11,776 కోట్లు.
2019 -20 కి విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ 6.76% అనగా 12,220.75 కోట్లు.
2020-21 సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ 6.69% అనగా 12,144.27 కోట్లు.
2021-22 సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ 6.78%అనగా 15’608 కోట్లు.
2022-23 కు కేటాయింపులు 6.24% అనగా 16,402 కోట్లు.
2023-24 బడ్జెట్లో విద్యారంగానికి జరిగిన కేటాయింపులు 6.57% మాత్రమే. పై కేటాయింపులను కనుక చేసిన ఖర్చులను కనుక పరిశీలించినట్లయితే ఏనాడు కూడా విద్యకు చేసిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయలేదు.అనేకమార్లు విద్యారంగానికి కేటాయించిన నిధులను ఇతర రంగాలకు మళ్లించినారు.
317 జి.వో అనాలోచితమైనది
తెలంగాణ ప్రభుత్వం బదిలీల కోసం విడుదల చేసిన 317 జీవో జోనల్ వ్యవస్థ పేరుతో అనేక సమస్యలను సృష్టించిపెట్టింది.రాష్ట్రవ్యా ప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ జీవో స్థానికతను పట్టించుకోకపోవడంతో చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సీనియారిటీ పేరుతో సుదూర ప్రాంతాలకు బదిలీలు చేసినారు.ఇద్దరు ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పిల్లల చదువు ఒక దిక్కు, భర్త ఉద్యోగం ఒక దిక్కు,భార్య ఉద్యోగం మరో దిక్కు ఇలా ప్రభుత్వం ఆగం చేసింది. క్షేత్రస్థాయిలో జరిగే సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం తన స్వార్థం కోసం ఉన్న ఉద్యోగులను అన్ని జిల్లాలకు సరి చేయడానికి 317 జీవోను ఆయుధంగా చేసుకుంది.ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించకుండా అనాలోచితంగా 317 జి.వో ను తయారుచేసి ఉపాధ్యాయ హక్కులను,ఆకాంక్షలను కాలరాసినారు.
సమూలంగా బ్రష్టు పట్టిన విద్యారంగం
జయశంకర్ కలలుగన్న విధంగా తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేడు మతం పేరుతో కులాల పేరుతో గురుకులాలను ఏర్పాటు చేసి వివక్షతలను,అసమానతలను సృష్టిస్తూ ఇదే కేజీ నుండి పీజీ ఉచిత విద్య అని ఊదర కొడుతున్న పరిస్థితి.కేజీ నుండి పీజీ ఉచిత నిర్బంధ విద్య ఒక డొల్లతనం కాదా.! రేష్నలైజేషన్ పేరుతో ప్రభుత్వ బడులను మూసివేస్తున్నది నిజం కాదా.! 9 ఏండ్లుగా ఎంఈఓ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది వాస్తవం కాదా.! ఇన్చార్జ్ హెడ్మాస్టర్ లు తప్ప ప్రధానోపాధ్యాయుల నియామకం చేపట్టిన దాఖలాలు ఏవి.? ఇది ప్రభుత్వ బడుల పై సవతి తల్లి ప్రేమ కాదా.!ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జాడకే లేదు.ఇలా అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడుతదా.! ఉద్యమాలకు కేంద్ర బిందువులైన తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ కేటాయింపులలో తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు.విశ్వవిద్యాలయాల్లో వందల రూపాయల్లో ఉన్న పరీక్ష ఫీజులను వేయిల రూపాయల్లోకి పెంచి యూనివర్సిటీలను నడిపిస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదనేది కఠోర వాస్తవం కాదా.! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులు వేయిల రూపాయలు ఫీజు కట్టే పరిస్థితేనా.! ఏ ఏ యూనివర్సిటీకి ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయగలరా.! పరిశోధనలకు నిలయమైన యూనివర్సిటీ లలో పదవి విరమణ పొందుతున్నారేగాని ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఏది.? పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా స్కాలర్ షీపులు ఎందుకు పెంచరు.? ప్రైవేట్ యూనివర్సిటీలను పల్లకిలో మోస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలకు పాడేగడుతున్నది నిజం కాదా.! ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఒక పాలిటెక్నిక్ కళాశాల,మండలానికి జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హమీలను వెనక్కి తిరిగి చూసుకున్నారా.! విద్యావంతులు మేధావులతో కలిపి విద్యా విధానం రూపొందిస్తామన్న సంగతి యాది మర్చినరా.!తెలంగాణలో సమైక్య పాలనాకాలంలో కంటే ఘోరంగా విద్యా వ్యవస్థ బ్రష్టుబట్టి పోతుందనేది చేదు నిజం.
కరువైన ఉపాధి,ఉద్యోగాలు
ఉద్యమ ఆకాంక్షలలో ప్రధానమైనది నియామకాలు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఉల్లఘించబడిన డిమాండ్ కూడా ఉపాధి,ఉద్యోగాలే.ప్రభుత్వం అణచివేత అవసరాల దృష్ట్యా ఆరాకొరా పోలీసు ఉద్యోగాలు మినహాయిస్తే మిగతా అన్ని రంగాలలో అంతంత మాత్రమే.ఉద్యోగాల భర్తీలో గారడి లెక్కలు తప్ప ఆచరణలో అమలుకు నోచుకోలేదు.ఉపాధి ఉద్యోగాలు లేక వయోపరిమితి పెరిగి వివాహాలు గాక ఇంకా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ అప్పుల కుప్పలు చేస్తూ మనోవేదన చెందుతున్న పరిస్థితి.అంతంత మాత్రంగా ఉన్న స్థానిక ప్రైవేట్ కంపెనీల లో సైతం స్థానికులకు ఉద్యోగాలు దక్కని దుస్థితి.ఇస్తానన్న నిరుద్యోగ భృతి సైతం ఆటకెక్కింది.స్వరాష్ట్రం లో ఉద్యోగాల విషయంలో తొమ్మిదేండ్ల కాలంలో జరిగినంత నిర్లక్ష్యం సమైక్య పాలనలో సైతం జరుగకపోయి ఉండవచ్చు.రెండు లక్షల ఉద్యోగాలని రెండు లక్షల సార్లు ఊదరగొట్టి మాటలకే పరిమితమైనారు.వచ్చిన రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలతో నిరాశే మిగిలిందనడంలో ఏలాంటి సందేహం లేదు.
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




