12 సీట్లు మనవేనంటున్న బిఆర్ఎస్, డబుల్ డిజిట్ లక్ష్యంగా బిజెపి
ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అదే జోష్ తో ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు ఏరికోరి తనకు బాధ్యతలు అప్పగించిన మేరకు రాష్ట్రాన్నే సాధించి పార్టీకి కానుకగా ఇచ్చిన తాను, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తనను నమ్మిన పార్టీ రుణం తీసుకోవాలన్న లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయడం ద్వారా ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని పొందిన తమను మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వంద రోజుల్లో తమ హామీలను నెరవేర్చే పనిలో ఉంటే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం కూలిపోతుందంటూ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే తాము కాంగ్రెస్ పార్టీలోకి ఇతరులను ఆహ్వానించే పనిపెట్టుకున్నట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే ఎవరైనా చేతులు ముడుచుకుని కూర్చోరని, అందుకే తాము బాజాప్తాగా దర్వాజలు తెరిచామని ఆయన చెబుతున్నారు.
పదేళ్ళపాటు అధికారం చెలాయించిన బిఆర్ఎస్, గత ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్‌తోపాటు, బిజెపి పార్టీలో చేరడానికి క్యూ కడుతున్న విషయం తెలిసిందే. వీరిలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండగా కిందిస్థాయి కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ అభయ హస్తాన్ని చూపిస్తున్నది. ఈ విషయంలో అధిష్టానం సహకారం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండడంతో బిఆర్ఎస్ నుండి అనేకులు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. అలా చేరినవారిలో ఇప్పటివరకు ముగ్గురు నాయకులకు రానున్న ఎంపి ఎన్నికలకుగాను పార్టీ టికెట్ల్లు ఇవ్వడం గమనార్హం. అయితే ఈ విషయంలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తున్నది. దీంతో పాత కొత్త నాయకుల మధ్య సమన్వయం లోపిస్తున్నది. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడమేంటన్న వాదన వినిపిస్తున్నది.
గడచిన పదేళ్ళుగా అధికార పార్టీ పదవులు అనుభవించిన వీరు కాంగ్రెస్ కార్యకర్తలపైన తప్పుడు కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురిచేశారని, అలాంటివారికి టికెట్ ఇవ్వడంపట్ల వారు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు బహాటంగానే ఆరోపించడం గమనార్హం. ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుల పరిస్థితితేమిటన్నది ఆయన ప్రశ్న. దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వొస్తుందన్నదే తమ ఆవేదన అంటూ, ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిద్దామంటే ఆయన తమకు ఆ అవకాశం కలిగించడంలేదంటూ ఆయన వాపోతున్నారు. తాజాగా పార్టీ మారిన దానం నాగేందర్‌కు సికిందరాబాద్ టికెట్, చేవెళ్ల సిట్టింగ్ బిఆర్ఎస్ ఎంపి పార్టీ మారగానే ఆయనకే తిరిగి టికెట్ ఇవ్వడం, మరో బిఆర్ఎస్ నేత సునీతారెడ్డికి మల్కాజిగిరి సీటు కేటాయించడంట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే 12 సీట్లు మనవే నంటున్నారు బిఆర్ఎస్ నేతలు. తాజాగా ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ కనీసం 9 నుండి 12 స్థానాల్లో తాము గెలిచే అవకాశాలున్నాయని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రేపు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 14 స్థానాల్లో ప్రధాన పక్షంగా తమ పార్టీ ఉండబోతుందని ఆయన జోష్యం చెప్పారు. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఇప్పటివరకు 16 స్థానాల అభ్యర్దులను ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో బిఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించినట్లు కనిపిస్తున్నది. ప్రకటించిన 16 స్థానాల్లో అయిదు రిజర్వు సీట్లు కాగా అందులో రెండు ఎస్టీ స్థానాల్లో ఒకటి ఆదివాసీలకు కేటాయించగా మరోటి లంబాడాకు, అలాగే ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు మాదిగ, ఒకటి మాలలకు కేటాయించడం ద్వారా అందరికి అవకాశం ఇచ్చినట్లు అయింది. అలాగే మిగిలిన 11 స్థానాల్లో 5 బిసిలకు కేటాయించి సామాజికి న్యాయాన్ని పాటించిందా పార్టీ.
కాగా 17 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌ను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ పార్టీలో కూడా పాత, కొత్త నాయకులమధ్య సమన్వయం లోపించింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు విమర్శిస్తున్నారు. వలస నేతలకు టికెట్ల్లు కేటాయిస్తే ఇంతకాలం పార్టీ జండాను మోసినవారి సంగతేమిటని వారు నాయకత్వాన్ని నిలదీస్తున్నారు,. దీంతో కేంద్ర నాయకత్వం అలర్ట్ అయి, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారీని రంగంలోకి దింపింది. ఏదిఏమైనా 2019లో, ఆ తర్వాత తాజాగా పార్టీలోకి వొచ్చినవారికే ఎక్కువ టికెట్ల్లు కేటాయింపు జరిగిందన్నది వాస్తవం. అలా టికెట్ల్లు సాధించుకున్నవారు దాదాపు ఏడెనిమిది మంది బిఆర్ఎస్, కాంగ్రెస్ నుండి వొచ్చినవారుండడం గమనార్హం.





