కాంగ్రెస్‌కు చిక్కుముడిగా ఆ మూడు స్థానాలు

తేల్చుకోలేకపోతున్న ఖమ్మం..కన్ఫ్యూజ్‌లో కరీంనగర్‌..‌తటస్థంగా హైదరాబాద్‌
‌టికెట్‌ ‌కోసం కీలక నేతలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నం

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌మరో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ‌రానుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోతున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకుగాను పద్నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ మూడు స్థానాల విషయంలో మాత్రం కొద్ది రోజులుగా కుస్తీ పడుతున్నది. ఈ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో దిల్లీ, హైదరాబాద్‌ ‌మధ్య ఆ పార్టీ అగ్రనేతలు చక్కర్లు కొడుతున్నారు. ఈ మూడు స్థానాలను గెలుచుకోవడం విషయంలో రాష్ట్రంలో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు స్థానాల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ ‌మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలో ఉంది. సునాయాసంగా గెలుస్తామనుకుంటున్న ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేకపోతున్నది. వాస్తవంగా పూర్వ ఖమ్మం జిల్లాలోని పన్నెండు శాసనసభ స్థానాల్లో ఒక్కటి తప్ప అన్ని స్థానాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుచుకుంది. అతి కష్టంగా గెలుపొందిన భద్రాచలం అసెంబ్లీ ఎంఎల్‌ఏ ‌తెల్లం వెంకట్రావ్‌ ‌కూడా తాజాగా కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకోవడంతో కాంగ్రెస్‌కు అక్కడ ఎదురులేకుండా పోయింది.

ఇక్కడి నుండి పోటీచేసే అభ్యర్థి నల్లేరు మీద నడుకే కావడంతో ఇక్కడ పోటీ కూడా పెరిగింది. ఈ స్థానాన్ని ఆశిస్తున్న వారు అధికార పార్టీలో కీలక వ్యక్తులు కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ స్థానాన్ని తన భార్య మల్లు నందిని కోసం తీవ్రతరంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా అదే ప్రాంతానికి చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తన తమ్ముడు యుగేందర్‌ను ఇక్కడి నుండి పోటీ చేయించే విషయంలో మంతనాలు జరిపారు. కాగా ఖమ్మంలో గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా బిఆర్‌ఎస్‌ ‌దక్కనివ్వనని శపథం చేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి ఇక్కడి నుండి టికెట్‌ ఇప్పించుకోవాలనుకున్నారు. వీరంతా తాజాగా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో రేవంత్‌ ‌రెడ్డికి అండగా నిలిచినవారే. అయినా రేవంత్‌రెడ్డి మాత్రం ఈ విషయంలో మౌనం వహించి అంతా అధిష్టానం చూసుకుంటుందన్నట్లుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా ఇక్కడి నుండి పోటీ చేసేందుకు అసక్తి కనబరుస్తున్నప్పటికీ తనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అడ్డుతగులుతున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

కాగా మహబూబాబాద్‌ ‌మాజీ ఎంపి, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు రామసహాయం సురేందర్‌ ‌రెడ్డి కుమారుడు రఘురామ్‌రెడ్డికి లేదా వంకాయలపాటు రాజేందప్రసాద్‌కు అవకాశం లభిస్తుందన్న వార్తలు వొచ్చాయి. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గం వోట్లు ఎక్కువ కావడం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అక్కడి నుండి పోటీలో నిలుపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాజేందప్రసాద్‌కే అవకాశం ఉంటుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మాజీ మంత్రి మండువ వెంకటేశ్వర్‌రావు పేరు తెరపైకి వొచ్చింది. గతంలో టిడిపిలో రేవంత్‌రెడ్డి సహచరుడు, ఆ పార్టీ నుండి నిజామాబాద్‌ ‌డిచ్‌పల్లి నియోజవర్గంలో అయిదుసార్లు ఎంఎల్‌ఏగా గెలిచిన వెంకటేశ్వర్‌రావును ఇక్కడ నుండి నిలుపాలని కాంగ్రెస్‌ ‌యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా కొనసాగిన వెంకటేశ్వర్‌రావు మారిన పరిస్థితుల దృష్ట్యా బిఆర్‌ఎస్‌లో చేరి, 2023లో కాంగ్రెస్‌ ‌తీర్థం తీసుకున్నాడు. అయితే ఆయన స్థానికేతరుడంటుంది ఖమ్మం కాంగ్రెస్‌ ‌క్యాడర్‌. ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్‌రావును సమర్థవంతంగా ఎదుర్కుని నిలిచే స్తోమత ఆయనకే ఉందని కాంగ్రెస్‌ ‌భావిస్తున్నది.

కరీంనగర్‌ ‌విషయంలోనూ అదే డైలమాలో ఉంది కాంగ్రెస్‌. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపి బోయినపెల్లి వినోద్‌కుమార్‌ను, బిజెపి సిట్టింగ్‌ ఎం‌పి బండి సంజయ్‌కుమార్‌ను నిలుపగా వారికి ధీటైన వ్యక్తి అన్వేషణలో కాంగ్రెస్‌ ఉం‌ది. అనూహ్యంగా గంగుల కమలాకర్‌ ‌పేరు తెరమీదకు వొచ్చింది. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో మంత్రిగా చేసిన కమలాకర్‌ ‌చాలా సీనియర్‌. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కూడా పార్టీ మారుతారన్న  వార్తలు గుప్పుమంటున్నాయి.  ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీలో కమలాకర్‌, ‌రేవంత్‌రెడ్డి ఒకే స్కూల్‌ ‌విద్యార్థులు. ఆ పరిచయంతోనే ఆయన్ను కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి ఆహ్వానించడంతో పాటు కరీంనగర్‌ ఎం‌పీగా పోటీచేయాలని కోరినట్లు తెలుస్తున్నది. బిసి వర్గానికి చెందిన బండి సంజయ్‌కి అదే సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ అవుతేనే సరైన పోటీ ఇవ్వగలడన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ. కాగా హుసునాబాద్‌ ‌మాజీ ఎంఎల్‌ఏ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు కూడా ముందు నుండి వినిపిస్తున్నది. కరీంనగర్‌ ఎం‌పి స్థానానికి ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గెలుపు విషయంలో ఆయన ప్రధాన భూమిక పోషించిన విషయం తెలిసిందే.

కాగా వెలమ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వారికే టికెట్టు కేటాయిస్తే సమన్యాయం పాటించినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో వెలిశాల రాజేందర్‌రావు పేరు వెలుగులోకి వొస్తున్నది. ఇక హైదరాబాద్‌ ‌విషయానికొస్తే.. మొదటి నుండి ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్ద ఆశలు లేవు. ఇక్కడి ఎంఐఎం పాతుకుపోవడం ఒకటి కాగా, ఈసారి బిజెపి ఈ స్థానంపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. విరించి హాస్పిటల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌మాధవీలతను ఏరికోరి ఈ స్థానానికి బిజెపి ఎంపిక చేసింది. కాగా, ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కడుతుండడంతో కేవలం తాము కూడా పోటీపడ్డామని చెప్పేందుకే ఇక్కడ అభ్యర్థిని కాంగ్రెస్‌ ‌నిలుపుతుందన్న వాదన వినవస్తున్నది. ఇప్పటికైతే తాజాగా హైదరాబాద్‌ ‌డిసీసీ అధ్యక్షుడు సమీర్‌ ‌వాలివుల్లా పేరు వినిపిస్తున్నప్పటికీ ఈ మూడు స్థానాలను ఇంకా కాంగ్రెస్‌ ‌ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *