పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదు
మేడిగడ్డపై చిల్లర రాజకీయాలు…
వందరోజుల్లోనే బండారం బయటపడిరది
కెసిఆర్ పాలనలో ఈ కష్టాలు లేవని తేలిపోయింది
గులాబీ జెండానే తెలంగాణకు అండ…
బిఆర్ఎస్ గెలిస్తేనే భవిష్యత్
ఆరు గ్యారెంటీలు కాదు కదా…అసలు పట్టించుకోరు
రాష్ట్రానికి ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ
ఇవ్వని బిజెపికి ఎందుకు వోటేయాలి..
కరీంనగర్ కదనభేరి సభలో
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్
కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 12 : రెప్పపాటు కరెంట్ పోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం ఘనతేనని మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. రైతులను ఆదుకోవాలని రైతుబంధు ఇచ్చామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ను గెలిపించాలని, గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు అండగా ఉంటుందన్నారు. కరీంనగర్ కదనభేరిలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. గులాబీ జెండా ఎగిరితేనే కాంగ్రెస్‌పై యుద్ధం చేయగలుగుతామని అన్నారు. లేకుంటే వారి గ్యారెంటీలను పట్టించుకోరని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీల్ళెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవొట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుతోచని స్థితిలో, భయంకరమైన కరువు కాటలతో కరెంటు కోతలతో.. ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలమైన తెలంగాణను ఎట్లా అభివృద్ది చేశామో ప్రజలకందరికి తెలుసని అన్నారు. తెలంగాణ..దశ దిశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటించామని, ఆ రోజు ఎవరికీ విశ్వాసం లేదని, తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు ఉండేవని గుర్తు చేశారు. ఆ రోజు తనకున్న పదవులన్నీ విసిరివాళ్ల మొఖానపడేసి తెలంగాణ కచ్చితంగా నిలబడాలి.. కలబడాలి.. సొంత రాష్ట్రం కావాలి.. సొంత రాష్ట్రమైతే తప్ప దిక్కులేదని.. ఒక్కడిగా.. సైన్యంగా.. పిడికెడు మందితో జై తెలంగాణ అని బయలుదేరినమన్నారు. హైదరాబాద్‌లో చర్చోపచర్చలు… ప్రజల్లోకి వెళ్లాలి..ప్రజాగర్జన కావాలి..బ్రహ్మాండమైన చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ.
ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి ఇదే ఎస్సారార్ కళాశాల మైదానంలో.. ఇదే రాత్రి సమయంలో మే 17న 48 డిగ్రీల ఎండ. అయినా తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని ఆనాడు వొస్తే తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తు ఎత్తిన గడ్డ ఈ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకుని..పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి ఉద్యమం కోసం బయలుదేరినట్లు వివరించారు. ఆ తర్వాత కథంతా ప్రజలకు తెలుసునన్నారు కెసిఆర్. ముందుండి ప్రజలే తనను నడిపించారని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ. మాతోని నువ్వు గెలిచినవ్ కేసీఆర్.. నీ లెక్కేది.. బిషాద్ ఏంది అని మాట్లాడితే ఆ నాడు కేంద్రమంత్రి పదవి, ఎంపీ పదవి నేలకేసి కొట్టి రార నా కొడకా కరీంనగర్‌కు అని మళ్లీ ఇక్కడికి వొచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో.. ఎన్ని మాయోపాయాలు చేశారో.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందే నాకంటే విూకే తెలుసు. బ్రహ్మాండంగా మరోసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ.. తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో 2.50లక్షల మెజారిటీతో నన్ను గెలిపించి మరోసారి తెలంగాణ చైతన్యాన్ని చాటింది ఈ గడ్డ’ అని కెసిఆర్ అన్నారు. తన పదేళ్ల పాలనలో కరెంట్ కోతలు లేవు…ఎకరా కూడా ఎండలేదు. ఇప్పుడు కరెంట్ లేదు. పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క నవోదయ విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. దేశంలోని ఒక్కో జిల్లా ఒక నవోదయ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం అని కేసీఆర్ గుర్తు చేశారు.
తమకు కూడా నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని వంద యాభై ఉత్తరాలు మోదీకి రాశానని.. అయినా ఒక్క నవోదయ కూడా కేంద్రం ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. అలాంటి బీజేపీకి ఒక్క వోటు కూడా కరీంనగర్లో వేయొద్దని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కరీంగనర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కదనభేరి భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరై మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని ప్రశ్నించారు. రూ.5 పని కూడా చేయలేదని విమర్శించారు. అంతకుముందు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని అన్నారు. బండి సంజయ్‌కు వినోద్ కుమార్‌కు ఎంత తేడా ఉందో గమనించాలని కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. తాము కూడా ఇలాంటి మాటలు మాట్లాడగలమని అన్నారు. ఉద్యమ సమయంలో సన్నాసులు, దద్దమ్మలు లాంటి ఘాటు వ్యాఖ్యలు తాను కూడా మాట్లాడానని.. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు తాను ఎప్పుడూ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని గుర్తు చేశారు. ‘కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో పోయి ప్రజలు మోసపోతరు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు 100 రోజుల్లోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూస్తున్నరు.
ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడతం అని మాట్లాడిన్రు. ఇవాళ నోటికి మొక్కాలే. 400 హావిూలిచ్చిన్రు. ఇప్పుడు రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతం అని ఓ మంత్రి అంటడు. బిడ్డా.. రైతుల చెప్పులు చానా బందోబస్తు ఉంటయ్. ఆరు గ్యారంటీల గురించి అడితే.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో ఏసుకుంటా.. పెండ మొకానికి రాసుకుంటా.. చీరుతా సంపుతా, మానవ బాంబునైతా అని మాట్లాడుతున్నడు. తెలంగాణ రాష్టాన్రికి, సమాజానికి ఇది గౌరవమా? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా?‘ అని కేసీఆర్ అన్నారు. ‘నీకు ఏ పరిస్థితి దొరికిందో ముందుకు ఒక మార్గం వేసుకొని సక్రమంగా పని చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రజలు విూకు అధికారం ఇచ్చిన్రు.. మాకు అభ్యంతరం లేదు. మాకంత ఈర్ష కూడ లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చెయ్.. కావాలంటే మాకంటే మంచిగా పని చెయ్. మంచి పేరు తెచ్చుకో. మాతోని పోటీ పడేటట్లు చూసుకో. అంతేకానీ, చీరతము, పండబెట్టి తొక్కుతము.. రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతము’ లాంటి మాటలు వొద్దని కెసిఆర్ హితవు పలికారు. కరీంనగర్ గడ్డ నుంచి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తాను పిలుపునిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మానవబాంబు అయితమని మాట్లాడవచ్చునా ? మాకు మాట్లాడరాదా? తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? ఇవాళ గియాళకు మొదలుపెడితే రేపు గియాళ వరకు మాట్లాడొచ్చు. నేను మాట్లాడినా.. ఉద్యమంలో మాట్లాడాను.
తెలంగాణను వ్యతిరేకించినోళ్లను దద్దమ్మలు, సన్నాసులు అన్నాను. సమైక్యవాదం.. సమగ్ర అభివృద్ధి అంటే.. సన్నాసున్నాలారా ఏదిరా అని మాట్లాడిన. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లలో ఒక్కరోజు, సందర్భంలో దురుసుమాటలు విన్నరా? నేను చెప్పే మాటలపై ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం’ అని కెసిఆర్ అన్నారు. కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ ప్రసంగిస్తూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్ ఈ కరీంనగర్ గడ్డ నుంచే సింహగర్జణ చేశారని, ఆ తర్వాత విజయవంతంగా లక్ష్యాన్ని సాధించారని గంగుల గుర్తుచేశారు. దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి నుంచే ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిందని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ కరీంనగర్ గడ్డ నుంచే కదనభేరి మోగించేందుకు కేసీఆర్ వచ్చారని అన్నారు. ఈ కదనభేరితో లోక్‌సభ ఎన్నికల కదనరంగంలో దూకి ఘన విజయం సాధిద్దామని పిలుపు నిచ్చారు. పార్లమెంటులో కొట్లాడి కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత అప్పటి మన ఎంపీ వినోద్‌కుమార్‌కే దక్కుతుందని గంగుల అన్నారు.





