కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ హుళిక్కేనా..

వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్‌ ‌ప్రజలు కోచ్‌ ‌ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను  సాకుగా తీసుకుని  పంజాబ్‌లో కోచ్‌ ‌ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త కోచ్‌ ‌ఫ్యాక్టరీలు అవసరంలేదని 2017లో ప్రకటించిన బిజెపి, ఆ తర్వాత మహారాష్ట్రలోని లాతూర్‌ ‌కోచ్‌ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత అసోంలోని కొక్రాజర్‌లోనూ అలాంటి ఫ్యాక్టరీకి సన్నాహాలు చేసింది. కాని, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ డిమాండ్‌ను  మాత్రం కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు అటుకెక్కించాయి.

ప్రధాని నరేంద్రమోదీ వచ్చే (జూలై) నెల 8వ తేదీన కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ ఓవర్‌ ‌హాలింగ్‌ ‌వర్క్‌షాపుతో పాటు వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్‌ ‌పార్క్‌కు భూమి పూజ చేస్తున్నారు. వాస్తవంగా ఈ రెండు ఫ్యాక్టరీల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. టెక్స్‌టైల్‌ ‌పార్క్‌లో రెండు మూడు టెక్స్‌టైల్‌ ‌కంపెనీలు ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాయి. అయినా అధికారికంగా వీటి శంఖుస్థాపనల కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వొస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు ఫ్యాక్టరీలు కూడా ఉమ్మడి  వరంగల్‌ ‌జిల్లాకు తలమానికమనే చెప్పాలె.. నిజాం సర్కార్‌ ‌పాలన తర్వాత నుండి నేటి వరకు వరంగల్‌ ‌జిల్లా ఎలాంటి భారీ పరిశ్రమకు నోచుకోలేదు. ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఆజంజాహి మిల్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదివేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వొచ్చింది. దాని మాడరైజేషన్‌ ‌విషయంలో గతపాలకుల అశ్రద్ద కారణంగా ఇక ఈ మిల్లు నడువదన్న ముద్రవేసి, జిల్లా కేంద్రంలో దానికున్న రెండు వందల ఎకరాల భూమిని గజాల లెక్క అమ్మేశారు. కొత్త కర్మాగారాలను నెలకొల్పాల్సిందిపోయి ఉన్న ఒక్క ఫ్యాక్టరీని మూసివేశారు. దాదాపు పదిహేనేళ్ళుగా దాన్ని మరిపించే పరిశ్రమ ఏదీ ఇంతవరకు వరంగల్‌కు రాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆజంజాహి మిల్లుకు ధీటైన  టెక్స్‌టైల్‌ ‌పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. గత తొమ్మిదేళ్ళుగా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అప్పుడొక ఇప్పుడొక పరిశ్రమ తమ కార్యక్రమాలను ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాయి.

ఆజంజాహి  మిల్లు మూత పడడానికి ముందు అంటే దాదాపు నాలుగున్నర దశాబ్ధాలుగా వరంగల్‌లో ఉపాధి అవకాశాలపై పెద్ద ఎత్తున ప్రజాందోళన కొనసాగింది. కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు, ముఖ్యంగా పెద్ద చదువులు లేనివారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ముందు నుంచి అంటే 1981-82 ప్రాంతం నుండే వరంగల్‌ ‌ప్రజలు ఈ ఫ్యాక్టరీకోసం ఉద్యమించారు. కోచ్‌ ‌ఫ్యాక్టరీకి కావాల్సిన స్థలాన్ని, నీటి, విద్యుత్‌ ‌వసతిని కల్పించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు జిల్లా అధికార యంత్రాంగం సమ్మతి తెలిపినప్పటికీ, దానిపైన నిర్ణయాన్ని నాడు కేంద్రంలోఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వొచ్చింది. కాగా 1984లో ఇందిరాగాంధీ  హత్యకు గురికావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. అక్కడి ప్రజల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు కాజీపేటలో ఏర్పాటు చేస్తామనుకున్న కోచ్‌ ‌ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలలో ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి రాష్ట్రంలో ఏ ఎన్నికలు వొచ్చినా ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక నినాదం గా మారింది.  తొమ్మిదేళ్ళ కింద తెలంగాణరాష్ట్ర ఏర్పాటు సమయంలో మరోసారి ఈ డిమాండ్‌ ‌ముందుకు వొచ్చింది. రాష్ట్ర విభజన హామీల్లో దీన్ని కూడా పొందుపరిచారు.

ఆనాటి నుండి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మాదిరిగానే ఈ విషయాన్ని నానుస్తూ వొచ్చింది. బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులు అదిగో వొస్తుంది, ఇదిగో వొస్తుందని స్థానిక ప్రజల్లో ఆశలు కల్పించి ఆఖరికి  నిరాశ పరిచారు. కాజీపేటలో ముందుగా  కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత వ్యాగన్‌ ‌ఫ్యాక్టరీ అన్నారు. మరికొద్ది రోజులకు వ్యాగన్‌ ‌వీల్‌ ‌ఫ్యాక్టరీ అన్నారు. ఆఖరికి  పీరియాడికల్‌ ఓవర్‌ ‌హాలింగ్‌ ‌వ్యాగన్‌ ‌వర్క్‌షాపును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ముందుగా హామీ ఇచ్చినట్లు ఇక్కడ రైల్వేకోచ్‌ ‌ఫ్యాక్టరీనే ఏర్పాటు చేయాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్‌ ‌చేయడంతో, అసలు కొత్తగా కోచ్‌ ‌ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే ఆలోచనే తమకు లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బల్ల గుద్దినట్లు చెప్పింది. ఇప్పటికే దేశంలో ఉన్న కోచ్‌ ‌ఫ్యాక్టరీల నుండి ఉత్పత్తి అవుతున్న కోచ్‌లు తమ అవసరాలకు సరిపోతున్నాయంటోంది కేంద్రం.

      వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్‌ ‌ప్రజలు కోచ్‌ ‌ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను  సాకుగా తీసుకుని  పంజాబ్‌లో కోచ్‌ ‌ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త కోచ్‌ ‌ఫ్యాక్టరీలు అవసరంలేదని 2017లో ప్రకటించిన బిజెపి, ఆ తర్వాత మహారాష్ట్రలోని లాతూర్‌ ‌కోచ్‌ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత అసోంలోని కొక్రాజర్‌లోనూ అలాంటి ఫ్యాక్టరీకి సన్నాహాలు చేసింది. కాని, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ డిమాండ్‌ను  మాత్రం కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు అటుకెక్కించాయి. పీరియాడికల్‌ ఓవర్‌ ‌హాలింగ్‌ ‌వ్యాగన్‌ ‌ఫ్యాక్టరీ అన్నది కేవలం వ్యాగన్ లను  శుభ్రం చేయడం, వాటిని మరమ్మతు చేసే సెంటర్‌గానే ఉంటుంది.
అదే ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే సెంటర్‌గా ఉండే కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వరంగల్‌తో పాటు వివిధ  ప్రాంతాలకు చెందిన వేలాది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించేవి.  ప్రధాని శంఖుస్థాపన చేయబోతున్న ఈ ఫ్యాక్టరీ కూడా హైదరాబాద్‌కు చెందిన పవర్‌మేక్‌ ‌టైకిషా జాయింట్‌ ‌వెంచర్‌ ‌టెండర్‌లో దక్కించుకుంది. దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట-మడికొండ-అయోధ్య పురం పరిధిలోని శ్రీ సీతారామ స్వామి ఆలయానికి చెందిన 150 ఎకరాల భూమిని అందజేసింది. ఇంకా పదకొండు ఎకరాల భూమి విషయంలో కొద్ది కాలంగా కేంద్ర, రాష్ట్ర నాయకుల మధ్య విమర్శలు చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా  దేశ ప్రధాని నరేంద్ర మోదీ దీని శంఖుస్థాపనకు జూలై ఎనిమిదవ తేదీన రాబోతున్నారు. ఈ ఓవర్‌ ‌హాలింగ్‌ ‌వ్యాగన్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుతో గత నాలుగు దశాబ్దాలుగా వరంగల్‌ ‌ప్రజలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న కోచ్‌ ‌ఫ్యాక్టరీకి ఇక స్వస్తి పలికినట్లే అన్నది స్పష్టమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *