‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌ముఖాముఖి పోటీ..

కర్ణాటక  ఓటమి బిజెపిని దక్షిణాదిలో అడుగుపడనీయకుండా చేస్తోంది. బలపడాలన్న ఆకాంక్ష ఉన్నా తప్పటడుగులు బిజెపిని అడుసులోకి తొక్కేలా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలతో ఇప్పుడు ఎన్నికలు ముఖాముఖిగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య పోటీగా మారాయి. బిజెపి ఇక పోటీలో లేదనుకునేలా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేరళలో ఎలాగూ ఛాన్స్ ‌లేదు. తమిళనాట కూడా బిజెపికి వోట్లు పడవు. పడేదల్లా కర్ణాటక తరవాత ఒక్క తెలంగాణలోనే..అదికూడా చేజేతులా చేజార్చుకున్న ఘనత ఆ పార్టీదే.

తనవేళ్లతో తన కళ్లనే పొడుచుకున్న చందాన ఇప్పుడు తెలంగాణలో కమలం కకావికలం అవుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత మొదలైన కమలనా థుల రాజీనామాలు.. నేటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వచ్చేసరికి టికెట్లు ఆశించిన, అసంతృ ప్తులు ఒక్కొక్కరుగా కమలం పార్టీకి గుడ్‌ ‌బై చెప్పేసి.. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల్లో చేరిపోతున్నారు. కొందరేమో ఇక కమలంతో లాభం లేదనుకుని టాటా చెప్పేస్తున్నారు. మోదీ•పేరు చెప్పుకుని లబ్దిపొందా లన్న బిజెపికి తెలంగాణలో పప్పులు ఉడకవని తెలిసినా మేకపోతు గాంభీర్యం వదలడం లేదు. ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, సీనియర్లు కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు సీనియర్‌ ‌నేతలు సైతం అదేబాట పడుతున్నారు. టికెట్లు ఆశించిన యువనేతలు అయితే తీవ్ర అసంతృప్తితో ఇక ఎప్పటికీ న్యాయం జరగదని భావించి కమలానికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. అసలు పార్టలో పెద్దగా టిక్కెట్లకు డిమాండే లేదు. కానీ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినప్పటికీ టికెట్‌ ఇవ్వక పోగా.. కనీసం ఎందుకివ్వ లేదో.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందఅనే విషయాన్ని కనీసం పిలిపించి మాట్లాడే పరిస్థితి కూడా బీజేపీ అధిష్టానం చేయడం లేదని సీనియర్‌ ‌నేతలు రగిలిపోతున్నారు. ఈక్రమంలో కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదిలో బలపడాలన్న ఆకాంక్ష నెరవేరడం లేదు. ఉన్న కర్ణాటకలో కూడా అధికారం తుడిచిపెట్టుకుపోయింది.

నాలుగు దక్షిణాది రాష్టాల్లో్ర బీజేపీ బలం అంతంత మాత్రమే. దీంతో ఏపీ,తెలంగాణ రాష్టాల్ల్రో రాజకీయంగా బలం కూడా అంతంతమాత్రంగానే ఉంది.  దీనికితోడు తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీని అణగదొక్కడానికి బీఆర్‌ఎస్‌ ‌పార్టీతో బీజేపీ లాలూచీ రాజకీయాలు నడుపుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో కూడా అధికార, ప్రతిపక్షాలను దెబ్బతీసి పాతుకు  పోవాలని చూస్తోంది.  వైసీపీ, టీడీపీలను కాదని బీజేపీకి అధికారం అప్పగించడం కాదుకదా..ఒక్క సీటయినా గెలిపిస్తారా అన్నది అనుమానమే. అయితే ఎపి విభజన తీరుపై ఎపికి అనుకూలంగా ప్రధాని మాట్లాడుతున్న తీరు ఏపీలో సానుభూతిని పొందేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎపిలో అధికారంలోకి రావాలనే దీర్ఘకాలపు వ్యూహాన్ని అమలు చేస్తున్నా..తెలంగాణతో పోలిస్తే అక్కడ దానికి ఏ మాత్రం పునాది లేకుండా పోయింది. వైసిపికి అంటకాగుతోందన్న అనుమానాలు ఉన్నాయి.

దీంతో బిజెపిని అక్కడా నమ్మే పరిస్థితి లేదు. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అర్బన్‌ ‌వోటర్లు, విద్యావంతులతో పాటు, సామాన్య హిందూ వోటర్లులో  బలంగా నిలిచేందుకు ప్రణాళిక రచిస్తోంది. దక్షిణాదిలో ఇప్పటికి బీజేపీ చాలా చిన్నపార్టీగానే గుర్తించాలి. అద్వానీ రథయాత్ర కారణంగా బీజేపీ పూర్తిస్థాయి హిందుత్వ పార్టీగా ఎదిగినా తెలంగాణ, ఎపిల్లో మాత్రం సత్తా చాటలేకపోతోంది. సాంప్రదాయక కాంగ్రెస్‌ ‌వోటు బ్యాంకుతో నిర్మితమైన వైసీసీని దెబ్బతీసి పరోక్షంగా టీడీపీని బలహీనపరచి ఆంధ్రప్రదేశ్‌ ‌రాజకీయ చరిత్రలో కనుమరుగు చేయగలిగితే దీర్ఘకాలంలో లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. ఎన్టీఆర్‌ ‌తనయ పురంధేశ్వరిని రాష్ట్ర బిజెపికి అధ్యక్షురాలు ని చేయడంలోనూ మాస్టర్‌ ‌ప్లాన్‌ ఉం‌దని అనిపిస్తోంది. టిడిపి దెబ్బతింటే వారంతా ఇటు బిజెపిలో చేరుతారన్న ఆలోచన కావచ్చు. అందుకే పురందేశ్వరి ద్వారా బిజెపి రాజకీయాలు నడిపిస్తోంది. అనూహ్యంగా ఇప్పుడు టిడిపి నేత చంద్రబాబు కేసుల్లో అరెస్ట్ ‌కావడంతో దానిని క్యాష్‌ ‌చేసుకునే యోచనలో ఉంది. టీడీపీ బలహీనపడితే తమకు లాభిస్తుందన్న యోచనలో ఆ పార్టీ ఉందన్న ఆరోపణలూ ఉననాయి.

ఇకపోతే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమంటూ జాతీయ, రాష్ట్ర నాయకులు కుండబద్దలు కొడుతున్నా, కొద్ది రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం కేడర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీనియర్‌ ‌నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అవుతుండడంతో.. ఇది ఎక్కడకు దారితీస్తుందోనని వారిలో బెంగ పట్టుకుంది. పార్టీలో ఉత్సాహంగా వొచ్చి చేరిన వారంతా ఒక్కొక్కరే బయటకు జారుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌కు బిజెపి ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒకరా ఇద్దరా డజనుకుపైగానే పార్టీని వీడారు. బండి సంజయ్‌ అధ్యక్షుడయ్యాక..పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకుని వెళ్లడంతో పాటు..వివిధ పార్టీల్లో ఉన్నవారినంతా బండి లాక్కుని వొచ్చారు. బండిని తప్పించగానే వీరుకూడా మెల్లగా జారుకున్నారు. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం పక్కనబెడితే ఉన్నవారిని బీజేపీ కాపాడుకోలేక పోతోంది. ఎన్నికల వేళ ఆ పార్టీకి షాక్‌లద షాకులు తగులుతున్నాయి. ఇప్పటి వరకూ 88 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్‌ ‌ప్రకటించింది. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు లేక కొందరు రాజీనామా చేశారు. సీనియర్లు ఇమడలేక తప్పుకుంటున్నారు. చిల్లుపడ్డ కుండఖాలీ  అవుతున్నా..బిజెపి అచేతనంగా ఉండిపోతోంది. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందు కే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బలహీన వర్గాలను పార్టీ నాయకత్వం ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా కనిపించడం లేదు.

మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తిక రంగా మారుతున్నాయి. ఎన్నికలు బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్యపోరుగా మారాయి. ఓ రకంగా చెప్పాలంటే ముఖాముఖి పోటీగా మారాయి. అందుకు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌కూడా కాంగ్రెస్‌నే టార్గెట్‌ ‌చేస్తున్నారు. కాంగ్రెస్‌ ‌కూడా ఎదురుదాడికి దిగుతోంది. బిజెపి,బిఆర్‌ఎస్‌, ఎంఐఎం‌లు ఒక్కటే అని ప్రచారంలో చెబుతోంది. అనూహ్యంగా ప్రజలు కూడా దీనినే నమ్ముతున్నారు. మొత్తంగా ఎన్నికల గోదాలో బిజెపి ఉన్నా లేనట్లుగానే భావించాలి. గతంలోలాగానే వందకు పైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్న అనుమానం కలుగుతుంది.
 -ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *