త్రిముఖ, చతుర్ముఖ పోటీలో పన్నెండు నియోజకవర్గాలు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి)
రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఉన్న కొద్ది సమయాన్ని వినియోగించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సవాళ్ళు ప్రతిసవాళ్ళు, వాగ్ధానాలు, గ్యారెంటీలు, మానిఫెస్టోలతో రాష్ట్ర మంతా హోరోత్తి పోతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ స్థానాలను సాధించుకునేది ఇదిమిద్దంగా చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడికిపోయినా ద్వంద్వ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి పాలనలో మార్పు అవసరమని కొందరు, గతంలోలేని సంక్షేమ ఫలాలాను అనుభవిస్తున్నదశలో మార్పు చేటును తెస్తుందని మరికొందరు తమ అభిమతాన్ని వ్యక్తపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూసినా, మొత్తంమీద చూపినా గతంలోలాగా ఏకపక్షంగా ప్రజలు తీర్పుఇచ్చే పరిస్థితిమాత్రం కనిపించడంలేదు. గతఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలకుగాను పది స్థానాలను భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) గెలుచుకుంది. మిగతా రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నా భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్‌ఎస్‌లోచేరి ప్రస్తుతం ఆదే స్థానంనుండి పోటీ చేస్తుండడంతో ఆ స్థానంకూడా ఈసారి తమకే దక్కుతుందని బిఆర్‌ఎస్ ఆశిస్తోంది. ఇక మిగిలిన ములుగు నియోజకవర్గానికి సంబందించి కాంగ్రెస్ అభ్యర్ధిగా సీతక్క అలియాస్ దనసరి అనసూయ బిఆర్‌ఎస్‌తో గట్టి పోటీని ఎదుర్కుంటున్నది. సీతక్క మాజీ నక్సలైట్ కాగా, నక్సలైట్ ఉద్యమంలో ఉన్నతస్థాయికి ఎదిగిన బడే నాగేశ్వర్‌రావు కూతురు బడే నాగజ్యోతి బిఆర్‌ఎస్ పక్షాన పోటీచేస్తుండడంతో వీరిద్దరిలో స్థానిక ప్రజలు ఎవరి పక్షాన తీర్పు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. ములుగు నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు చేయబడిరది. ఆదివాసీలు అధిక సంఖ్యలో నివసించే జిల్లా కావడం, ఒక విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిగా వెనుబడిన ప్రాంతం కావడంతో ఓట్లను అర్జించేందుకు దారులుకూడా సరిగాలేని మారుమూల పల్లెలకు వెళ్ళేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయంలో స్థానిక ఎంఎల్‌ఏ సీతక్క ఒక అడుగు ముందుందనే చెప్పాలె. ప్రపంచాన్ని వణికిచ్చిన కరోనా సమయంలోగాని, జిల్లాలో విపరీత వర్షాలకారణంగా సంభవించిన వరదల్లో ఈ మారూమూల ప్రజలను ఆదుకునే విషయంలో ఆమె నిత్యావసర వస్తువులను నెత్తినపెట్టుకుని కాలినడకన వాగులు, వంకలు దాటుకుని వెళ్ళి వారికి సరుకులు అందించిందన్న మంచిపేరుంది. దానికి తగినట్లుగా ప్రజలిప్పుడు మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తిరిగి తనకే ములుగు పట్టం కడుతారన్న నమ్మకం ఆమెకుంది. ముందుగానే చెప్పుకున్నట్లు బడే నాగజ్యోతి మొదటిసారిగా శాసనసభకు పోటీ చేస్తున్నది. తండ్రి, తల్లి ఇద్దరు నక్సల్స్ మూమెంట్‌లో అసువులు బాసిన సింపతి ఆమెకుందంటున్నారు. ఇన్‌ఛార్జి జడ్‌పి చేర్‌పర్సన్‌గా కొనసాగుతున్న నాగజ్యోతి ప్రజాసేవలో సీతక్కకన్నా తీసిపోనంటోంది.
అధికార పార్టీ అండదండలు, బిఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తనను తప్పక గెలిపిస్తాయన్న నమ్మకం ఆమెకున్నప్పటికీ, దోపిడీ పార్టీపక్షాన పోటీచేయడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఆమెకు నక్సలేట్ల మద్దతున్నదన్న వార్తలు వస్తుండగా, తమకు ఈ ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేదని నక్సలైట్లు ప్రకటిస్తున్నారు. ఇకపోతే వీరిద్దరితో సమానంగా పోటీపడుతున్న బిజెపిఅభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్. గతంలో తెలుగుదేశం పార్టీ మొదలు బిఆర్‌ఎస్ పార్టీ వరకు మంత్రిగా, ఎంపిగా పలు పదవులు నిర్వహించిన దివంగత్ అజ్మీరా చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్. పై ఇద్దరు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారైతే, ప్రహ్లాద్ లంబాడా సామాజిక వర్గానికి చెందినవాడు. తన తండ్రి కాలంనుండి నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంభాదాలు ఆయన్ను గెలిపిస్తాయం టున్నాయి బిజెపి వర్గాలు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో ఎస్టీ నియోజకవర్గమైన మహబూబాబాద్‌లో త్రికోణ పోటీ ఉంది. ప్రస్తుతం ఇక్కడినుండి పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ ఇప్పటికే రెండు సార్లనుండి ఆ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక పోడుభూముల సమస్యఉన్న ప్రాంతంకావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటబడి ఆ సమస్యను పరిష్కరించి, పోడు పట్టాలను ఇప్పించిన పేరుంది. దానితోపాటు గిరిజన సంక్షేమ పథకాలుకూడా ఇక్కడ ఎక్కువగానే అమలులో ఉన్న కారణంగా ఈసారి హ్యాట్రిక్ తప్పనిసరి అంటున్నారు శంకర్‌నాయక్ అభిమానులు. కాగా ఆయన్ను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, బిజెపి అభ్యర్థి యువ పారిశ్రామికవేత్త ఇద్దరుకూడా మొదటిసారిగా పోటీపడుతున్నవారే. పోడుభూముల పట్టాల విషయంలో సమగ్రన్యాయం జరుగలేదన్నదది వీరి ఆరోపణ.
డోర్నల్ ఎస్టీ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి ధరంసోత్ రెడ్యానాయక్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంలో, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సురీర్ఘకాలం మంత్రిగా కొనసాగిన అనుభవం ఉంది. 1989 నుండి ఆయన ఆరుసార్లు ఎంఎల్‌ఏగా నెగ్గుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏడవసారికూడా విజయం సాధిస్తానని చెబుతున్న రెడ్యానాయక్ ఇదే తన చివరి ఎన్నికఅనికూడా ప్రచారం చేసుకుంటున్నారు. తాను మంత్రిగా, ఎంఎల్‌ఏగా ఈ ప్రాంతానికి చేసిన పనులే తనను గెలిపిస్తాయంటున్నాడాయన. ఇక్కడ భాజపా ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది. నర్సింహులపేట జడ్పీటిసీగా కొనసాగుతున్న భూక్యా సంగీత మొదటిసారిగా పోటీపడుతోంది. కాగా ఈ నియోజకవర్గంనుండి ఇప్పటికే రెండు సార్లు పోటీచేసి ఓడిన డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ కాంగ్రెస్ తరఫున పోటీ పడుతున్నారు. గతంలో ఓడినప్పటికీ ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుండంతో స్థానికుల తలలో నాలికగా మొదులుతున్నారు. నిరాసక్తితో ఉన్న నిరుద్యోగ యువతంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారనుకుంటున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన వర్థన్నపేటలో సిట్టింగ్ ఎంఎల్‌ఏ ఆరూరి రమేష్ మాజీ ఎంఎల్‌ఏ కొండేటి శ్రీధర్‌నుండి గట్టి పోటీని ఎదుర్కుంటున్నారు. గత ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలువడంతో బిజెపి ఈసారి శ్రీధర్‌నే తిరిగి తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కాంగ్రెస్ ఇక్కడ రిటైర్డ్ పోలీసు అధికారి కెఆర్ నాగరాజును నిలబెట్టింది. కొత్తగా రాజకీయ అరంగెట్రం చేస్తున్న నాగరాజు నియోజకవర్గ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. స్థానిక ఎంఎల్‌ఏ ఆరూరి రమేష్‌పైన ఉన్న భూవివాదాలు, యువత నిర్లక్ష్యం తమకు అనుకూలిస్తామనుకుంటున్నారు.
అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎంఎల్‌ఏ తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి ఇక్కడ బిఆర్‌ఎస్ టికట్ ఇచ్చింది. వాస్తవంగా ఇద్దరి నియోజకవర్గం ఇదే కావటం, ఇద్దరుకూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవులు నిర్వహించినవారు కావడంతో ఒకరికొకరు ఏమేరకు సహకరించుకుని విజయం సాధిస్తారని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటి టిడిపి నేటి బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, భారస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని శ్రీహరి నమ్మకంగా ఉన్నారు. ఆయనకు బిజెపి నుండి డాక్టర్ గుండేటి విజయరామారావు గట్టి పోటీ ఇస్తున్నారు. విజయరామారావు తెలంగాణ మలివిడుత ఉద్యమం శ్రీకారం చుట్టినప్పటినుండీ పనిచేసిన వ్యక్తి. ఈ నియోజకవర్గంనుండి 2004లో ఎంఎల్‌గా గెలవడంతోపాటు గతంలో ఎంపిగా ఎన్నుకోబడినవాడు. కాగా గత ఎన్నికల్లో ఈ స్థానంనుండి పోటీచేసి రెండస్థానంలో నిలిచిన ఇందిరను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ తీవ్రస్థాయిలో కొనసాగుతున్నది. అలాగే పరకాలలోకూడా త్రికోణపోటీ జరుగుతున్నది. ఇక్కడ సిట్టింగ్ ఎంఎల్‌ఏ చల్లా ధర్మారెడ్డికే భారస తిరిగి టికట్ ఇచ్చింది. కాగా కాంగ్రెస్‌నుండి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బిజెపినుండి డాక్టర్ కాళీప్రసాద్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. కాళీ ప్రసాద్ మొదటిసారిగా రాజకీయ అరంగెట్రం చేసి, ఇక్కడ పోటీ పడుతున్నారు. వరంగల్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్‌గా ప్రజలకు ఆయన సుపరితుడే. కాగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన నర్సంపేట మాజీ ఎంఎల్‌ఏ. ఆయన స్థానికేతరుడన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. అయితే ప్రభుత్వమీద ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందనుకుంటున్నారు బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు.
జిల్లా ప్రజలకు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నది జనగామ నియోజకవర్గం. ఇక్కడకూడా సిట్టింగ్ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కాదని ఎంఎల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి భారస టికట్ ఇచ్చింది. దీనికి అలిగిన ముత్తిరెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే రాజేశ్వర్‌రెడ్డికి పెద్దలు జ్ఞాపకం వచ్చారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకూడా స్థానికుడు మాజీ ఎంఎల్‌ఏ పొన్నాల లక్ష్మయ్యను కాదని చేర్యాల ప్రాంతానికి చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి కాంగ్రెస్ టికట్ ఇవ్వడంతో లక్ష్యయ్య కారెక్కాడు. రాజేశ్వర్‌రెడ్డికి లక్ష్మయ్య సహకారంతో గట్టెక్కుతాననుకుంటున్నారు. అలాగే బిజెపి నుంచి దశమంతరెడ్డి, సిపిఎం నుండి కనకారెడ్డి పోటీ పడుతుండడంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నడుస్తున్నది. భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య తీవ్రపోటీ జరుగుతున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి ఇప్పుడు బిఆర్‌ఎస్ పక్షాన పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న గండ్ర సత్యనారాయణ బిఆర్‌ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. సత్యనారాయణ గత ఎన్నికల్లో ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా పోటీచేసి రెండవస్థానంలో నిలిచిన వ్యక్తి. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న సింగరేణి కార్మికులు, కాంగ్రెస్ గ్యారంటీలు తమ గెలుపుకు దోహదపడుతాయనుకుంటున్నారు. నర్సంపేటలో ఇద్దరు సమఉజ్జీల మధ్య తీవ్ర పోటీ నడుస్తున్నది. 2014లో బిఆర్‌ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి నెగ్గిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ టికట్‌పై సిట్టింగ్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పెద్ది సుదర్శన్‌రెడ్డి పైన పోరాడుతున్నారు. ఇద్దరు యువకులే కావడంతో యువశక్తిని తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ నియోజకవర్గానికి గోదావరి నీటిని తరలించడంలో కృషిచేసిన సుదర్శన్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడమేకాకుండా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మాధవరెడ్డికి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజలే అండగా నిలుస్తారన్న ఆశ ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి సంబందించిన రెండు నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు ఒక విధంగా యుద్దమే చేస్తున్నాయి. ఈ రెండు నియోజకర్గాలను సాధించుకుంటే తలమానికంగా ఉంటుందన్నది రాజకీయ పార్టీల అభిప్రాయం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వస్తే అయిదుసార్లనుండి ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేస్తున్న దాస్యం వినయ్‌భాస్కర్ అయిదవసారి తన గెలపుకోసం గత ఆరు నెలలుగా విపరీతంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందునుండే ఆయన నియోజకవర్గంలోని పలు సంఘాలు, సంస్థలు, గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతున్నారు. ఉదయంనుండి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వినయ్‌భాస్కర్ సోదరుడు, మాజీ మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్‌కు ఈ నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన సోదరుడిగా వినయ్‌కూడా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడం, ప్రధానంగా యువకుల మద్దతు ఉండడం, ప్రభుత్వ పథకాలు ఆయనకు ఉపకరించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బిజెపిలు గతంలో ఈ నియోజకవర్గాన్ని గెలుచుకున్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటి ఉనికి తగ్గింది. అయితే ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలిప్పుడు విజృంభిస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీనుండి మొదటిసారిగా అవకాశం లభించిన నాయిని రాజేందర్‌రెడ్డికి నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం అండదండలున్నాయంటున్నారు. కాగా బిజెపి అభ్యర్థి రావు పద్మకూడా మొదటిసారిగా పోటీ పడుతున్నారు. బిజెపి ప్రకటించిన బిసీ సిఎం అభ్యర్థి నినాదం, ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ తనకు అనుకూలించే అవకావాలున్నాయంటోంది. కాగా అధికారపార్టీపై వస్తున్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.
వరంగల్ తూర్పులో పోటీపడుతున్నవారంతా హేమాహేమీలే కావడంతో నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంఎల్‌ఏ నన్నపునేని నరేందర్ రెండవసారి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖలాంటి కొండతో ఢీకొనబోతున్నారు. కాగా బిజెపి నుండి ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఇక్కడ త్రికోణపోటీ కొనసాగుతున్నది. అయితే గతంలో ఇదేనగరంలో మేయర్‌గా పనిచేసిన నరేందర్ తనపనితనాన్ని ప్రత్యేకంగా రుజువుచేసుకోవాల్సిన అవసరంలేదని, దానికితోడు ప్రభుత్వ పథకాలు తనకు కలిపివచ్చే అంశాలని భావిస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గంనుండి ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖకు కాంగ్రెస్ దూకుడు కలిసి వస్తుంద నుకుంటున్నారు. ఇటీవల రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటనలు తమకు అనుకూలిస్తాయనుకుంటున్నారు. 2009లో పిఆర్పీ టికట్‌పై ఇక్కడ పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన ప్రదీప్‌రావు వివాదాలకు దూరంగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది. బిఆర్‌ఎస్‌లో మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈయన స్వయాన సోదరుడు. పార్టీ ప్రకటించిన బిసి సిఎం, ఎస్సీ వర్గీకరణకు మోదీ ఇచ్చిన హామీ తన గెలుపుకు కలిసి వచ్చే అంశాలనుకుంటున్నారు.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల