కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి
విత్తానాలు కొనబోతే కొరివి
పెట్టుబడి పూడని పరేషాన్లు
అమ్మకానికి కష్టాల కుప్పలు !

అతివృష్టితో నష్టాల వరదలు
అనావృష్టితో అప్పుల రాసులు
హలధారి చేతుల్లో హాలాహలం
దేశానికి అదో మహా పెనుశాపం !

సాగుకు చెమట ధారలే పెట్టుబడులు
ఆకలిని ఆసాంతం దిగమింగి..
ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు
అన్నదాతకే సున్నం పెట్టే రోజులు !

నాగరికత వికాస సాగుబడులు
చేనుతో ముచ్చటించగల కర్షకుడు
చీడ పీడలపై యుద్ధం చేసే వైద్యుడు
ఊరికే ఊపిరులూదే హలధారి !
బతుకు బండికి కర్షకులే చక్రాలు
మట్టిని మాణిక్యంగా మార్చే మేధావి
మ్నెలకల చిగుర్ల భాష ఎరిగిన సుజ్ఞాని
పండులో రుచిరసాన్ని నింపిన శ్రమజీవి !

పాలకంకుల పడుచు పరువాలు
పత్తి గూళ్ల మృదు దరహాసాలు
వరి గొలుసుల సుతార నృత్యాలు
సేద్యపు సిరి సిత్రాలెరిగిన కర్షకులు !

సాగు దండగ కాదు సౌభాగ్య పండగని..
రైతు అప్పులోడు కాదు మెప్పులోడని..
రైతే రాజని, దేశ వెన్నెముకని నినదిద్దాం
చేసేద్దాం సాగు జీవులకు పట్టాభిషేకాలు !
(23 డిసెంబర్‌ ‘‘‌జాతీయ రైతు దినం’’ సందర్భంగా)
  – డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *