అక్రమ నిర్మాణాలు ముమ్మరం..
ఆర్‌ఐ సహకారం..ఎమ్మార్వో చేతివాటం.!
కబ్జాకు సహకరిస్తున్న అధికారులు..
కూకట్ పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ చేసిన విషయం విదితమే.. అయినా కూడా చెరువు ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఏకంగా కూకట్ పల్లి పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ నందు ఉన్న ముళ్లకత్వ చెరువు కుంటలో పెద్ద బండరాళ్లు వేస్తూ పూడుస్తూ అందులో నిర్మాణాలు చేపడుతున్నారు కొందరు కబ్జాదారులు. ఈతతంగమంతా స్థానిక ఆర్‌ఐ కనుసన్నల్లోనే జరుగుతుందనీ, ఇతనే సదరు అక్రమార్కులతో కుమ్మక్కై చెరువు అలుగు పూడ్చి, నిర్మాణాలకు సహకరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు ఎఫ్‌టీఎల్ భూమి, బఫర్ జోన్ అన్యాక్రాంతమవుతుంది. ఇప్పటికే బఫర్ జోన్‌లో కొంత భాగం కాలనీగా ఏర్పడి కొన్ని ఇళ్లు నిర్మించుకోగా, మిగిలిన స్థలంలో మట్టినింపి చదును చేస్తున్నారు. అదే బఫర్ జోన్ పరిధిలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ స్వలాభం కోసం నీటి వనరును గొంతు సుమిలి చంపేలా చేస్తున్నారు.
నీటితో కళకళలాడుతున్న చెరువును ఉనికే లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు. కొన్ని ఎకరాలున్న చెరువు నేడు చాలా తక్కువకు కుచించుకుపోయింది. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ అనే తేడా లేకుండా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆక్రమించిందంతా తమకే అన్నట్టుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కబ్జాల జోరు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులను సైతం కబ్జాదారులు విడిచిపెట్టడంలేదు. ఆయా స్థలాలను ఆక్రమించి, చదునుచేసి విక్రయాలకు పాల్పడుతూ, అమాయక ప్రజలకు కట్టబెట్టి లక్షలు దండుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. అయినా స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుండి హైటెక్ సిటీ కూతువేటు దూరంలోనే ఉండడంతో ఈ ప్రాంతంలో భూములకు మంచి డిమాండ్ వొచ్చింది. ఎక్కడ భూమి ఖాళీగా ఉందో చూడటం, అక్రమించడమే పనిగా కొందరు కబ్జాదారులు చెలరేగిపోతున్నారు.
చెరువులను సైతం పూడ్చివేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యం, అక్రమ వ్యాపారుల ధనదాహం కలిసి చెరువులు, కబ్జాలకు గురై రికార్డులకే పరిమితమయ్యాయి. తాజాగ కూకట్ పల్లి లోని బలజీనగర్ అంబేద్కర్ నగర్ లోని ముళ్లకత్వ చెరువు ఆక్రమణలతో కుచించుకుపోయింది. నిండుకుండలా ఉన్న చెరువులో రోజుల వ్యవధిలోనే బండరాళ్లు వేసి పూడుస్తూ అప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి కుతవేటు దూరంలోనే ఇంత దౌర్భాగ్యనికి పాల్చడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారనేది తెలియడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా అమ్యామ్యాలకు అలవాటు పడి కబ్జాదారులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసి, ఇరిగేషన్ అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, జీహెచ్ ఎంసి, నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి చెరువును పూడ్చి వేస్తున్న కబ్జాను అడ్డుకుని ప్రభుత్వ చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.




