- ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్
- రైతుల సంక్షేమం విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తానన్న సిఎం
- పని చేసే నాయకుడిని ప్రోత్సహించాలన్న పోచారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కొడుకుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి పోచారం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…రైతుల సంక్షేమానికి పోచారం పాటుపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. వ్యవసాయం దండగ కాదని, పండుగ చేసే బాధ్యత తమదని, రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి సూచనలు స్వీకరిస్తూ ముందుకెళ్తామని రేవంత్ అన్నారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చాక జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని, అందుకే సిఎం రేవంత్‌ను మనస్పూర్తిగా తన ఇంటికి ఆహ్వానించానని తెలిపారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతు బిడ్డనైన కారణంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలువాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానని వివరణ ఇచ్చారు. సమస్యలను అధిగమిస్తూ సిఎం ధైర్యంగా ముందుకెళ్లున్నారని, తాను తన జీవితంలో ఆశించేది కేవలం రైతు సంక్షేమమేనని అన్నారు.
తాను గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశానని, ప్రజలందరి భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని పోచారం అన్నారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, బీఆర్ఎస్లో పని చేశానని, ఇప్పుడు రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్‌లో చేరానని, 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక ఆయనకుందని, తనకు వయసైపోయినందున పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.





