రేపు వుంటుందో..రేపు వుంటానో
అనే భయాంధకారంలో దేశం రాజధాని
నడిబొడ్డున పొగమంచులో
మనమంతా బ్రతకడమెంటీ?
మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక
సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర
చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక
ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ?
భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర
నియమంగా పాటిస్తూ కనిపించకుండా
మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ?
రుతుపవనాల గమనాల మార్పుకు
ఎండల్లో వానలు..వానల్లో ఎండల
వింత అపరిచిత పోకడలు ఏంటీ?
ఓజోన్ పొర గుండెల్లో చిల్లులు పడుతూ..
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తో ప్రకృతి
పచ్చదనపు ఊపిరి ఆగిపోతుంటే
కాలుష్యం కాటులో
కర్బన ఉద్గారాల దాడిలో
తాజ్ మహల్ అందమే
గత చరితపు జ్ఞాపకంగా
వన్నె తగ్గుతుంటే
కడకి కన్నతల్లి రొమ్ము పాలు సైతం
కలుషితమవుతుంటే
కథ ఇంకా అర్థం కాదేంటీ మనకు..!
మన నిర్లక్ష్యపు నిర్వాహకానికి
అడ్డగోలుగా అడవులను నరుకుతూ
ప్లాస్టిక్ వాడకాన్ని పెంచుతూ
అభివృద్ధి అంధకారంలో జీవిస్తునందుకు
ప్రకృతి మా”నవ” నాగరికత పై
ప్రదర్శిస్తున్న విలయతాండవపు
విధ్వంసపు ప్రయాణప్రదర్శన ఇది.
విపత్తు రూపాల్లో మనల్ని వణికిస్తున్న
విద్యుత్ షాక్ ఇది.
మనిషి ఊనికి జాడ కథ
ఇక క్లైమాక్స్ దాటింది..!
వెంటనే కాలుష్యపు మత్తు వదులుకొని
మొక్కలకు ప్రాణపు నీటిబొట్లు అందిద్దాం.
ప్లాస్టిక్ వినియోగాన్ని ఓ సంకల్పంతో నివారిద్దాం.
గ్లోబల్ వార్మింగ్ పై చేయి చేయి
కలిపి వార్ డిసైడ్ చేద్దాం.
అడవి తల్లిని మనందరి అమ్మలా పూజిద్దాం.
పర్యావరణ పరిరక్షణ ఎజెండా తో
మన గుండెల నిండా మన
జాతీయ జెండాను ఎగరనిద్దాం.
భవిష్యత్ తరాలకు కాలుష్యపు రహిత
ప్రకృతి శ్వాసని కానుకగా ఇద్దాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536





