కమనీయం…శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
 రామనామస్మరణతో మారుమోగిన భద్రగిరి
 ప్రభుత్వం తరుఫున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌ శాంతి కుమారి
 పట్టు వస్త్రాలు సమర్పించిన తి

భద్రాచలం, ఏప్రిల్‌ 17 : యావత్‌ భారతదేశంలోనే  ప్రసిద్ధి గాంచిన భద్రా చలంలో బుధవారం రోజున సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మాడవీధులన్నీ భక్తుల రామనామస్మరణ లతో మారుమ్రోగాయి. జగదభిరాముని కల్యాణం తిలకించేందుకు భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా శ్రీరామ నామంను జపిస్తూ కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. స్వస్తిశ్రీ చాంద్రనామ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రశుద్ద నవమి బుధవారం నాడు లక్షలాదిగా వొచ్చిన భక్తుల జైశ్రీరామ్‌….అనే నినాదాలతో కల్యాణ మండపం అంతా మారుమ్రోగింది. తెల్లవారుజాము నుండే భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారి కల్యాణ ఘడియలు సమీపించడంతో వారికి కేటాయించిన సెక్టార్లలో కూర్చున్నారు. కల్యాణం ఆనాడు మిధిలానగరంలో జరిగిన కల్యాణానికి భిన్నంగా జరిగింది. ఆనాడు శివధనస్సు విరిచి దశరథసుతుడు శ్రీరామునికి, మిధిలా నగర రాజు జనకుని పుత్రిక సీతకు పెళ్ళి జరుగగా, బుధవారం నాడు భదాద్రి క్షేత్రం లో ప్రతీఏటా జగత్‌ కల్యాణం కోసం చతుర్భుజుడు, శంఖు చక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశగల వైకుంఠ రాముడు ఇక్కడ వరుడు కాగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు సీతమ్మ వధువుగా కల్యాణం నిర్వహించారు.

ఈ ఏడాది శ్రీ క్రోధి నామసంవత్సరంలో శ్రీరాముడు జన్మించిన రోజుకావడం విశేషం. భదాద్రిలో ఈ ఏడాది స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఉదయం 10 గంటల నుండి అభిజిత్‌లగ్న శుభ ముహూర్తమున శ్రీపాంచరాత్రగమ విధానం లో శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహో త్సవంను శిల్పకళానైపుణ్య సంశోభితమై అలరారు కల్యాణ మండపం లో అంగరంగవైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుండి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలతో వేదమంత్రాలతో ప్రత్యేక పల్లకిపై ఉదయం 10.30 నిమిషాలకు కల్యాణం జరిగే మండపంకు తోడ్కొని వొచ్చి ధగధగాయమానంగా వెలుగొందే వెండి సింహాసనంపై సీతారాములు, లక్ష్మణ, హనుమంతులను ఆసీనులు గావించారు.

image.png

తొలుత తిరునాధాన తరువాత విశ్వేక్సేన మంత్రాలతో మండపాన్ని శుద్ధి చేసి మంజునకి ప్రథమం అను మంత్రం జపిస్తూ యథాసుదర్శరాజా సంవత్సర్గం శ్రీయుద్యా ఆయుష్మే..అనే సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మవారిని కూర్చుండబెట్టి కన్యావరణాలు జరిపించి మోక్షబంధనం ప్రతిసారబంధం, ద్వితీయ, సువర్ణయజ్ఞోర్తితా ధారణలు జరిపించారు. అనంతరం ఆశీర్వచనం పాదప్రక్షాలనం, పుస్పోదకస్నావనం పూర్తి అయిన తర్వాత  స్వామివారికి వరపూజ నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు చేయించిన ఆభరణాలు అయిన పచ్చలపతకం, శ్రీరామమాడ, చింతాకుపతకం, అమ్మవారికి అలంకరించి, శ్రీరంగనాధుడు పంపిన పట్టువస్త్రాలను అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. అత్తరు, పన్నీరు, దివ్యసుగంధ ద్రవ్యాలు, మంచిగంధం, అగరు, జవ్వారి, కస్తూరి, ఘనసారములతో తయారు చేసిన సుగంధ మాలికలను స్వామివారికి అలంకరించారు.

అలాగే తేనే, పెరుగు కలిపిన పంచామృతాలను బంగారు పాత్రలో స్వామివారికి నివేదించిన పిమ్మట నూతన వస్త్రాలంకరణ చేశారు. ఊతబలి పేరుతో పొన్నంను దిష్టితీశారు. లోకపర్యంతమున ఉన్న విశ్వసృష్టిని దానితో నున్న కాలమును, సంకల్పం చెప్పి, కన్యాదానం కరిష్మే అంటూ 12. గంటలకు అభిజిత్‌ లగ్నంలో స్వామివారు, అమ్మవారి శిరస్సుపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. ఆ తరువాత శుభముహూర్తాన మాంగల్యధారణతో కల్యాణం తంతునా భదాద్రి…అంటూ చేశారు. అనంతరం భక్తరామదాసు 17వ శతాబ్దంలో చేయించిన మంగళసూత్రధారణ జరిగింది. మూడు సూత్రాలు గల ఈ మంగళసూత్రమునకు మొదటి సూత్రము కారణశక్తి గౌరి గాను, రెండవ సూత్రం జ్ఞానశక్తి శారద గానూ, మూడవసూత్రం మనోశక్తి మహాలక్ష్మీగానూ ఆగమశాసనం చెబుతుందని వేదపండితులు మంత్రోచ్ఛారణతో అశేష భక్తజనావళికి వినిపించారు.

image.png
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌ దంపతులు
ముత్యాల తలంబ్రాలు సుగంధద్రవ్యాలతో కలిపి సీతారామచంద్రమూర్తులకు తలంబ్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మండపం చుట్టూ గులాల్‌ చల్లి కల్యాణం తంతునానేనా..అంటూ ముగించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు వొచ్చిన వేలాది మంది సీతారామచంద్రమూర్తులకు జయజయధ్వానాలు పలకగా కల్యాణం జరిగిన మండపం ఆవరణలో రామనామం మారుమోగింది. కల్యాణం కమనీయంగా, కన్నులపండుగగా జరిగింది. కల్యాణంను తిలకించేందుకు భక్తులు ఉదయం 3 గంటల నుండే పవిత్ర గోదావరి నదిలో స్నానాలాచరించి, 6 గంటలకల్లా కల్యాణ మండపానికి చేరుకున్నారు.

కల్యాణం తిలకించేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల వాసులతో పాటు ప్రక్క జిల్లాలైన వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌తో పాటుగా ప్రక్కరాష్ట్రమైన ఆంధప్రదేశ్‌ నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతేకాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ తదితర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కల్యాణంలో పాల్గొని తిలకించారు. ఇది ఇలా ఉండగా మండపంలో కల్యాణం జరుగుతున్న తీరు ప్రతీ ఒక్కరూ తిలకించాలని ఉద్దేశ్యంతో మండపంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో ప్రత్యేక క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టివిలను పెట్టి భక్తులు ఇబ్బంది పడకుండా కల్యాణంను తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఏడాది జరుగుతున్న సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు కూడా భిన్నంగా ఏర్పాటు చేయడం భక్తుల్లో భక్తి పారవశ్యంను నింపింది.

తిరుకల్యాణోత్సవంలో స్థానాచార్యులు కె.ఇ.స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచర్యులు, ప్రధాన అర్చకులు అమరవాధి విజయరాఘవన్‌, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యలు. అర్చకులు సీతారామాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్‌, ముఖ్య అర్చకులు విష్ణువర్దనాచార్యులు, పరిచారకులు తిరుమల రాఘవాచార్యులు కల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.

ఒక ప్రక్క కల్యాణం జరుగుతుండగానే మరోవైపు కల్యాణం విశిష్టతను భక్తులకు అర్థమయ్యే విధంగా వ్యాఖ్యాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తి నరసింహా, హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌, దేవాదాయ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజాఅయ్యర్‌, దేవాదాయ మరియు సమాచార పౌర సంబ్నందాల శాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఐజి రంగనాధ్‌, మిషన్‌ భగీరథ ప్రత్యేక ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేంద్రమోహన్‌, జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అల, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్‌జైన్‌, ఎస్‌పి రోహిత్‌రాజ్‌, అడ్వకేట్‌ జనరల్‌ సురేంధర్‌రెడ్డి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శరత్‌, పినపాక, భద్రాచలం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి దైవజ్ఞశర్మ, ఇఓ ఎల్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుమల తిరుపతి దేవస్ధానం
భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామకళ్యాణంకు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆనవాయితీగా పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందచేసారు.ఆలయంనుండి ద్రువమూర్తులను ఆలయం నుండి కళ్యాణ మండపం వద్దకు మంగళవాయిద్యాలు,వేదమంత్రోత్సవాల మద్య స్వామివారిని తోడ్కొని వస్తుండగా తిరుమల తిరుపతి దేవస్ధానం స్వామివారికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి వేదపండితులకు అందచేసారు.ఈ తంతు ప్రతీఏటా జరుగుతుంది.త్రిదండి చినజీయర్‌ మఠం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు.డిప్యూటీ సియం బట్టి విక్రమార్క్‌ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అలాగే మంత్రులు కొండా సురేఖా దంపతులు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు.
రుమల తిరుపతి దేవస్థానం అనేడు పట్టాభిషేకం..ఏర్పాట్లు పూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *