కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి
జిల్లాలో బిఆర్‌ఎస్‌కు స్థానం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్న మంత్రి

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 07 : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం నాడు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఒక్కరిని కూడా అసెంబ్లీ గడపదాటనివ్వనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ముందే బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు సవాలు విసిరారు. విసిరిన సవాలును సీరియస్‌గా తీసుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్ధానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కేవలం ఒకే ఒక్కటి భద్రాచలం సీటు బిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. ఆ స్థానంలో డాక్టర్‌ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. భద్రాచలం సీటు కూడా తన ఖాతాలోనే వేసుకోవాలని, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే పకడ్భందీ వ్యూహంతో పొంగులేటి పావులు కదిపారు. అసలే తెల్లం పొంగులేటి శిష్యుడు కావడంతో ఇది మరింత సులువయింది.

గెలిచిన నాటి నుండే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దగ్గర ఒప్పుకుని బిఆర్‌ఎస్‌పార్టీ కార్యక్రమాలకు తెల్లం వెంకట్రావు చాలా దూరంగానే ఉంటూ వొచ్చారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరౌతానని చెప్పుకుంటూ వొచ్చారు. అలాగే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి హాజరై అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు. తరువాత నేరుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు వెళుతూ వొచ్చారు. శనివారం తుక్కుగూడ బహిరంగసభలో కూడా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రత్యక్షమయ్యారు. దీంతో బిఆర్‌ఎస్‌ శ్రేణులు తెల్లం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే నిర్ణయానికి వొచ్చారు. ఈ క్రమంలో ముందుగా ఊహించినట్లే తెల్లం వెంకట్రావు ఆదివారం నాడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *