ఒక్క మునుగోడు కోసం ఇంతగా అలజడా

  • ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు దారుణం
  • తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర: ఓవైసీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్‌కు, మహ్మాద్‌ ‌ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయిందన్నారు. రాజాసింగ్‌ ‌విచారణను పోలీసులు రికార్డు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కునాలని ఓవైసీ డిమాండ్‌ ‌చేశారు. ముస్లింలను విమర్శిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌వీడియో విడుదల చేశారు. రాజాసింగ్‌ ‌చర్యను ఖండించిన అసదుద్దీన్‌ ఓవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ముస్లింలను విమర్శించడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఎర్రకోటపై నిల్చుని పెద్ద ప్రసంగం ఇచ్చిన మోడీ… చిత్తశుద్ధి ఉంటే ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని బీజేపీ నాయకులు చూస్తున్నారన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్న ఓవైసీ…ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా అని ప్రశ్నించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వెంటనే అరెస్టు చేసిన రాష్ట్ర సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *