కన్నభిరాన్‌ సార్‌ను యాది చేసుకుంటూ…

ప్రముఖ హక్కుల నేత, ఆలోచనాపరుడు కె.జి. కన్నభిరాన్‌ గారు మరణించి ఈనాటికి 13 సంవత్సరాలు గడిచాయి. ఎక్కడ ఏ సామాజిక సమస్య, సంక్షోభం తలెత్తినా కన్నభిరన్‌ గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన ముగిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలంతా గత ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని, ఆ పార్టీ రాజకీయ నాయకుడు ప్రదర్శించిన అహంకారం గురించి, ప్రజల హక్కులపై ఉక్కుపాదం మోపిన వైనాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేర స్మ్రతిలోని సెక్షన్‌ 151, సెక్షన్‌ 30, సెక్షన్‌ 144లను ఎట్లా వాడారు…పోలీసులు, అధికార్లు, రాజకీయ నాయకులు  ఇంప్యూనిటీ (శిక్షాభయం లేకుండా నేరాలు చేయడం)తో ఎట్లా విర్రవీగిపోయారో చర్చించుకుం టున్నారు. ఈ సందర్భంలో కె.జి. కన్నభిరన్‌ గారు ఇంప్యూనిటీ గురించి దేవులపల్లి పబ్లికేషన్‌ సంస్థ ప్రచురించిన ‘‘24 గంటలు… కన్నాభిరాన్‌ ఆత్మకతాత్మక సామాజిక చిత్రం’’ అనే పుస్తకంలో ఏమన్నాడో తెలుసుకుందాం..
‘‘ నా యాభై ఏళ్ళ అనుభవంతో స్పష్టంగా చెప్పగలదేమంటే పోలీసుల దుర్మార్గాలను సరిచేయాలని ప్రభుత్వాలు అనుకోవడం లేదు. తాము అనాగరికంగా ప్రవర్తిస్తున్నామని తమ పని తీరు మార్చుకొని, చట్టబద్దంగా ప్రవర్తించాలని పోలీసులు అనుకోవడం లేదు. కొంత మంది చెడ్డ ఆఫీసర్లు ఉండడం వల్లనో, కొందరి దుష్ప్రవర్తన వల్లనో ఇలా జరుగుతుందని, ఇది ఒక మినహాయింపు మాత్రమేనని కొందరు అంటారు. కాని అది తప్పు. ఇది వ్యక్తిగత వ్యాధికాదు. జాతీయ పోలీసు అకాడమీనుండి పది, పదిహేను మంది పోలీసు అధికారులు వచ్చి  దుకాణాదారుణ్ణి కొట్టారంటే అది మిమహాయింపు కాదు.. అది అధికార ఉన్మాదం..! పోలీసు శాఖలో ఎందుకు చేరుతున్నామంటే అధికారం సంపూర్ణంగా దక్కుతుంది.. ఎవరినయినా అణచివేయడానికి అవకాశం దొరుకుతుంది అని  అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తప్ప అధికారం మజా తెలియదు.
ఈ రకమైన శిక్షలేని, శిక్షాభయం లేని అధికార ఉన్మాదం, ఇంప్యూనిటీ 1980ల నుంచీ పెరుగుతూనే వస్తుంది. ఈ స్వభావాన్ని  ఎంతగా పెంచి పోషించారంటే ఈ పోలీసులు ప్రయివేటు దుస్తులతో, ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలతో, నంబర్‌ ప్లేట్లులేని వాహనాలతో వచ్చి మనుషులను చంపిపోతారు.
ఈ స్వభావాన్ని వ్యతిరేకించే  పోరాటం చేయడమే పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం. ఇంతకాలం పౌరహక్కుల ఉద్యమ కారులందరమూ చేస్తున్నది, ఆ పోరాటమే..’

‘‘24 గంటలు కె.జి. కన్నభిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం’’ నుంచి

సేకరణ. ఎస్‌. జీవన్‌కుమార్‌
మానవహక్కుల వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *