ఒకరోజు వ్యవధిలో రాష్ట్రానికి ఇద్దరు అగ్రనేతలు

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

ఒకరోజు తేడాతో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు జాతీయస్థాయి  అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తలపిస్తుండగా, వీరిరాకతో వాతావరణం మరింత హోరెత్తే అవకాశముంది. దేశంలోని  రాజకీయ పార్టీలన్నీ కలిసి  తాజాగా  రెండు కూటములుగా విభజించబడ్డాయి. బిఆర్‌ఎస్‌, ‌వైఎస్‌ఆర్‌సిపి లాంటి ఒకటిరెండు పార్టీలు ఏ కూటమికి చెందనివిగా ఉన్నప్పటికీ ఈ పార్టీల మీద కూడా పరోక్షంగా ప్రధాన పార్టీల ముద్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉండగా, రాజకీయపార్టీలు తమ బలాబలాలను బేరీజు వేసుకునే అవకాశం  తెలంగాణలో ఇప్పుడు ఏర్పడింది. ఈసారి తెలంగాణపైన ఎట్టి పరిస్థితిలో తమ జంఢానే ఎగురాలని ఈ రెండు కూటములకు సారథ్యం వహిస్తున్న బిజెపి, కాంగ్రెస్‌లు లక్ష్యంగా చేసుకున్నాయి.

మరో మూడునాలుగ నెలల్లో ఇక్కడ జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఇటీవల ప్రధాని మోదీ వరంగల్‌ ‌పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హైదరాబాద్‌లో పర్యటించి వెళ్ళారు. అ వెనువెంటనే తెలంగాణరాష్ట్ర రాజకీయాలను తన భుజాలపై వేసుకున్న ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గత నెల 15న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిధిగా రావాల్సి ఉండింది.  కాని, తుఫాను, మణిపూర్‌ అలర్ల కారణంగా ఆయన పర్యటన అర్థాంతరంగా నిలిచిపోయింది. వర్షాలకారణంగా ఖమ్మంలో నిలిచిపోయిన సభ నిర్వాహణ సాధ్యం కాకపోవడంతో ఆయన పర్యటన ప్రస్తుతానికి హైదారాబాద్‌కే పరిమితం చేశారు. రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పులు జరిగిన తర్వాత మొదటిసారిగా అమిత్‌షా తెలంగాణలో ఈ నెల 29న పర్యటించబోతున్నారు. సంస్థాగత మార్పులతో పాటు పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతర్ఘత విభేదాలను  ఆయన ఇప్పుడు పరిష్కరించాల్సి ఉంది. కార్యకర్తల్లోని నైరాశ్యాన్ని పారదోలి వారికి ధైర్యాన్ని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై పడింది.

కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్‌షా రాక సందర్భంగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న పార్టీ లక్ష్యానికి తగినట్లుగా వ్యూహరచనాపరుడిగా  పేరున్న అమిత్‌షా  పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించబడిన కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌తో ఇప్పటికే ఆయన తెలంగాణ పరిస్థితులు, ఎన్నికల వ్యూహంపై చర్చించడమైంది. అలాగే నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కూడా ఒక విడుత సమాచారాన్ని ఆయన రాబట్టుకున్నారు. తెలంగాణ రాజకీయాలు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆయన పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే వందరోజుల కార్యక్రమం పార్టీ ముందున్నది. దీనికితోడు ప్రతీనెల ఒక కార్యక్రమంతో ప్రజలముందుకు వెళ్ళాలన్న ప్రణాళిక ఒకటి ఆ పార్టీకుంది. కాగా ఎన్నికలను ధీటుగా ఎదుర్కునేందుకు 22 కమిటీలను ఏర్పరుచుకోవాలని పార్టీ నిర్ణయించుకుంది.  అన్నిటికీ మించి పార్టీలో చేరికల పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నట్లు తెలస్తున్నది. అందులో భాగంగా ఆయన ఈ పర్యటనలో పలు సామాజిక వర్గాల ప్రముఖులతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి.

కర్ణాటక  ఫలితాలతో మంచి ఊపులోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌తెలంగాణలో ముందుకు దూసుకుపోతోంది. తమకు పోటీ బిఆర్‌ఎస్‌తోనే గాని బిజెపితో కాదని చెబుతున్న కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూకడుతున్న వారితో ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలో చేరిన సందర్భంగా ఖమ్మంలో  ప్రజాగర్జన పేరున ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ధీటుగా ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో  ఏర్పాటు చేస్తున్న సభలో ముఖ్యఅతిధిగా పాల్గొనేందుకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వొస్తుండడంతో ముఖ్యంగా మహిళలు, యువకుల్లో  ఉత్సాహం ఉరకలేస్తున్నది.. ఖమ్మం సభలో రాహుల్‌ ‌పాల్గొని ‘చేయూత’ కార్యక్రమాన్ని ప్రకటించగా, కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ మహిళా డిక్లరేషన్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే వరంగల్‌ ‌వేదికగా రాహుల్‌గాంధీ• రైతు డిక్లరేషన్‌ ‌ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత  హైదరాబాద్‌  ‌వొచ్చిన ప్రియాంక యూత్‌ ‌డిక్లరేషన్‌ను విడుదల చేశారు. కాగా కొల్లాపూర్‌లో విడుదలచేసే మహిళా డిక్లరేషన్‌లో మహిళలకు అత్యంత ప్రాధాన్యతను కలిపించే నిర్ణయాలుండే అవకాశం ఉంటా యనుకుంటున్నారు. జనభాలో సగం ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కలిపించాలన్న లక్ష్యంగా ఈ డిక్లరేషన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. బిజెపి పక్షాన అమిత్‌షా తమ పార్టీ గెలుపును భుజాన వేసుకున్నట్లు, కాంగ్రెస్‌ ‌గెలపు వ్యూహరచన ప్రియాంక కనుసన్నల్లో జరుగుతుందనుకుంటున్నారు. బిజెపి గ్రాఫ్‌ ‌పడిపోతున్నదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు, ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారుకూడా  కాంగ్రెస్‌ ‌వైపు చూస్తుండడంతో ఆ పార్టీ బలాన్ని సంతరించుకుంటోంది. జిట్టా బాలక్రిష్ణారెడ్డి లాంటి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిలాంటివారు కూడా ఇప్పుడు బిజెపిని విడిచి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం  చేసుకుంటుండడంతో రేపటి ప్రియాంక పర్యటనలో ఆ పార్టీలో చేరికల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *